న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు.
500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు.
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్‌లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment