సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/మాదాపూర్: యువతకు ఉద్యోగాల కల్పన దిశగా ఆలోచించే నాయకత్వం దేశానికి అవసరమని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్ మన దేశం నుంచి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని, భారత్‌లో మాత్రం ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని దుయ్యబట్టారు.
మన దేశంలో కూడా ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్‌గా ఎదుగుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ (ఆవిష్కరణ,), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత అభివృద్ధి) అనే మూడు ‘ఐ’ల పై దృష్టి సారించిందని చెప్పారు. దేశ జనాభాలో కేవలం 2.5 శాతమే ఉన్న తెలంగాణ.. దేశ జీడీపీకి 5 శాతం సమకూరుస్తోందన్నారు.
దేశానికి నాయకత్వం వహిస్తున్న వారు కేవలం ఎన్నికల కోసమే పనిచేస్తున్న పరిస్థితి ఉందని పరోక్షంగా ప్రధాని మోదీనుద్దేశించి విమర్శించారు. తెలంగాణలో అతిపెద్ద లైఫ్‌సైన్స్ యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్‌డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంలో భాగంగా ‘5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ– తెలంగాణ తోడ్పాటు’పై గురువారం నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
యువత ఎదురుచూస్తోంది..
మన దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని కేటీఆర్ చెప్పారు. దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయకపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్ కన్నా విస్తీర్ణంలో చిన్నగా ఉండే సింగపూర్ అభివృద్ధిలో మాత్రం వేగంగా ముందుకెళ్తున్నదని చెప్పారు.
గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఎనిమిదేళ్లలో 47 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను నాలుగేళ్లలోనే పూర్తిచేశామన్నారు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ సీపీవో శ్రీనివాస్ ఉడుముల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment