స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
►నష్టాల్లో ముగిసిన సూచీలు
►ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు
ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనున్న నేపథ్యంలో బుధవారం ప్రపంచ మార్కెట్ల బాటలోనే భారత్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై..చివరకు స్వల్పనష్టాలతో ముగిసాయి. 32,499–32,383 పాయింట్ల మధ్య కదలిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 1.86 పాయింట్ల నష్టంతో 32,400.51 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 10,171–10,134 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు గురైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6.40 పాయింట్ల నష్టంతో 10,141.15 పాయింట్ల వద్ద ముగిసింది.ఆసియా, యూరప్ దేశాల సూచీలు కూడా ఇదేరీతిలో బలహీనంగా ముగిసాయని విశ్లేషకులు చెప్పారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. ఫెడ్ మీట్ నేపథ్యంలో వరుసగా రెండోరోజు భారత్ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ముగిసాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో రేట్ల సవరణ, పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్‌టీలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టినిలిపారని ఆయన వివరించారు.
టెలికం షేర్లలో చురుగ్గా ట్రేడింగ్..: ఇంటర్ కనెక్టివిటీ ఛార్జీల్లో భారీ కోత విధించిన నేపథ్యంలో బుధవారం టెలికం షేర్లు చురుగ్గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్–30 షేర్లలో అధికంగా డాక్టర్ రెడ్డీస్ లాబ్ షేరు 3.33% పెరిగింది.