![Nobel Prize in Chemistry Awarded for 3D Views of Life's Biological](/styles/webp/s3/article_images/2017/10/5/sci.jpg.webp?itok=QbzItZhf)
స్టాక్‌హోం: అతి సూక్ష్మమైన అణువులను ఫొటోలు తీసేందుకు సులువైన, మెరుగైన ‘క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ’అనే పద్ధతిని కనుగొన్నందుకు గాను రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు దక్కింది. ఇందులో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు జాక్వెస్ డుబోషే, జోయాకిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ‘ఎలక్ట్రాన్ కిరణాలతో అణువులను ఫొటోలు తీసేందుకు కొత్త పద్ధతిని కనుగొన్న బృందానికి ధన్యవాదాలు’అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ పేర్కొంది. దీంతో పరిశోధకులు ఎంతో సులువుగా జీవ అణువుల త్రీడీ చిత్రాలను తీయొచ్చని కమిటీ తెలిపింది.
శాస్త్రవేత్తలు ఇప్పుడు జీవాణువులను ఏ క్షణంలోనైనా నిలిపేసి (ఫ్రీజ్) ఫొటోలు తీసే అవకాశం ఉంటుందని వివరించింది. ఇందుకోసం ఎటువంటి రంగులు కానీ వాటిని ఫ్రీజ్ చేసే పదార్థాలు కానీ వాడాల్సిన అవసరం లేదు. జీవ రసాయన శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడమే కాకుండా ఫార్మాస్యూటికల్స్ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చని పేర్కొంది. ఇలా ఫొటోలు తీయడం ద్వారా సూక్ష్మమైన కణ నిర్మాణాలను, వైరస్‌లను, ప్రొటీన్లను అధ్యయనం చేయొచ్చు. ఇటీవల బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన జికా వైరస్‌ను ప్రపంచానికి చూపించేందుకు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ విధానాన్ని వినియోగించారు. అంతేకాదు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో సంబంధం ఉన్న ఎంజైమ్‌ను గుర్తించేందుకు కూడా ఈ విధానాన్నే ఉపయోగించారు.
► జోయాకిమ్ ఫ్రాంక్: జర్మనీకి చెందిన 77 ఏళ్ల ఫ్రాంక్ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
► రిచర్డ్ హెండర్సన్: స్కాట్‌లాండ్‌కు చెందిన 72 ఏళ్ల హెండర్సన్ కేంబ్రిడ్జ్‌లోని ఎంఆర్‌సీ మాలిక్యులార్ బయాలజీ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. 1990లోనే ఓ ప్రోటీన్ త్రీడీ చిత్రాన్ని తయారుచేశారు.
► జాక్వెస్ డుబోషే: స్విట్జర్లాండ్‌కు చెందిన 75 ఏళ్ల జాక్వెస్ యూనివర్సిటీ ఆఫ్ లౌసానే బయోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. 1980లో నీటిని అతి వేగంగా చల్లబర్చడం వల్ల ద్రవస్థితిలో ఉండగానే గడ్డ కట్టేలా ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment