రెండు నెలలుగా మణిపూర్ అతలాకుతలం అవుతోంది. అయినప్పటికీ ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్‌లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు.
మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందేహించడానికేం లేదు. కానీ మణిపుర్‌పై మాట్లాడేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది.
నేను ఇంతకు ముందెన్నడూ ఆరంభించని విధంగా ఈ వ్యాసాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఒక ఉద్దేశ ప్రకటనతో. కొలిచినట్లుగా, సమతూకంతో, వేరుగా ఉండి చూస్తూ నాకు వీలైనంతగా ఇందులో న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. విషయం మణిపూర్ అయినప్పుడు ఇలా ఉండటం తప్పనిసరి. నేనిక్కడ మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ మానని గాయాల్ని రేపడం లేదా భావావేశాలను భగ్గుమనిపించడం మాత్రం నా ఆకాంక్ష కాదు.
మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఎందుకు తొలగించలేదు? 65 రోజుల తర్వాత కూడా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంలోని ఆయన అసమర్థత లేదా అశక్తత కచ్చితంగా రూఢి అయి నదే. సొంత శాసనసభ్యులకు కూడా ఆయనపై నమ్మకం పోయింది. మే నెలలో, ప్రత్యేక పాలన కోసం డిమాండ్ చేసిన ఏడుగురు బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదని బహిరంగంగానే ప్రకటించారు.
జూన్‌లో ఎనిమిది మంది బీజేపీ మెయితీ ఎమ్మెల్యేలు, ‘‘మణిపూర్ ప్రజలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంటే తమ 32 మంది ఎమ్మెల్యేలలో 15 మంది.
లెక్కల్ని పక్కన పెడితే, బీరేన్ సింగ్‌ను తొలగించాలనే డిమాండ్ వెనుక లోతైన నైతిక హేతువే ఉంది. మణిపూర్ జనాభాలో 16 శాతంగా ఉన్న కుకీలు... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఆయనే కారణం అని నిందిస్తున్నారు. మెయితీ దురహంకారిగా, కుకీల వ్యతిరేకిగా వారు ఆయన్ని పరిగణిస్తున్నారు. గతవారం బీరేన్ సింగ్ అధికార ట్విట్టర్ అకౌంట్ ఈ ఆరోపణకు ఒక ధ్రువీకరణగా నిలిచింది.
తనను విమర్శిస్తున్నది కుకీలు, మయన్మార్‌కు చెందిన వారు మాత్రమే నన్న అర్థం వచ్చేలా బీరేన్ సింగ్ ఒక ట్విట్టర్ యూజర్‌కు బదులి చ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ‘‘మీరసలు ఎప్పుడో రాజీ నామా చేయవలసింది కదా?’’ అని ఆ యూజర్ చేసిన కామెంట్‌కు సమాధానంగా, ‘‘నీది భారతదేశమా? లేక మయన్మారా?’ అని బీరేన్ సింగ్ ప్రశ్నించినట్లు ట్విట్టర్ స్క్రీన్ షాట్‌లు చూపిస్తున్నాయి. కుకీలను అన్నిటి కంటే ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే సయోధ్యపై ఏ విధమైన ఆశ ఉంటుంది?
నేను లేవనెత్తాలని అనుకుంటున్న రెండవ అంశం, జూన్ నెలా ఖరులో జరిగిన ఒక సంఘటన. దాదాపు 1,500 మంది మెయితీ మహిళలు, బహుశా ‘మీరా పైబిస్’ మహిళా ఉద్యమ కార్యకర్తలు... తూర్పు ఇంఫాల్‌లోని 3వ ఆర్మీ దళ శిబిరాన్ని చుట్టుముట్టి మెయితీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపునకు చెందిన 12 మంది మెయితీ తీవ్రవాదులను విడిపించుకుని వెళ్లారు.
2015లో చందేల్‌లో పొంచివుండి జరిపిన మెరుపుదాడితో 18 మంది సైనికులను హతమార్చింది ఈ ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపు సభ్యులే. ఆ పన్నెండు మందిలో తనను తాను లెఫ్ట్‌నెంట్ కల్నల్ మెయి రంగ్‌థెమ్ తంబా అని చెప్పుకునే వ్యక్తి ఆనాటి దాడికి వ్యూహం రచించాడు.
వీళ్లసలు ఎప్పటికీ విడుదల కావలసినవాళ్లు కాదు. కానీ విడు దలయ్యారు. ఇంకా ఘోరం ఏమిటంటే, విడిపించుకుని వెళ్లిన ఈ మహిళలందరికీ బీజేపీ మెయితీ ఎమ్మెల్యే తౌనోజం శ్యామ్‌కుమార్ సింగ్ మద్దతు ఉండటం. వారిని విడిపించుకుని వెళ్లేటప్పుడు తను అక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆయన ఖండించడం లేదు కానీ, వాళ్లను విడుదల చేయాలని తను అడగలేదని మాత్రం గట్టిగా చెబు తున్నారు. అయితే భద్రతా అధికారులు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెప్పిన కథనం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా మిలిటెంట్ల విడుదలకు బలగాలతో చర్చలు జరిపారని!
వైరుద్ధ్యం ఏమిటంటే కుకీలను వెళ్లి కలుసుకోవాలనీ, ద్వైపాక్షికంగా ఉండాలనీ బీరేన్ సింగ్‌కు హోమ్ మంత్రి చెప్పారని ‘ది హిందూ’లో వార్త వచ్చిన తర్వాతే ఈ ‘విడిపించుకు పోవడం’ జరగడం. ఇంఫాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు... హోమ్ మంత్రి చెప్పారంటున్న దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఇంకొక సంగతి. శ్యామ్ కుమార్ సింగ్ వార్తను మిగతా పత్రికలు ఎందుకు వేయలేదు? ఇంఫాల్‌లో గానీ, ఢిల్లీలో గానీ ఎవరూ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు?
నా మూడో ఆందోళన... బాధను కలిగించేది మాత్రమే కాదు, భ్రాంతులను పోగొట్టేది కూడా! రెండు నెలలుగా మణిపూర్ అతలా కుతలం అవుతోంది. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, ఇప్పుడిక భయానకమైన శిరచ్ఛేదనం! అయినప్పటికీ మన ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్‌లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు.
టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మెయితీ, ప్రతి కుకీ, ప్రతి నాగా... నిరాశలో ఉన్నారు. మొదట వారు కలత చెందారు. తర్వాత ఆగ్రహించారు. ఆ తర్వాత తమకు నమ్మకద్రోహం జరిగి నట్లుగా భావించారు. ఇప్పుడు తాము ఎవరికీ అక్కర్లేదని నమ్ము తున్నారు.
మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందే హించడానికేం లేదు. కానీ మణిపూర్‌పై మాట్లాడేందుకు మోదీ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. విధులు, రాజ్యాంగ అవసరాలను మించి దేశంలోని ఆందోళన కర పరిస్థితులపైన మాట్లాడవలసిన నైతిక ఒత్తిడి ప్రభుత్వాధినేతపై ఉంటుంది.
ఆయన మాట్లాడారూ అంటే మనందరి తరఫున మాట్లాడి నట్లు. మన ప్రధానమంత్రిగా మాట్లాడినట్లు. కానీ ఆయనకు మాట్లా డేందుకు ఏమీ లేదంటే ఆయన మౌనం ఆయన ఒక్కరితోనే ఉంటుంది. ఆ మౌనం మనందరికి ప్రాతినిధ్యం వహించదు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment