వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్‌ | Economics Nobel goes to Paul R. Milgrom And Robert B Wilson | Sakshi
Sakshi News home page

వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్‌

Published Tue, Oct 13 2020 3:20 AM | Last Updated on Tue, Oct 13 2020 5:03 AM

Economics Nobel goes to Paul R. Milgrom And Robert B Wilson - Sakshi

స్టాక్‌హోమ్‌: వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరిక ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్‌ ఆర్‌ మిల్‌గ్రూమ్‌ (72), రాబర్ట్‌ బి విల్సన్‌ (83) ఈ ఏడాది నోబెల్‌ అవార్డుకు ఎంపికయ్యారు. వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్‌ స్లాట్స్‌ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు.

ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్‌ అవార్డుల కమిటీ తెలిపింది. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సెక్రటరీ జనరల్‌ గొరాన్‌ హాన్సన్‌ సోమవారం విజేతలను ప్రకటించారు. విల్సన్‌ తన పీహెచ్‌డీ సలహాదారుగా పనిచేశాడని మిల్‌గ్రూమ్‌ తెలిపారు. విల్సన్‌ మాట్లాడుతూ వేలంపాటలకు సంబంధించి మిల్‌గ్రూమ్‌ ఓ మేధావి అని తన పూర్వ విద్యార్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్‌ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి.  

అన్ని వేలాలు ఒకటి కాదు...
సాధారణంగా వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతారో వారికి ఆయా వస్తు, సేవలు లభ్యమవుతూంటాయి. లేదంటే ఒక పనిని అతి చౌకగా చేసిపెడతామన్న వారికీ ఆ పనిని కట్టబెట్టడమూ కద్దు. అతిపురాతనమైన, అపురూపమైన వస్తువులు మొదలుకొని ఇంటి సామాన్ల వరకూ రోజూ అనూహ్యమైన ధరలకు అమ్ముడవుతూండటం మనం చూస్తూనే ఉంటాం. వేలం ద్వారా ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం వస్తు, సేవలను సమీకరించడం కూడా మనం చూస్తూంటాం.

రాబర్ట్‌ విల్సన్, పాల్‌ మిల్‌గ్రూమ్‌లు వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేలంలో పాల్గొనేవాళ్లు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటం వల్ల ఈ విళ్లేషణ అంత సులువుగా ఉండదు. తమకు తెలిసిన, ఇతరులకు తెలిసి ఉంటుందని భావిస్తున్న సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు.  

 రాబర్ట్‌ విల్సన్‌.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్‌ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్‌ అంటారు.

మరోవైపు పాల్‌ మిల్‌గ్రూమ్‌ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి. వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్‌ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని మిల్‌గ్రూమ్‌ చెబుతున్నారు. 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్‌ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement