ప్రొఫెసర్‌ చల్లపల్లి తెలుగువారికి గర్వకారణం | Challapalli Suryanarayana Got Place In Top 100 Materials Scientists | Sakshi
Sakshi News home page

పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తల జాబితాలో 55వ స్థానం

Published Sat, Oct 17 2020 1:25 PM | Last Updated on Sat, Oct 17 2020 2:02 PM

Challapalli Suryanarayana Got Place In Top 100 Materials Scientists - Sakshi

న్యూయార్క్: స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యాపక, శాస్త్రవేత్తలు బృందం రూపొందించిన ప్రపంచములోని లక్షమంది ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ చల్లపల్లి సూర్యనారాయణకు స్థానం దక్కింది. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం తయారుచేసిన మేటి పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తల జాబితాలో ఆయన 55వ స్థానం సంపాదించడం తెలుగువారందరికీ గర్వకారణమని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా అధ్యక్షులు అలెగ్జాండర్ ఎన్. కార్ట్రైట్ అన్నారు. ‘తమ తమ రంగాలలో ప్రపంచంలోనే మేటి 100 మందిలో చోటు సంపాదించడం అంటే అది ఒక గొప్ప  విజయం. అందరికీ సాధ్యమయ్యేది కాదు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకి వన్నె తెస్తున్న శాస్త్రవేత్త సూర్యనారాయణకు అభినందనలు’ అని అన్నారు. ఈ మేటి శాస్త్రవేత్తల జాబితా గత 22 ఏళ్లుగా ఇంజనీరింగ్, విజ్ఞానం, వైద్య, తదితర రంగాలలో నిష్ణాతులైన 6,880,389 మంది సాంకేతిక పత్రాల సమర్పకులను పరిగణనలోకి తీసుకుని తయారుచేయబడింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతుల్లో పదార్థ విజ్ఞాన(మెటీరియల్స్)శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణ అగ్రగణ్యులుగా పేర్కొనదగినవారు. ఆయనకు  ఈ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సూర్యనారాయణ గత 20 ఏళ్లుగా యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గత 45 ఏళ్లుగా వివిధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత శ్రేణి అధ్యాపకులు, పరిశోధకులుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. సూర్యనారాయణ ఇప్పటివరకు పదార్థ విజ్ఞానశాస్త్ర (మెటీరియల్స్) రంగంలో 23 పుస్తకాలను రచించడంతోపాటు సంపాదకీయం చేశారు. ఈ రంగంలో వివిధ పుస్తకాలలో 21 అధ్యాయాలు కూడా రాశారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వివిధ ప్రచురణ సంస్థల్లో 400కుపైగా పరిశోధనా పత్రాలు  ప్రచురించారు. గూగుల్ స్కాలర్ అంచనా ప్రకారం 26,500 ప్రశంస పత్రాల అందుకున్న శాస్త్రవేత్త సూర్యనారాయణ కావడం విశేషం.

చల్లపల్లి సూర్యనారాయణ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు పీహెచ్‌డీ డిగ్రీలను స్వీకరించి, మేటి శాస్త్రవేత్తలుగా ఉన్నత పదవులను అలంకరించారు. ఆయన వివిధ దేశాలలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలలో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. బ్రెజిల్, బెల్జియం, కెనడా, చిలీ, చైనా , జర్మనీ, జపాన్, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా, స్పెయిన్, అమెరికా, బ్రిటన్ దేశాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 200కి పైగా గెస్ట్‌ ప్రసంగాలు చేశారు.  

పురస్కారాలు: 
భారత ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నుంచి ప్రశంసాపత్రం, పురస్కారం అందుకు​‍న్నారు. అమెరికా ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం, పురస్కారం, ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీలో జీవనసాఫల్య పురస్కారం, సెంట్రల్ ఫ్లోరిడా ఇంజనీర్స్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. జాతీయ ధాతు దినోత్సవ (నేషనల్ మెటలర్జిస్టిక్ డే) సందర్భంగా విశేష సత్కారం అందుకున్నారు. ఇరాక్ దేశ విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగాలకు అంకితభావంతో అందించిన విశేష సేవలకు గాను అమెరికా గౌరవ పురస్కారం లభించింది. జపాన్ ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యున్నత ప్రతిభావంతులకు ఇచ్చే సాంకేతిక అభివృద్ధి సంస్థ పౌర పురస్కారం (జపాన్ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్) ఆయన్ని​ వరించింది. అమెరికా దేశ ప్రభుత్వం శాస్త్రరంగ అభివృద్ధికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక జెఫెర్సన్ సైన్స్ ఫెలోషిప్ పురస్కారం అందుకున్నారు. భారత రాష్ట్రీయ విజ్ఞాన సంస్థ విజ్ఞాన శాస్త్ర పతకం లభించింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) పూర్య విద్యార్ధిగా గౌరవించబడ్డారు. థామ్సన్ రాయిటర్స్ సంస్థ ద్వారా 2011లో ఉన్నతమైన గుర్తింపు అందుకున్నారు. అలాగే 2003లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ గుర్తింపు లభించింది. అమెరికాలోని టీఎంఎస్‌ సంస్థ ద్వారా ఉత్తమ విద్యావేత్తగా సత్కరింపబడ్డారు. ఇలా ప్రపంచం మొత్తం పేరుగాంచిన సంస్థలు గౌరవించుకున్న డాక్టర్ చల్లపల్లిసూర్యనారాయణ తెలుగువారు కావటం తెలుగువారి అదృష్టం, గర్వకారణం.

​మచిలీపట్నంలో పుట్టి అత్యున్నత స్థాయికి..
సూర్యనారాయణ తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ చల్లపల్లి రామబ్రహ్మం, శ్రీమతికామేశ్వరి, ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఆయన కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నంలోని హిందూ కాలేజీ జరిగింది. స్నాతకోత్తర విద్యాభ్యాసం భారత విజ్ఞాన సంస్థ (బెంగళూరు), కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. సూర్యనారాయణ 1988 వరకు భారతదేశంలో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. 1988 తర్వాత అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సేవలందిస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. సూర్యనారాయణ జీవన ప్రయాణంలో ఆయన సతీమణి శ్రీమతి చల్లపల్లి మీనాక్షి గారి సహకారం మరువలేనిది. శ్రీమతి మీనాక్షి కూడా సంగీత గురువుగా ఎంతో మంది విద్యార్థులకు కర్ణాటక సంగీతం నేర్పిస్తూ, విద్వాంసులుగా తీర్చిదిద్దారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement