Stanford University scientists
-
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
44లో మీదపడే..60లో ముదిమి
ముసలితనం. మనిషి జీవయాత్రలో అనివార్యమైన చివరి మజిలీ. అయినాసరే, దాని పేరు వింటేనే ఉలిక్కిపడతాం. తప్పదని తెలిసినా వృద్ధాప్యాన్ని తప్పించుకోవడానికి అనాదికాలంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. ముదిమిని కనీసం వీలైనంత కాలం వాయిదా వేసేందుకు పడరాని పాట్లు పడేవాళ్లకు కొదవ లేదు! అలాంటి వాళ్లకు ఎంతగానో పనికొచ్చే సంగతొకటి వెలుగు చూసింది. మనిíÙకి వృద్ధాప్యం క్రమక్రమంగా సంక్రమించదట. జీవనకాలంలో రెండు కీలక సందర్భాల్లో ఒక్కసారిగా వచ్చి మీదపడిపోతుందట. 44వ ఏట ఒకసారి, 60వ ఏట రెండోసారి! అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ, సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ చేసిన తాజా అధ్యయనంలో ఈ మేరకు తేలి్చంది. ఆ రెండు సందర్భాల్లోనూ వృద్ధాప్య సంబంధిత మార్పులు ఒంట్లోని అణువణువులోనూ ఉన్నట్టుండి భారీగా చేటుచేసుకుంటాయని వెల్లడించింది. ఇలా చేశారు... 25 నుంచి 75 ఏళ్ల వయసున్న 108 మందిని సైంటిస్టులు తమ అధ్యయనం కోసం ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలవారూ నివసించే కాలిఫోరి్నయా నుంచి వీరిని ఎంపిక చేశారు. ప్రతి మూడు నుంచి ఆర్నెల్లకోసారి వారి రక్తం, మలం, చర్మం తదితర నమూనాలు సేకరించి పరిశీలించారు. మహిళల్లో 40ల అనంతరం తలెత్తే ముట్లుడిగే దశ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందన్న వాదన ఉంది. కనుక స్త్రీ పురుషులకు వేర్వేరు డేటాబేస్‌ను నిర్వహించారు. ఒంట్లో ఆర్ఎన్ఏ, ప్రొటీన్ల వంటి జీవాణువులు తదితరాల్లో వయసు మీద పడే తీరుతెన్నులను ఏళ్ల తరబడి నిశితంగా పరిశీలించారు. ఫలితాలు వారిని ఆశ్చర్యపరిచాయి. ఈ కీలక జీవాణువులన్నీ ఆడా, మగా తేడా లేకుండా 44వ ఏట భారీ మార్పుచేర్పులకు లోనైనట్టు గమనించారు. 60వ ఏట కూడా మళ్లీ అలాంటి మార్పులే అంతటి తీవ్రతతో చోటుచేసుకున్నాయి. ఫలితంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ 55వ ఏట నుంచీ వృద్ధాప్య ఛాయలు కొట్టొచి్చనట్టు బయటికి కని్పంచడం గమనించారు. 40ల నుంచైనా మారాలి అధ్యయన ఫలితాలు తమను నిజంగా అబ్బురపరిచాయని నాన్యాంగ్ వర్సిటీ మైక్రోబయోమ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ జియావో టావో షెన్ అన్నారు. ‘‘ఉదాహరణకు కెఫిన్‌ను అరిగించుకునే సామర్థ్యం 40 ఏళ్లు దాటాక ఒకసారి, 60 నిండిన మీదట మరోసారి బాగా తగ్గుతుంది. మద్యాన్ని తీసుకున్నా అంతేనని మా పరిశోధనలో తేలింది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాక 40 దాటాక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం బాగా పెరుగుతుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ జెనెటిక్స్ విభాగం చీఫ్ మైకేల్ స్నైడర్ గుర్తు చేశారు. ‘‘ఆ దశలో కండరాలకు తగిలే గాయాలు ఓ పట్టాన మానవు కూడా. ఎందుకంటే ప్రొటీన్లు ఒంట్లోని కణజాలాలను పట్టి ఉంచే తీరు 44వ ఏట, 60వ ఏట చెప్పలేనంతగా మార్పులకు లోనవుతున్నట్టు తేలింది. ఫలితంగా చర్మం, కండరాలు, హృదయనాళాల వంటివాటి పనితీరు భారీ మార్పులకు లోనవుతోంది. వీటికి తోడు 60ల్లో మనుషుల్లో సాధారణంగా కండరాల క్షీణత ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. దాంతో వారిలో హృద్రోగాలు, కిడ్నీ సమస్యలు, టైప్ 2 మధుమేహం వ్యాధుల రిస్కు ఎన్నో రెట్లు పెరుగుతోంది’’ అని వివరించారు. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి తమ అధ్యయనం కొత్త దారులు తెరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను నేచర్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురించారు. మధ్యవయసు దాటాక మెల్లిమెల్లిగా ముసలితనం గుప్పెట్లోకి వెళ్తామన్నది నిజం కాదు. 40 ఏళ్లు దాటాక రెండు కీలక దశల్లో మనం ఆదమరిచి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ముదిమి ఒక్కసారిగా వచ్చి మీదపడుతుంది’’ – జియావో టావో షెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్యాంగ్ వర్సిటీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే వృద్ధాప్యాన్ని వీలైనంతగా వాయిదా వేసుకోవచ్చన్నది మా అధ్యయన ఫలితాల సారాంశం. మధ్య వయసు దాటాకైనా మద్యం మానేయాలి. లేదంటే కనీసం బాగా తగ్గించాలి. నీళ్లు బాగా తాగాలి. ముఖ్యంగా 40ల్లోకి, 60ల్లోకి ప్రవేశిస్తున్న దశలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి’’ – మైకేల్ స్నైడర్, జెనెటిక్స్ విభాగం చీఫ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘స్టాన్ఫోర్డ్’ టాప్ సైంటిస్టుల జాబితాలో భారతీయుడికి చోటు
ఉమ్మడి వరంగల్‌కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్‌లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆప్ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్‌గా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో ఆయన గ్లోబల్ లీడర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు. న్యూరోథెరాప్యూటిక్స్‌లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సాంబారెడ్డి బ్రెయిన్ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్ థెరపీని అభివృద్ధి చేశారు. మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్ థెరపీ ఎంతగానో ఉపకరించింది. పోస్టపార్టమ్ డిప్రెషన్‌కి సంబంధించి డాక్టర్ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్ ఔషధం అమెరికా తరఫున ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్‌గా గుర్తింపు పొందింది. అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్ కూడా ఉంది. న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్ సాంబారెడ్డికి అనేక అవార్డులు వరించాయి. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరిక ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్ (72), రాబర్ట్ బి విల్సన్ (83) ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ సోమవారం విజేతలను ప్రకటించారు. విల్సన్ తన పీహెచ్డీ సలహాదారుగా పనిచేశాడని మిల్‌గ్రూమ్ తెలిపారు. విల్సన్ మాట్లాడుతూ వేలంపాటలకు సంబంధించి మిల్‌గ్రూమ్ ఓ మేధావి అని తన పూర్వ విద్యార్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి. అన్ని వేలాలు ఒకటి కాదు... సాధారణంగా వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతారో వారికి ఆయా వస్తు, సేవలు లభ్యమవుతూంటాయి. లేదంటే ఒక పనిని అతి చౌకగా చేసిపెడతామన్న వారికీ ఆ పనిని కట్టబెట్టడమూ కద్దు. అతిపురాతనమైన, అపురూపమైన వస్తువులు మొదలుకొని ఇంటి సామాన్ల వరకూ రోజూ అనూహ్యమైన ధరలకు అమ్ముడవుతూండటం మనం చూస్తూనే ఉంటాం. వేలం ద్వారా ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం వస్తు, సేవలను సమీకరించడం కూడా మనం చూస్తూంటాం. రాబర్ట్ విల్సన్, పాల్ మిల్‌గ్రూమ్‌లు వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేలంలో పాల్గొనేవాళ్లు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటం వల్ల ఈ విళ్లేషణ అంత సులువుగా ఉండదు. తమకు తెలిసిన, ఇతరులకు తెలిసి ఉంటుందని భావిస్తున్న సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రాబర్ట్ విల్సన్.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్ అంటారు. మరోవైపు పాల్ మిల్‌గ్రూమ్ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి. వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని మిల్‌గ్రూమ్ చెబుతున్నారు. 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. -
మట్టిని కాపాడి.. భూతాపం తగ్గించండి!
భూతాపాన్ని తగ్గించేందుకు చెట్లు పెంచడం మొదలుకొని.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో అందరూ మట్టిని మరచిపోతున్నారని.. మట్టిని నమ్ముకుంటే వాతావరణంలోని కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఎలాంటి దుష్ప్రయోజనాలు లేకుండానే వాతావరణంలోని విష వాయువులను తగ్గించొచ్చని, అదే సమయంలో ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని అంటున్నారు. మట్టిలో ఉండే కుళ్లిపోతున్న మొక్కల అవశేషాలు, జంతు కళేబరాలు వగైరాలు వాతావరణం, చెట్ల కంటే ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేసుకోగలుగుతా యని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అడవులు నరికివేయడం, కాల్చడం, ఎరు వులు వాడటం వంటి చర్యల వల్ల మట్టిలోని కార్బన్ వాతావరణంలోకి చేరి ప్రమాదరకంగా మారుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవత్త రాబ్ జాక్సన్ అంటున్నారు. ఏడాది పొడవునా పశువుల గడ్డి, ఇతర మొక్కలను పెంచడం.. మేపడం, వ్యవసాయం కోసం దుక్కి దున్నడాన్ని తగ్గించడం ద్వారా కార్బన్‌ను మట్టిలోనే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయొచ్చని.. సారవంతమైన నేల పైపొర కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించడం ద్వారా మొక్కల వేళ్ల ద్వారా కార్బన్ మరింత లోతుల్లోకి చేరిపోతుందని రాబ్ వివరించారు. పరిశోధన వివరాలు యాన్యువల్ రివ్యూ ఆఫ్ ఎకాలజీ, ఎవల్యూషన్ అండ్ సిస్టమాటిక్స్ అండ్ గ్లోబర్ చేంజ్ బయాలజీలో ప్రచురితమయ్యాయి. -
గుండె చప్పుళ్లను గుర్తించే కృత్రిమ మేధస్సు!
గుండె చప్పుళ్లలో వచ్చే తేడాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తేవచ్చు. ఈ తేడాలను గుర్తిం చడం అంత సులువు కాదు. ఈసీజీ తదితర వివరాలున్నప్పటికీ వీటి వల్ల నిపుణులైన డాక్టర్లు సైతం ఒక్కోసారి పొరపాటు పడే అవకాశముంది. అయితే స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఈ సమస్య త్వరలోనే సమిసిపోనుంది. అరిథ్రిమియాస్ అని పిలిచే ఈ పరిస్థితిని స్పష్టంగా గుర్తించేందుకు వీరు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. రోగులు ఎంత దూరంలో ఉన్నా వారి గుండె సమస్యలను గుర్తించగలగడం దీనికున్న మరో ప్రత్యేకత. అరిథ్రిమియాస్ ఉన్న వారికి తరచూ ఈసీ జీలు తీయాల్సి ఉంటుంది. అయితే ఈసీ జీ వల్ల సమస్య ఏమిటన్నది తెలియకపోతే గుండెచప్పుళ్లను 2 వారాల పాటు నమోదు చేసి ఆ వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించేందుకు ఈసీజీ సంకేతాల ద్వారానే 14 రకాల అరిథ్రిమియాస్లను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సుతో పనిచేసే అల్గారిథమ్‌ను సిద్ధం చేశారు. ఐరిథమ్ అనే సంస్థ ద్వారా సేకరించిన ఈసీజీ సంకేతాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తాము ఈ కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశామని, సూక్ష్మమైన తేడాలను ఇది గుర్తిస్తుందని అంటున్నారు ఈ ప్రాజెక్టులో భాగం వహించిన ప్రణవ్ రాజ్పుర్కార్. -
పొగతో కెరీర్‌కు సెగ
పరిపరి శోధన పొగతాగే అలవాటుతో ఆరోగ్యానికి మాత్రమే కాదు, కెరీర్‌కూ సెగ తప్పదని తాజా అధ్యయనాల్లో తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారి కంటే పొగతాగని వారే కెరీర్లో ముందుకు దూసుకుపోతారని, పొగరాయుళ్లు తమ అలవాటు కారణంగా కెరీర్లో వెనుకబడిపోతున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. ఇదిలా ఉంటే, పొగరాయుళ్లకు ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతోందని తమ అధ్యయనంలో తేలినట్లు కాలిఫోర్నియా కాలేజీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ అష్టకష్టాలు పడి ఉద్యోగం సంపాదించినా, పొగరాయుళ్ల ఆదాయం పొగతాగని వారి ఆదాయం కంటే తక్కువగానే ఉంటోందని వారు అంటున్నారు.