కొడిగడుతున్న డాలర్‌ దీపం | Increasing Dollar Value Danger Bells For America | Sakshi
Sakshi News home page

కొడిగడుతున్న డాలర్‌ దీపం

Published Tue, Nov 8 2022 12:24 AM | Last Updated on Tue, Nov 8 2022 12:25 AM

Increasing Dollar Value Danger Bells For America - Sakshi

ఈ రోజున అమెరికా ప్రపంచంలోనే అత్యంత పెద్ద రుణగ్రస్త దేశం. ఆ దేశం మొత్తం అప్పు 31.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది ఆ దేశపు జీడీపీలో 126 శాతం. అమెరికా రుణభారంలో అతిపెద్ద వాటా జపాన్‌ది. తర్వాతి స్థానాలలో చైనా, బ్రిటన్‌ ఉన్నాయి. 1980 ముందు నుంచీ అమెరికా రుణభారం ప్రతి 8 సంవత్సరాలకు రెట్టింపు అవుతూ వస్తోంది. అమెరికా ఆర్థిక బలహీనతకు మరో ప్రధాన కారణం,  విప రీతంగా డాలర్లను ముద్రిస్తూ ఉండటం. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2010 నాటికంటే 60 శాతం ఎదిగింది. కానీ ఫెడరల్‌ రిజర్వ్‌ ఇదే కాలంలో ముద్రించిన కరెన్సీలో 300 శాతం పెరుగుదల ఉంది. అంటే ఆర్థిక కార్యకలాపాల ద్వారా జరిగిన వృద్ధికంటే, కాగితం కరెన్సీ పెరుగుదల వల్ల వచ్చిన ‘వాపు’ ఎక్కువ!

2000 సంవత్సరం నాటికి ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా 12.1 శాతం. నాడు చైనాకి సంబంధించి ఇది 3.9 శాతం. 2020 నాటికి  పరిస్థితి తల్లకిందులైపోయింది. అంతర్జాతీయ ఎగుమతులలో చైనా వాటా 14.7 శాతంగానూ, అమెరికా వాటా 8.1 శాతంగానూ ఉంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయన్నమాట! 1980ల నుంచే మొదలైన అమెరికా ఆర్థికవ్యవస్థ పతనం నేడు పరాకాష్టకు చేరింది. ఇటువంటి బలహీనమైన దేశీయ ఆర్థిక పునాదులపై నిలబడే అమెరికా నేటి వరకూ అగ్రరాజ్యంగా చలామణి అయ్యింది. దీనం తటికీ కారణం ఆ దేశ కరెన్సీ అయిన డాలర్‌. 1944లో అంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగుస్తున్న దశలోనే ప్రపంచదేశాలు తమ మధ్య లావాదేవీలకుగానూ రిజర్వ్‌ కరెన్సీ లేదా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ను ఆమోదించాయి.

ఆ విధంగా బ్రిటన్‌ తాలూకు అగ్రదేశ స్థానాన్ని అమెరికా ఆక్రమించుకుంది. మూడు దశాబ్దాలకు పైబడి అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే బలమైనదిగా ఉండడం వలన కూడా డాలర్‌కు ఆ ప్రాభవం దక్కింది. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ డాలర్‌కు పునాదిగా బంగారాన్ని పొదివిన 1944 లోని బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం నుంచి వైదొలిగాడు. అయితే, చమురు ఉత్పత్తి దేశాలతో ఉన్న సాన్నిహిత్యంతో డాలర్‌ కరెన్సీకే చమురు అమ్ముతామని ఆ దేశాలతో అంగీకరింపజేయడం ద్వారా ప్రపంచ దేశాలకు డాలర్‌ అవసరాన్ని అట్టిపెట్టగలిగాడు. 

1980ల అనంతరం అమెరికా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర బలహీన తలు ప్రవేశించాయి. వీటిలో ప్రధానమైనది ఆ దేశంలోని పరిశ్రమలు ఔట్‌సోర్సింగ్‌ రూపంలో విదేశాలకు తరలివెళ్ళిపోవటం. ఈ క్రమం లోనే ప్రపంచదేశాల పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన చైనా ప్రపంచా నికి సరుకు ఉత్పత్తి ఫ్యాక్టరీగా రూపొందింది. మెక్సికో, వియత్నాం, బంగ్లాదేశ్‌ వంటి అనేక చౌకశ్రమశక్తి ఉన్న దేశాలకు కూడా అమెరికా ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఫలితంగా ఆ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. సేవారంగం కూడా ఇంటర్నెట్‌ టెక్నాలజీ రంగ ప్రవేశం అనంతరం... ఔట్‌సోర్సింగ్‌ ప్రాజెక్టుల రూపంలో భారత్‌ వంటి ఆంగ్లం మాట్లాడగల నిపుణులు ఉన్న దేశాలకు తరలింది. 

మూలిగే నక్కపై తాటికాయలా సాంకేతిక ఎదుగుదల క్రమంలో మరమనుషుల రంగ ప్రవేశం వంటివి జరిగాయి. 1980ల నాటికే నాటి ముతకరకం రోబోటు ముగ్గురు కార్మికుల ఉపాధిని కొల్ల గొట్టేస్థాయిలో ఉంది. నేడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎదుగుదల స్థాయిని చెప్పనవసరం లేదు. స్థూలంగా, ఉత్పత్తిరంగాలపై ఆధార పడి జీవించే అవకాశం ఇటు కార్మికులకూ, అటు ఉద్యోగులకూ కూడా లేకుండాపోయింది. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థికవ్యవస్థ కేవలం తన కాగితం కరెన్సీ అయిన డాలర్‌పై లేదా స్పెక్యులేటివ్‌ రంగాలైన షేర్‌మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌పై ఆధారపడటం పెరిగింది. దాంతోనే ముందుగా చెప్పినట్లు డాలర్ల ముద్రణ అపరిమితంగా పెరిగింది.

ఈ పరిస్థితి రాత్రికిరాత్రే అమెరికాను అగ్రరాజ్యం పాత్ర నుంచి పడ దోసేయలేకపోయింది. దీనికి కారణం అమెరికా ప్రజానీకం విని మయం అత్యధికస్థాయిలో ఉండటమే. మరోరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అనేకానేక దేశాలు అమెరికాకు సరుకులూ, సేవలను ఎగుమతి చేయడం ద్వారా తమ దేశాలలో ఉపాధి కల్పనను, ఆర్థిక ఎదుగుదలను పొందాయి. దీని వలన అటు ప్రధాన దిగుమతి దారుగా ఉన్న అమెరికాకు ఎగుమతులు చేసి మనుగడ సాగించే చట్రంలో ఇతర దేశాలు సుదీర్ఘకాలం ఉండిపోయాయి.

కాగా, వాస్తవ ఉత్పత్తి లేని, డాలర్ల ముద్రణ మీద ఆధారపడిన అమెరికా ఆర్థికం ఇక ఎంతమాత్రమూ యధాతథంగా కొనసాగలేని పరిస్థితులు పుంజుకున్నాయి. మాయల ఫకీరు ప్రాణం చెట్టుతొర్రలో ఉన్నట్లుగా అమెరికా బలం దాని డాలర్‌లో ఉంది. దశాబ్దాలపాటు, తన డాలర్‌ను సవాల్‌ చేసిన దేశాలనూ, నేతలనూ అమెరికా నయానో భయానో కట్టడి చేసింది. ఈ క్రమంలోనివే... ఇరాక్‌పై యుద్ధం, లిబియాలో గడాఫీని తిరుగుబాటుతో అంతమొందించడం, ఇరాన్‌తో ఘర్షణ పడుతుండటం! రానురానూ అప్పులు పెరిగిపోతుండటం,  యుద్ధాల కోసం మరింతగా ఖర్చుపెట్టలేని స్థితి ఏర్పడటం, అఫ్గాని స్తాన్, ఇరాక్‌లలో సైనిక పరాభవం వంటివన్నీ అమెరికా బలహీన తలను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టాయి.

ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సైనిక దళాలు హడావిడిగా వైదొలిగిన తీరు, దాని మిత్ర దేశాలకు ఇక అమెరికా అండపై ఎంతమాత్రమూ ఆధారపడలేమనే పాఠాన్ని నేర్పాయి. ఇది ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో మరింతగా బోధపడింది. ఈ యుద్ధ క్రమంలో రష్యాను అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు అవసరమైన సమాచార వ్యవస్థ అయిన ‘స్విఫ్ట్‌’ నుంచి బహిష్కరించటం ద్వారా ప్రపంచ దేశాలకు అమెరికా ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చింది. కానీ అమెరికా డాలర్‌పై ఆధారపడితే ఏదో ఒక రోజు ఇటువంటి ఆర్థిక దిగ్బంధనమే మనకూ జరగొచ్చన్న పాఠాన్ని ప్రపంచదేశాలు నేర్చాయి.

గత కొన్ని మాసాలుగా అమెరికా ఫెడరల్‌ బ్యాంకు తన వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా డాలర్‌ కరెన్సీలో మదుపులు చేయడం, అంతర్జాతీయ మదుపుదారులకు లాభసాటిగా మార సాగింది. దాంతో వారు వివిధ దేశాల షేర్‌మార్కెట్లలో పెట్టిన పెట్టు బడులను ఉపసంహరించుకొని అమెరికా మార్కెట్లకు తరలిపోతు న్నారు. ఫలితంగా ఆయా దేశాల కరెన్సీల విలువలు పడిపోవటం, షేర్‌మార్కెట్‌ సూచీలు దిగజారిపోవడం జరుగుతోంది. అంటే అమె రికా డాలర్‌ చేతిలో తమ జుట్టును పెడితే అది తమకు ప్రమాదకర మని అన్ని దేశాలు నిర్ధారణకు వస్తున్నాయి.

ఫలితంగానే గతంలో అమెరికాకు భారీ ఎత్తున అప్పులు ఇచ్చిన దేశాలన్నీ నేడు ఆ డాలర్‌ అప్పులను వదిలించుకుంటున్నాయి. అమెరికాకు అతిపెద్ద రుణదాత (ఇది అమెరికాకు ఎగుమతులను చేయడంతో పేరుకుపోయిన మొత్తం) అయిన జపాన్‌ ఇప్పటికే తన ఈ రుణంలోని 12 శాతాన్ని అమ్మేసుకుంది. ఇదే బాటలో నిన్నటి అనుంగు మిత్రదేశాలు సౌదీ అరేబియా 35 శాతం, ఇజ్రాయెల్‌ 20 శాతం అప్పులను అమ్మేసు కున్నాయి. సుమారు 71 దేశాలు డాలర్‌ కరెన్సీని, దాని రూపంలో అమెరికా చేసిన అప్పును వదిలించేసుకుంటున్నాయి. 

గతితర్కం (చలన సూత్రాలు) తాలూకు సూత్రీకరణ ప్రకారం ‘ఒక పరిణామం లేదా వస్తువు దాని ఆరంభ స్థానం నుంచి ముందుకు వెళ్తున్నకొద్దీ దాని తాలూకు వేగం పెరుగుతుంది’. ఇది అన్ని విష యాల్లోనూ జరిగేదే. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధినే చూస్తే– గత వంద సంవత్సరాల ప్రగతి కంటే తర్వాతి 20, 30 సంవత్సరాలలో జరిగిన పురోగమనం ఎక్కువ. తరువాతి ఐదు సంవత్సరాలలో మరింత వేగంగా ఈ పురోగతి జరిగింది. ఇదే సూత్రం సామాజిక, ఆర్థిక విషయాలకు కూడా వర్తించే వాస్తవం. కాబట్టి డాలర్‌ దిగ జారుడు వేగం మరింతగా పెరగటం ఖాయం. ఆర్థికపరంగా ఇదివరకే డొల్ల అయిన అమెరికా... డాలర్‌ ముద్రణపై కూడా ఆధారపడలేక కుదేలైపోగలదు. ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా స్థానం ముగిసి పోగలదు!

డి.పాపారావు 

వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement