Ben Bernanke
-
Nobel Prize- 2022: ముగ్గురికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: తీవ్ర ఆర్థికమాంద్యంలో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు అహర్నిశలు కృషిచేసిన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ బెర్నాంకీని ఆర్థికశాస్త్ర నోబెల్ వరించింది. ఆయనతోపాటు బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలపై కీలక పరిశోధనలు చేసిన మరో ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ.డైమండ్, ఫిలిప్ హెచ్.డైబ్విగ్లకు సోమవారం ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ‘బ్యాంక్‌లు కుప్పకూలకుండా చూసుకోవడం మనకు ఏ విధంగా అత్యంత ముఖ్యమైన అంశం’ అనే దానిపై ఈ ముగ్గురి శోధన కొనసాగిందని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్‌లోని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థికవ్యవస్థలను సంస్కరించాలనే పునాదులను ఈ ముగ్గురు 1980 దశకంలోనే వేశారని ఆర్థిక శాస్త్రాల నోబెల్ కమిటీ అధినేత జాన్ హస్లర్ చెప్పారు. ‘ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేసేవి ముఖ్యంగా రెండే. అవి ఆర్థిక సంక్షోభం, ఆర్థికమాంద్యం. వీటి నివారణ, సమర్థవంతంగా ఎదుర్కోవడం అనే వాటిలో వీరి పరిశోధనలు ఎంతగానో సాయపడనున్నాయి’ అని హస్లర్ అన్నారు. 68 ఏళ్ల బెర్నాంకీ ప్రస్తుతం ఒక బ్రోకింగ్ ఇన్స్టిట్యూట్ కోసం పనిచేస్తున్నారు. ఈయన 1930లో అమెరికా చవిచూసిన మహామాంద్యం మూలాలపై పరిశోధన చేశారు. ఆనాడు ఆందోళనకు గురైన జనం ఒక్కసారిగా బ్యాంక్‌ల నుంచి మొత్తం నగదును ఉపసంహరించుకుంటుంటే బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలడం, తదనంతరం ఊహించనిస్థాయికి ఆర్థికవ్యవస్థ కుప్పకూలడం లాంటి వాటిపైనా బెర్నాంకీ పరిశోధన చేశారు. అంతకుముందు షికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 68 ఏళ్ల డగ్లస్ డైమండ్, సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 67 ఏళ్ల ఫిలిప్ డైబ్విగ్లు బ్యాంక్ డిపాజిట్లకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటే సంక్షుభిత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఎలా నిలబడగలదో అనే అంశాలపై పరిశోధన కొనసాగించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు సాయపడేలా 1983లోనే డైమండ్, ఫిలిప్ సంయుక్తంగా ‘ బ్యాంక్ రన్స్, డిపాజిట్ ఇన్సూరెన్స్, లిక్విడిటీ’ రచన చేశారు. బెర్నాంకీ 2007–08 కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలోపెట్టేందుకు స్వల్పకాలిక వడ్డీరేట్లను సున్నాకు తెచ్చారు. ఈయన నేతృత్వంలో ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికమాంద్యం నుంచి త్వరగా గట్టెక్కింది. 2020 తొలినాళ్లలో కోవిడ్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2020నాటి ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జోరోమ్ పావెల్ సైతం ఇవే నిర్ణయాలను అమలుచేసి వ్యవస్థను మళ్లీ దారిలోపెట్టడం గమనార్హం. 1930నాటి మహామాంద్యం చాలా సంవత్సరాలు తీవ్రస్థాయిలో కొనసాగడానికి గల కారణాలను 1983నాటి పరిశోధనా పత్రంలో బెర్నాంకీ విశదీకరించారు. డిపాజిటర్లు డబ్బంతా బ్యాంక్‌ల నుంచి ఉపసంహరించుకోవడంతో ఆర్థికవ్యవస్థకు కీలకమైన కొత్త రుణాలను మంజూరుచేయలేక బ్యాంక్‌లు కుప్పకూలాయని బెర్నాంకీ కనుగొన్నారు. ఇవి బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా అర్థంచేసుకునేందుకు సాయపడుతున్నాయని నోబెల్ కమిటీ అధినేత హస్లర్ అభిప్రాయపడ్డారు. -
రేపు ముంబైలో బెన్ బెర్నాకీ
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ షాలోమ్ బెర్నాకీ మంగళవారం ముంబై రానున్నారు.కోటక్ మహీంద్రా బ్యాంక్ రెండోసారి ఏర్పాటు చేస్తోన్న మేధో నాయకత్వ సమావేశం, కోటక్ ప్రిసీడియమ్కు బెర్నాకీ ఈ ఏడాది ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు రెండు సార్లు చైర్మన్‌గా(2006 నుంచి 2014 వరకూ) పనిచేసిన బెర్నాకీ ముంబై సందర్శించడం ఇది రెండోసారి. ఇక మంగళవారం సాయంకాలం ఇక్కడ జరిగే కోటక్ ప్రిసీడియమ్లో పలువురు కీలక ప్రభుత్వాధినేతలు, వ్యాపార దిగ్గజాలు పాల్గొంటారని కోటక్ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు, సెబీ చీఫ్ యు.కె. సిన్హా, ఐఆర్డీఏ చీఫ్ టి.ఎస్. విజయన్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, అంబానీ సోదరులు, దీపక్ పరేఖ్, కుమార మంగళం బిర్లా, ఆది గోద్రేజ్ వంటి వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ బ్యాంకుల అధినేతలు కూడా పాల్గొంటారని ఈ వర్గాలు వెల్లడించాయి. అయితే రఘురామ్ రాజన్ వాషింగ్టన్లో ఉన్నందున ఆయన ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చు. -
అమెరికా చరిత్రలో తొలి మహిళా...జానెట్ యెలెన్
అమెరికా చరిత్రలో యూఎస్ ఫెడరల్ రిజర్వు సిస్టమ్ చైర్మన్ పదవి పగ్గాలను తొలిసారి ఓ మహిళ చేజిక్కించుకున్నారు. యూఎస్ ఫెడ్ చైర్ పర్సన్ గా జానెట్ యెల్లెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2013 లో అక్టోబర్ 9 తేదిన జానెట్ యెల్లెన్ ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫెడ్ వైస్ చైర్ పర్సన్ గా యెల్లెన్ సేవలందించారు. 2018 ఫిబ్రవరి 3 తేది వరకు ఫెడ్ చైర్ పర్సన్ గా యెల్లెన్ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకు ఫెడ్ రిజర్వ్ చైర్మన్ గా బెన్ బెర్నెంకే వ్యవహరించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెంచడానికి బాండ్ల కొనుగోళ్లలో కొత, వడ్డీ రేట్లలో తగ్గింపు అంశాలు యెల్లెన్ కు సవాల్ గా నిలువనున్నాయి. అమెరికా ఆర్ధిక మాంద్యంలో చిక్కుకున్న సమయంలో అనుసరించిన వడ్డీ రేట్ల పెంపు అనుభవం యెల్లెన్ కు కలిసివచ్చే అంశమని ఆర్ధిక రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఫెడ్ చైర్ ఉమన్‌గా యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్ ఉమన్‌గా 67 ఏళ్ల జానెట్ యెలెన్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. దీంతో 100 ఏళ్ల ఫెడరల్ రిజర్వ్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ఆ పదవిని అధిష్టిస్తున్నట్లయింది. తాజా పరిణామాలతో... ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ స్థానంలో తొలి చైర్‌ఉమన్‌గా యెలెన్ పదవిని చేపట్టనున్నారు. హాజరైన సెనేటర్లలో 56 మంది అనుకూలంగా, 26 మంది వ్యతిరేకంగా ఓటేయటంతో యెలెన్ నియామకం ఖరారైంది. ఈమె ప్రస్తుతం ఫెడ్‌కు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై వ్యాఖ్యానిస్తూ... ఉద్యోగ అవకాశాలకు ఊతమివ్వడం, అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధించడానికి సమర్థమైన నాయకత్వం లభించినట్లయిందన్నారు. నాలుగేళ్ల పదవీకాలం గల ఫెడ్ చైర్మన్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన బెర్నాంకీ ఈ నెల 31న పదవీ విరమణ చేస్తారు.