సాక్షి నాలెడ్జ్ సెంటర్: వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క చిత్రంతో చెప్పొచ్చు అంటారు. కంటికి కనిపించే వాటి విషయంలో ఇది నిజమే కానీ.. మైక్రోస్కోప్ వాడినా కంటికి చిక్కని అతి సూక్ష్మమైన వైరస్‌లు, అణువుల సంగతేంటి? నానోమీటర్ల స్థాయిలో ఉండే వీటిని ముందు చూసి.. ఫొటోలు తీయగలగాలి. అప్పుడే వాటి గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియా వల్ల కలిగే నష్టాలను తగ్గించుకునేందుకు కొత్త మందులను ఆవిష్కరించేందుకు వీలవుతుంది. క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ విధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీతలు జాక్స్ డుబోషే, జొయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లు బయో కెమిస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు.
అతిసూక్ష్మమైన అణువుల చిత్రాలను తీయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లు అందుబాటులో ఉన్నా అవి మృత పదార్థాల్లోని అణువుల చిత్రాలు తీసే వరకే పనికొచ్చాయి. పరిశీలించాల్సిన పదార్థాన్ని శూన్యంలో ఉంచడం.. దానిపైకి శక్తిమంతమైన ఎలక్ట్రాన్ కిరణాలను ప్రసారం చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే ఎలక్ట్రాన్ కిరణాల శక్తికి జీవాణువులు జీవించి ఉండటం కష్టం. 1990లో రిచర్డ్ హెండర్సన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపుతోనే అద్భుతాన్ని ఆవిష్కరించారు.
ఎలక్ట్రాన్ కిరణాల శక్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా ఏడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ల స్పష్టత ఉన్న చిత్రాలను తీయగలిగారు. పదార్థాలను శీతల నైట్రోజన్‌లో ఉంచడం ద్వారా స్పష్టత మరింత పెరిగింది. కొన్ని మార్పుల ద్వారా ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అత్యంత స్పష్టమైన చిత్రాలు పొందేందుకు ఉపయోగిం చొచ్చని స్పష్టమైంది. జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్‌లు ఈ మార్పులను ప్రయోగపూర్వకంగా చూపించారు. ఫలితంగా రూపుదిద్దుకున్న సరికొత్త టెక్నాలజీ పేరే క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ.
క్రయో అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత. ఈ అంశం ఆధారంగా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పనిచేస్తుంది. సాధారణ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా 2డీ చిత్రాలనే తీయొచ్చు. పైగా చాలా అస్పష్టంగా ఉంటాయి. ఫ్రాంక్ 1975– 86 మధ్య కాలంలో అభివృద్ధి చేసిన ఇమేజ్ ప్రాసెసింగ్ పద్ధతితో త్రీడీ చిత్రాలు మరింత స్పష్టంగా రావడం మొదలైంది. వేర్వేరు 2డీ చిత్రాలను కలపడం ద్వారా ఇది సాధ్యమైంది. ఇంకోవైపు డుబోషే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీకి నీటిని జోడించడం ద్వారా క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నాలజీని పూర్తిస్థాయికి చేర్చారు.
అణుస్థాయి ఫొటోలు తీశారు
Published Thu, Oct 5 2017 2:42 AM | Last Updated on Thu, Oct 5 2017 10:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment