ఫెడ్ చైర్ ఉమన్‌గా యెలెన్
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్ ఉమన్‌గా 67 ఏళ్ల జానెట్ యెలెన్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఆమోదించింది. దీంతో 100 ఏళ్ల ఫెడరల్ రిజర్వ్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ఆ పదవిని అధిష్టిస్తున్నట్లయింది. తాజా పరిణామాలతో... ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ బెన్ బెర్నాంకీ స్థానంలో తొలి చైర్‌ఉమన్‌గా యెలెన్ పదవిని చేపట్టనున్నారు. హాజరైన సెనేటర్లలో 56 మంది అనుకూలంగా, 26 మంది వ్యతిరేకంగా ఓటేయటంతో యెలెన్ నియామకం ఖరారైంది. ఈమె ప్రస్తుతం ఫెడ్‌కు వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా దీనిపై వ్యాఖ్యానిస్తూ... ఉద్యోగ అవకాశాలకు ఊతమివ్వడం, అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాధించడానికి సమర్థమైన నాయకత్వం లభించినట్లయిందన్నారు. నాలుగేళ్ల పదవీకాలం గల ఫెడ్ చైర్మన్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన బెర్నాంకీ ఈ నెల 31న పదవీ విరమణ చేస్తారు.