కలవర పెడుతున్న ప్రశ్నలు | Sakshi Guest Column On Manipur Cases By Karan Thapar | Sakshi
Sakshi News home page

కలవర పెడుతున్న ప్రశ్నలు

Published Mon, Oct 9 2023 12:06 AM | Last Updated on Mon, Oct 9 2023 9:06 AM

Sakshi Guest Column On Manipur Cases By Karan Thapar

మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌

ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్‌ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్‌లు... మణిపుర్‌ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్‌ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్‌లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్‌ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? 

ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. 

మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్‌–వాష్‌ స్టేషన్‌లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్‌ థీక్‌ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్‌ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్‌కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా?

రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్‌ భట్నాగర్‌ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్‌ 27 సాయంత్రం ఇంఫాల్‌ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్‌.ఎఫ్‌. (ఇండీజనస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని  ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది.

కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. 

ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్‌ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్‌పుర్‌లో అరెస్ట్‌ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్‌ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా?

కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్‌.ఎఫ్‌. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. 

కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్‌ లోని  పరిణామాలు చురాచాంద్‌పుర్‌ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు.  ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. 

ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్‌లు... మణిపుర్‌ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్‌ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్‌ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా?

యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్‌ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్‌.ఐ.ఎ. (నేషనల్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్‌ ఆనంద్‌ సింగ్‌ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్‌.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుండి మణిపుర్‌లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. 

నా ముగింపు: మణిపుర్‌ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement