ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవడానికి రోజుకో కారణం దొరుకుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచి పతనమవుతూ వచ్చిన మార్కెట్లు, ఏదో నిన్న మాత్రం షార్ట్ కవరింగ్ కలసివచ్చి కొనుగోళ్లతో కళకళలాడాయి. నేడు కూడా అదే జోష్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ జోష్ ఎంతో సేపు నిలువలేదు. మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ తన పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుందనే వార్తల నేపథ్యంలో మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి స్టాక్ మార్కెట్లు. మరికొన్ని గంటల్లో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా వడ్డీరేట్లను పెంచుతుందనే మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీంతో సెన్సెక్స్ మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి 250 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11,050 మార్కు కిందకి దిగొచ్చింది.
ముఖ్యంగా ఫైనాన్సియల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు దేశీయ సూచీలను పడగొడుతున్నాయి. ఆటోమొబైల్స్, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లలో కూడా ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం కిందకి పడిపోయింది. టాప్ లూజర్లుగా టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్‌లు నష్టాలు గడిస్తున్నాయి. యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌజింగ్ మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. అటు ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలతో బంగారం ధరలు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. రెండు రోజుల పాటు సమావేశమైన ఫెడ్ పాలసీ కమిటీ భేటి నేటితో ముగుస్తుంది. నేడు ఫెడ్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఒకవేళ ఫెడ్ రేట్లు పెరిగితే, రూపాయి విలువ మరింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment