ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ | Sakshi Guest Column On political interview | Sakshi
Sakshi News home page

ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ

Published Mon, Jun 12 2023 12:03 AM | Last Updated on Mon, Jun 12 2023 12:03 AM

Sakshi Guest Column On political interview

తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఒక అంతిమ భావనకు వచ్చేశారు. నిజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలను కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి.

ఏ అంశం మీద ప్రశ్నలు అడగాలన్నదీ, ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది.

పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి దేశ ప్రధాని సుముఖంగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన సంసిద్ధతను కనబరుస్తున్నారని ఇండియాలో మనం భావిస్తాం. ప్రధానికి నిజంగానే తన పాలనకు బాధ్యత వహించే ఉద్దేశం ఉందా, లేదా అనేదానికి అసలైన పరీక్ష... ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా చేయకపోవడం.

పత్రికా సమావేశంలో వందలాది మంది పాత్రికేయులకు ముఖాముఖి బదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డొంక తిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అందుకే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఇప్పటికే ఒక అంతిమ భావనకు వచ్చేశారు. 
మార్గరెట్‌ థాచర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న బ్రియాన్‌ వాల్డెన్స్‌ 

వారి భావనతో ఒక్క క్షణమైనా నాకు నిమిత్తం లేనప్పటికీ, పత్రికా సమావేశాన్ని మోదీ దాటవేస్తూ రావడంపై నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్య దేశాలలో నిజమైన జవాబుదారీతనాన్ని భిన్న పాత్రికేయ ప్రక్రియల ద్వారా సాధిస్తారు. ఆ విషయానికి తర్వాత వస్తాను. మొదట, పత్రికా సమావేశాల మీద మనకుండే విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నదో నన్ను వివరించనివ్వండి.  

మొదటి విషయం. పత్రికా సమావేశంలో అనేక మీడియాల నుంచి వచ్చిన అనేకమంది ప్రతినిధులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రశ్న ఒకటి అడిగేందుకు ఆతురతతో ఉంటారు. చాలా వరకు అవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రశ్నలే అయి ఉంటాయి. గంటల పాటు పత్రికా సమావేశం జరుగుతున్నా ఈ వేర్వేరు ప్రశ్నల కారణంగా ప్రధానమంత్రి జవాబులు చెప్పడానికి ఎప్పుడో తప్ప ఒత్తిడికి లోనయే అవకాశం దాదాపుగా ఉండదు.

ప్రధాని ఎందుకు ఒత్తిడికి లోనవరో చెప్తాను చూడండి. ప్రధాని పత్రికా సమావేశాలలో ఒక జర్నలిస్టుకు ఒక ప్రశ్న వేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాక, ఆ తర్వాతి జర్నలిస్టు తిరిగి అదే ప్రశ్న అడిగేందుకు ఉండదు. అప్పుడు ఆ జర్నలిస్టు తన ప్రశ్నను, ఒక్కోసారి తన సబ్జెక్టును కూడా మార్చుకోవలసి వస్తుంది.

అంటే ఒకటే ప్రశ్నపై పట్టుపట్టడానికి తక్కువ అవకాశం ఉండటంతో ప్రధానిపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆయన పొంతన లేని, లేదా సంపూర్ణం కాని సమాధానాలతో తప్పించుకోవచ్చు. ప్రధాని అజాగ్రత్తతో తొట్రుపడితేనో, లేదంటే ఏవైనా అవాస్తవాలు ఆయన నుంచి దొర్లితేనో తప్ప ఆయన పట్టుబడరు. అది నక్క తోకను తొక్కడమే కానీ, నాణ్యమైన జర్నలిజం కాదు. 

నిజానికి ప్రధాని పత్రికా సమావేశాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ అది భ్రమ. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతూ, ఆయన ఇచ్చే సమాధానాలను నిశితంగా పరిశీలించి వాటిలోని తప్పుల్ని, దాటవేతల్ని ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. అయితే ప్రధాని పత్రికా సమావేశాలలో ఇలా జరిగే అవకాశం ఉండనే ఉండదు. 

అందుకే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలకు కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రధాని–జర్నలిస్ట్‌ ఇద్దరే ఎదురెదురుగా ఆ ఇంటర్వ్యూలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆ ఏక పాత్రికేయుడే... ప్రధాని జవాబులు చెప్పవలసిన ప్రశ్నలను నిర్ణయిస్తారు. ఏ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తాలన్నదీ, అలాగే ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది.

ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. అలాంటి జర్నలిస్టు విషయాలన్నీ బాగా తెలిసినవాడై, నిర్భీతి, దృఢచిత్తం గలవాడై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా అయితే అతడు ప్రధాని ముందు నీళ్లు నమలనివాడై ఉండాలి.  

జిహ్వకు చాపల్యాన్ని అంటించే రుచికరమైన బ్రిటిష్‌ రాజకీయ వర్గ అసంబద్ధ అంతర్గత కథనాలతో రాబ్‌ బర్లీ అనే బ్రిటిష్‌ టీవీ ప్రొడ్యూసర్‌ తాజాగా వండి వార్చిన ‘వై ఈజ్‌ దిస్‌ లైయింగ్‌ బాస్టర్డ్‌ లైయింగ్‌ టు మి?’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘‘రాజకీయ ఇంటర్వ్యూలు అనేవి అధికారంలో ఉన్నవారిని ప్రజలకు పూచీ పడేలా చేయడానికే తప్ప, నాయకులకు లబ్ధిని చేకూర్చడానికి కాదు. అవి ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం.’’    

దేశ అత్యున్నత పదవికి అభ్యర్థులైన వారి యోగ్యతను రాజకీయ ఇంటర్వ్యూల ద్వారా ఎలా అంచనా వేయవచ్చో బర్లీ ఈ పుస్తకంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటికే అధికారం మాటున దాగి ఉన్నవారికి కూడా ఆయన మాట వర్తిస్తుంది. ‘‘అటువంటి ఇంటర్వ్యూలు మన రాజకీయ సంస్కృతి స్వభావం, సమర్థత, విశ్వసనీయతలను బహిర్గతం చేయడానికి తోడ్పడే ఉత్తమ సాధనాలు. వాటి గురించి మనం గట్టిగా అడగాలి.’’

మోదీ కూడా రాజకీయ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి చాలానే ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఎలాంటివారు? ఎలాంటి అంశాలను వాళ్లు ప్రధాని ముందు లేవనెత్తారు? ఎంత త్వరగా వాళ్ల ప్రశ్నల గేలం ప్రధానిని విడిచిపెట్టింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మునుపటి ఇంటర్వ్యూలను చూడండి. అవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూలు మోదీ తనేం చెప్పదలిచారో అవి చెప్పడానికీ, తరచూ ప్రతిపక్షాలను విమర్శించడానికీ కానుకగా అందివచ్చిన వేదికలు. 

బ్రిటిష్‌ బ్రాడ్‌క్యాస్టర్‌లు జెరెమి పాక్స్‌మ్యాన్, బ్రియాన్‌ వాల్డెన్స్‌ తమ రాజకీయ ఇంటర్వ్యూల కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయారు. వాల్డెన్‌ తన సంధింపులతో బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ను గుక్క తిప్పుకోకుండా చేశారు. పాక్స్‌మ్యాన్‌ అప్పటి బ్రిటిష్‌ విదేశాంగ కార్యదర్శి మైఖేల్‌ హోవర్డ్‌ను అడిగిన ప్రశ్ననే పన్నెండుసార్లు అడిగి ఆయన్ని గుటకలు వేయించారు. రెండు ఇంటర్వ్యూలలో అవి ముగిసే సమయానికి థాచర్, హోవర్డ్‌ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం! ఆ చెప్పలేకపోవడమే ప్రజలకు వారిని జవాబుదారీగా చేసింది. 

మన ప్రధానులను కూడా ఇంత కఠినంగా, కనికరం లేకుండా ప్రశ్నించగల రోజు వస్తే, మన రాజకీయాలలో నాటకీయమైన మార్పును చూస్తాం. మన రాజకీయ నాయకులు మారతారు. మనతో అబద్ధాలు చెప్పడం మానేస్తారు. 
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement