Vadrevu ChinaviraBhadrudu
-
మూలాల అన్వేషణలో వరదకు ఎదురీత
కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకం ఒక మల్టి– డిసిప్లినరీ అధ్యయనం. మానవుడికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన కథని ఎంతో ఉత్కంఠభరితంగా చెప్తున్న రచన ఇది. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వ విద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని. మానవ చరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకో వలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటి కప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయరాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితం కాలేదనీ, నిజానికి మనం కట్టు కుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలు ఇలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది. మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏక కుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూర ప్రాంతానికి చెందిన మానవ సమూహాలు మరెక్కడో సుదూర ప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించాయనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేనన్నది ఒక వైజ్ఞానిక సత్యం. ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధ త్వం మాత్రమే! ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒక రిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజా నికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరం గారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. కానీ కొత్త జాతీయవాదులు అటు వంటి విశాల దృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృత దృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రక టించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్ప థాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి వాస్తవం కన్నా కల్పనది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాశారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు: ‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగా పులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాము ఖ్యాన్నీ, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్నీ గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’ ఈ రచన సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి. ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’ ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తు న్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదాన ప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతి కంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమా దకరమని కూడా ఆయన చెప్తున్నారు. ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టీ డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవ శాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాల నుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు! ఈ అధ్యయ నంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచ డమేకాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడి పోవడానికి అవసరమైన తాళంచెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఒకటి, ఆయన స్వయంగా పండిత కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిందని చెప్పవచ్చు. రెండోది– ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయ వృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరో కారణం. (‘ఇవీ మన మూలాలు’కు రాసిన ముందుమాట నుంచి) వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసకర్త కవి, రచయిత (ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ‘ఇవీ మన మూలాలు’ పుస్తక ఆవిష్కరణ) -
డీఎస్సీ–2018 అభ్యర్థులకు పోస్టింగ్లు
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 పరీక్షల్లో మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 2018 డీఎస్సీలో ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూళ్లతోపాటు వివిధ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పరీక్ష ఫలితాల విడుదల ఆలస్యమైంది. ఇప్పటికీ కొన్ని కేటగిరీల పోస్టులపై న్యాయ వివాదాలున్నాయి. నియామకాలు ఇంకా జాప్యం కాకుండా ఉండేందుకు న్యాయ వివాదాలు లేని కేటగిరీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 22న నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శని, ఆదివారాల్లో ఆయా అభ్యర్థులను ఆన్లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చిన స్కూళ్లలోని పోస్టుల్లో నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఆ జాబితాను విద్యా శాఖ కమిషనరేట్కు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కేసులున్న వాటిని మినహాయించి మొత్తం 2,654 పోస్టులకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అత్యధిక పోస్టులున్న ఎస్జీటీ కేటగిరీపై కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ఉత్తర్వులు ఇస్తారు. -
ఆండాళ్ పలికిన మధుర కవిత: తిరుప్పావై
పారవశ్యం పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (కీ.శ. 9వ శతాబ్ది) రచించిన ‘తిరుప్పావై’ భారతీయ సాహిత్యంలోని అత్యంత విలువైన కృతుల్లో ఒకటి. తదనంతర సాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్క మహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీన కవయిత్రులతో పాటు సరోజినీ నాయుడు, తోరూదత్, మహాదేవీ వర్మ వంటి ఆధునిక కవయిత్రుల దాకా ఎందరో భావుకులకూ, రస పిపాసులకూ ఆండాళ్దే ఒరవడి. ఆమెకు పూర్వం అంతగా ప్రసిద్ధి చెందని కొందరు సంగం కాలం నాటి కవయిత్రులూ, ప్రాకృత కవయిత్రులూ, థీరీగాథల పేరిట కొంత కవిత్వం చెప్పిన బౌద్ధ సన్యాసినులూ లేకపోలేదుగాని, మధుర కవిత్వాన్ని ఒక సంప్రదాయంగా మార్చగలిగిన తొలి కవయిత్రి ఆండాళ్ అనే అనాలి. ప్రపంచ సాహిత్యంలో కూడా ఆమె కన్న ముందు ఒక శాఫో, ఒక రబియా... అంతే. అంతకన్నా ఎక్కువ పేర్లు కనిపించవు. కవిగా ఆండాళ్ యశస్సు తిరుప్పావై, నాచ్చియార్ తరుమొళి అనే రెండు చిన్న కావ్యాల మీద ఆధారపడి ఉంది. రెండూ అత్యంత శక్తిమంతమైన రచనలు. ముఖ్యంగా తిరుప్పావై బాహ్య ప్రపంచానికీ, మనోమయ ప్రపంచానికీ, భక్తికీ, ప్రేమకీ, నిద్రకీ, మెలకువకీ, స్థానికతకీ, వైశ్చికతకీ, ఐహికానికీ, ఆముష్మికానికీ మధ్య హద్దులు చెరిపేసిన రచన. భక్తి గురించి వివరించేటప్పుడు భాగవతం అయిదు విధాల భక్తిని పేర్కొంది. అవి దాస్య, సఖ్య, వాత్సల్య, శాంత, మధుర భక్తి మార్గాలు. భారతీయ భాషల్లో భక్తికవిత్వం చెప్పిన ప్రతి భాషలోనూ ప్రతి కవీ ఈ అయిదింటిలోని నాలుగు మార్గాల్లో ఏదో ఒక పద్ధతిలో కవిత్వం చెప్పినవాడే. కాని మధురభక్తిలో కవిత్వం చెప్పగలిగే అదృష్టానికి నోచుకున్నది ఒక ఆండాళ్, ఒక మీరా మాత్రమే. ఆళ్వారుల ముందు తమిళ దేశంలో శైవ భక్తికవిత్వం చెప్పిన అప్పర్ దాస్య భక్తికీ, సంబంధర్ వాత్సల్య భక్తికీ, సుందరమూర్తి సఖ్యభక్తికీ అక్షర రూపమిస్తే, తిరువాచకాన్ని గానం చేసిన మాణిక్య వాచకర్ మధురభక్తి అంచుల దాకా పోగలిగారు. తిరువాచకంలోని తిరువెంబావై అనే అధ్యాయం తిరుప్పావైకి ప్రేరణ అనవచ్చు. శైవభక్తిని ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన నాయన్మారుల బాటలోనే ఆళ్వారులు పన్నెండు మందీ వైష్ణవ భక్తిని ప్రచారం చేశారు. వారిలో పెరియాళ్వారుది వాత్సల్య భక్తి. తరుమంగై ఆళ్వారుది దాస్యభక్తి. ఆళ్వారుల్లో స్వయంగా దేవుడే ‘నా ఆళ్వారు’ అని చెప్పుకున్న నమ్మాళ్వారుది సఖ్యభక్తి. కాని ఆయన కూడా మధురభక్తి అంచుల దాకా పోగలిగాడే తప్ప అందులో మునిగిపోలేకపోయాడు. ఆళ్వారు అంటే మునిగిపోయిన వాడని అర్థమైనప్పటికీ, నిజంగా మధుర భక్తిలో మునిగిపోగలిగింది ఆండాళ్ మాత్రమే. తిరుప్పావై అంటే శ్రీవ్రతమని చెప్పవచ్చు. ఆ కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు దాన్ని ‘సిరినోము’ అన్నారు. తిరుప్పావై పైకి ఒక సాధారణమైన నోముపాటలాగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఉపనిషత్తుల రహస్యాన్వేషణా, ప్రాచీన సంగం కవిత్వంలోని కవి సమయాలూ విడదీయలేనంతగా కలిసిపోయాయి. ఒక పాశ్చాత్య భావుకుడు చెప్పినట్టుగా పైకి సరళంగా కనిపించే అత్యంత సంక్లిష్టమైన కావ్యమది. అందులోని ఒక్కొక్క పాశురాన్నీ, ఒక్కొక్క పద ప్రయోగాన్నీ వివరించుకుంటూ విశోధించుకుంటూ పోయే కొద్దీ ఉత్తర దక్షిణ దేశాల అత్యున్నత వివేచనంతా అందులో కనవస్తుంది. అందులో వేదాంతముంది, రస పిపాస ఉంది, గోకులముంది, తమిళ దేశముంది. ఏది శ్రీవిల్లి పుత్తూరో, ఏది రేపల్లెనో విడదీసి చూపలేనంతగా అల్లిన జిమిలినేత అది. ఇంతకీ తిరుప్పావై దేని గురించి? ప్రాచీన తమిళ దేశంలో మార్గశిర మాసంలో కన్యలు పెళ్లి కోసం పట్టే నోము అది. దాన్ని భాగవతం కాత్యాయనీ వ్రతంగా పేర్కొంది. తిరుప్పావైలో ఆ నోము ఏదో ఒక దేవతను కొలిచే నోముగా కాక ఒక మంగళవాద్యం కోసం కోరుకున్న మొక్కుగా కనిపిస్తుంది. ఒక కన్య మంగళవాద్యం కోసం నోము నోచడమన్న ఊహలోనే అనిర్వచనీయమైన రసస్ఫూర్తి ఉంది. మంగళవాద్యమంటే ఏమిటి? అది జీవితాన్ని కల్యాణప్రదం చేసే శబ్దానికీ వాక్కు తూర్యధ్వనికీ దేనికైనా ప్రతీక కావచ్చు. ఆ నోము పట్టి మార్గశిర మాసం ముప్పై రోజులూ పాడుకునే పాటల్లాగా తిరుప్పావైని ఆండాళ్ నిర్మించింది. ఒక్కొక్క రోజూ ఒక్కొక్క పాశురం చొప్పున ముప్పై పాశురాల సంపుటి. పాశురమంటే ఎనిమిది పంక్తుల గీతం. అచ్చతమిళం, సెందమిళంలో చెప్పిన కవిత్వమనిది. దానికొక నిర్మాణ క్రమముంది. మొదటి అయిదు పాశురాలూ నోము నోచడానికి చెప్పుకున్న సంకల్పం. 6వ పాశురం నుంచి 15వ పాశురం దాకా కన్యలు ఒకరినొకరు పిలుచుకోవడం, ఇంటింటికీ తిరగడం, ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, మిత్రురాళ్లు చేరువకావడం. 16వ పాశురం నుంచి 29వ పాశురం దాకా కావ్యంలోని సారాంశమంతా ఉంది. అది కన్యలు శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీ కృష్ణ దేవుని దేవాలయం ముందు చేరి దేవుణ్ణి మేల్కొల్పే కవిత్వం. కాని అక్కడ ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరుకీ రేపల్లెకీ మధ్య హద్దులు చెరిపేసింది. ఆమె తన ఊళ్లో తన కులం మధ్య గుళ్లో ఉన్న విగ్రహానికి మేలుకొలుపు పాడుతు న్నట్టుగా కాక, రేపల్లెలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పు తున్నట్టుగా పాటలు పాడింది. అందుకనే తిరుప్పావైకి గొప్ప వ్యాఖ్యానం రాసిన పెరియవచన పిళ్లై ‘తక్కిన ఆళ్వారుల్ని భగవంతుడు మేల్కొల్పాడు. కాని ఆండాళ్ తానే స్వయంగా భగవంతుణ్ణి మేల్కొల్పింది’ అన్నాడు. 26వ పాశురంలో మంగళవాద్యం కోసం మొక్కుకున్న కవయిత్రి 27వ పాశురానికి వచ్చేటప్పటికి తిరుప్పావై వ్రత ప్రయోజనమేమిటో ఆశ్చర్యకరంగా చెప్తుంది. కృష్ణశాస్త్రి అనుసృజనలో ఆ పాశురం: ఇంతకన్న శుభవేళ ఏదీ / ఇంతకన్న ఆనందమేదీ బంతులుగా నీతోడ గూడి/ ఇంతుల మెల్లరము నేయి వెన్న మీగడలు/ తీయతీయని పాయసము చేయి మునుగగా ఆరగింపగా/ చేయవా చిత్తగింపవా ఇదొక మహిమాన్వితమైన వాక్యం. భగవంతుడితో కలిసి జీవించే క్షణాలు సంభవించినప్పుడు ఆ ఆనందాన్ని ఆండాళ్ అత్యంత లౌకికమైన పరిభాషలో వ్యక్తం చెయ్యడం. తిరుప్పావైలోని 3వ పాశురంతో దీన్ని కలిపి చదవి చూడండి. అందులో ఆమె వ్యక్తం చేసిన ఆకాంక్ష: ఎనలేని సిరులతో నిండును, ఈ సీమ ఈతిబాధలు కలుగకుండును నెలనెలా మూడు వానలు కురియును బలిసి ఏపుగ పైరులెదుగును అలపైరుసందులను మీలెగురును కలువల ఎలతేంట్లు కనుమూయును కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను ఒడిసి పిదుకగ పట్ట రెండు చేతులను ఎడము లేకుండ పెనుజడుల ధారలను కడవల ఉదార గోక్షీరములు కురియును ‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటు పడవోయ్’ అని గురజాడ కోరుకున్న కోరికకీ ఈ కోరికకీ ఎంత సారూప్యత! ఈ వాక్యాలు చూసినప్పుడు తిరుప్పావైని ఒక మతగీతంగా భావించలేమ నిపిస్తుంది. అత్యంత సుఖప్రదమైన, శుభప్రదమైన లౌకిక జీవితాన్ని కోరకున్న శుభాకాంక్షగా భావించాలనిపిస్తుంది. ఆండాళ్ దేవుడి కోసం పడ్డ విరహంలో దేశం సుభిక్షంగా ఉండాలన్న ఆవేదన ఉంది. భగవంతుణ్ణి చేరుకోవడం ఎవరికివారు విడివిడిగా చేసే పని కాదనీ, అదొక బృందగానం కావాలన్న మెలకువ ఉంది. లోకానికి మేలు చేకూరాలన్న శుభకామన కన్నా గొప్ప మంగళవాద్యమే ముంటుంది? మనం కూడా చిన్నప్పుడేదో ఒక తిరుణాలకి వెళ్లే ఉంటాం. ఆ సంతోషం, ఆ సంరంభం చూసినప్పుడు మనకేమనిపించి ఉంటుంది? మనమొక బూర కొనుక్కుని నోరారా ఊది ఉంటాం. మనమున్నామనీ, జీవించి ఉన్నామనీ, పట్టలేనంత ఆనందంగా ఉన్నామనీ మనకి మనం చెప్పుకోవడానికి మనం చేసిందల్లా నోరారా బూర ఊదడమే. అట్లాంటి మంగళమయ సంగీతం కోసమొక మహనీయురాలు నోరారా పాడిన గీతం తిరుప్పావై. - వాడ్రేవు చినవీరభద్రుడు