
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. గిరిజనులు విపత్తుల బారిన పడినప్పుడు ఆదుకునే విధంగా కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్టీ విపత్తు నిధిని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనల ను పరిశీలించిన సర్కారు కొత్త కార్యక్రమానికి పచ్చజెండా ఊపేసింది. తాజాగా ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ‘విపత్తు నిధి’కి సంబంధించి మార్గరద్శకాలు వెలువడే అవకాశముంది.
ఏమిటీ ‘విపత్తు నిధి’...
ఆర్థిక అభివృద్ధితోపాటు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. విపత్తులు సంభవించినప్పుడు సైతం ప్రత్యేక కేటగిరీలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా పథకాలున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజను లు ఎక్కువగా పకృతి వైపరీత్యాలకు లోనవు తుంటారు. కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు మాత్రమే ప్రమాదాలకు గురవుతుంటారు. అలాంటి సందర్భంలో నిబంధనలకు లోబడి ఆపద్బంధు పథకం అమలు చేస్తారు. ఎలాంటి ప్రమాదమైనా, ఎంత నష్టం జరిగినా ఈప్రత్యేకనిధి ఏర్పాటుతో ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం కచ్చితంగా అందుతుంది.
ఈ నిధి వినియోగంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సర్వాధికారాలు ఇవ్వనుంది. ఒక లబ్ధిదారుకు సంబంధించి రూ.25 వేల వరకు ఆర్థిక సాయాన్ని కలెక్టర్‌గాని, ఐటీడీఏ పీవోగాని నేరుగా అందించే అవకాశముంటుంది. రూ.50 వేలలోపు ఆర్థిక సాయమైతే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకుంటారు. అంతకు మించితే ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. సీఎం ఆమోదం సైతం లభించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment