బడి నేర్పిన బతుకు పాఠం | Sakshi Guest Column On Doon School By Karan Thapar | Sakshi
Sakshi News home page

బడి నేర్పిన బతుకు పాఠం

Published Mon, May 8 2023 12:19 AM | Last Updated on Mon, May 8 2023 12:19 AM

Sakshi Guest Column On Doon School By Karan Thapar

జీవితంలోకి వచ్చి పడ్డాక, ఎప్పుడైనా బాల్యం గుర్తొస్తే ఆనాటి కాలమంతా బంగారు వర్ణంతో మెరిసిపోతూ కళ్ల ముందర లీలగా కనిపించి మాయం అవుతుంది. మళ్లీ వచ్చి జీవితంలో పడిపోతాం. బాల్యంలో ముఖ్యమైనవి బడిలో గడిపిన రోజులు. అవి ముఖ్యమైనవే. కానీ పూర్తిగా సంతోషాన్ని చ్చిన రోజులైతే కాకపోవచ్చు.

అప్పట్లో భయంకర సమయాలూ ఉండేవి. అయినాసరే వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో పడ్డ కష్టాలను మర్చిపోతుంటాం. పుస్తకాల్లోని సిలబస్‌తో పాటు బడి అనేక జీవిత పాఠాలు నేర్పిస్తుంది. అన్నిటికన్నా ఉత్తమ జీవితపాఠం... ‘‘తప్పులు చేస్తే చేశావు గానీ, ప్రయత్నం మాత్రం ఆపకు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా...’’ అనే పాఠం.

పాఠశాల రోజులు నిజంగానే ఒకరి జీవితంలో అత్యుత్తమమైన రోజులా? ఇది నిజమే. అయితే కొన్నిసార్లు బాధగానూ ఉంటుంది. నా విషయానికి వస్తే 16 ఏళ్ల వయసులో డూన్  స్కూల్‌ని వదిలిపెట్టిన తర్వాత నా జీవితం కోలుకోలేనంతగా దిగజారిపోయింది. మరోవైపున గులాబీ రంగులోని జ్ఞాపకాల ద్వారా మనం వెనక్కు తిరిగి చూస్తాము. మనం ఎంత పెద్దవారమైతే ఆ జ్ఞాపకాలు అంత పవిత్రంగా ఉంటాయి.

పాత పాఠశాల చిత్రాల ఆల్బమ్‌ని చూస్తున్నప్పుడు నిన్న నా మనస్సులో చోటుచేసుకున్న ప్రశ్న ఇది. ప్రతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, డాస్కోస్‌ (డూన్‌ స్కూల్‌) పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను తిరిగి సందర్శించినప్పుడు వేల మంది ఈ ప్రశ్నకు గట్టిగా అవును అని జవాబు చెబుతారు. 

అయితే నిజం ఏమిటంటే... మనలో ఎవరికీ పాఠశాల కేవలం సంతో షకరమైన ఉల్లాస క్షణాల సేకరణగా ఉండలేదన్నదే. అప్పట్లో భయంకరమైన సమయాలు కూడా ఉండేవి. అవి కూడా మనం ఎదగడంలో సహాయం చేసి ఉన్నప్పటికీ, వాటిని మననం చేసుకుంటున్నప్పుడు ఇప్పటికీ బాధాకరంగానే ఉంటాయి.

అయినా సరే మనం వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు మనం ఆరోజుల్లో పడ్డ కష్టాలు, బాధలను మర్చిపోతుంటాము. ఆటపట్టించడం, ఆనాటి నవ్వులు, విజయాలను మాత్రమే మనం మననం చేసుకుంటుంటాము. ఆనాటి శిక్షలను, జరిమానాలను మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, వాటిని ఎదుర్కొని కూడా మనగలగడం గర్వించదగిన విషయమే.

కాబట్టి నలభైలు, యాభైలు, అరవైలలో తమను పెద్దలను చేసిన...  అలాగే ఇరవైలలోని కుర్రాళ్లను మృదువుగా మార్చిన డూన్‌ స్కూల్‌ మాట ఏమిటి? న్యాయంగా చెప్పాలంటే, సమాధానంలో కొంత భాగం తప్ప కుండా తననూ, ప్రపంచాన్నీ ఒక టీనేజర్‌ చూస్తున్నంత అమాయకత్వంతో, నమ్మకంతో ఉంటుంది.

అతను తన పరిమితులను తెలుసు కోలేనంత చాలా చిన్నవాడు, పైగా తన ఆకాంక్షలను వమ్ము చేయగల అవరోధాల గురించి తనకు ఇప్పటికీ తెలీదు. కలలు ఫలిస్తున్నట్లు, కష్టాలను అధిగమిస్తున్నట్లు, ప్రపంచం ఒక న్యాయమైన చోటుగాను కనిపి స్తుంటుంది. ఈ అర్థంలో... పాఠశాల రోజులు నిజంగానే రమణీయంగానే ఉంటాయి.

డూన్‌ని అంత ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, మాలో ప్రతి ఒక్కరినీ ఒక విశిష్ట వ్యక్తిగా ట్రీట్‌ చేయడమే! అనేకమందిలో ఒకడిగా నేను ఎన్నడూ భావించలేదు. నా ఉనికి, ప్రాధాన్యం, ఆసక్తుల గురించి నేను జాగరూకతతో ఉండేవాడిని. నేను క్రీడలంటే ద్వేషించేవాడిని. అది చూసి అందరూ నన్ను ఆటపట్టించేవారు కానీ ఎవరూ నన్ను ఆడాలని బలవంత పెట్టలేదు. చర్చలు, నటనను నేను ఆస్వా దించేవాడిని, వాటిలో పాల్గొనాలని నన్ను ప్రోత్సహించే వారు. నేను రాసేవాడిని, చదువుకునేవాడిని. దాన్నీ అందరూ ఆమోదించారు.

ఈరోజు డూన్‌ స్కూల్‌ స్కాలర్స్‌ బ్లేజర్‌ కథను నేను ప్రస్తావిస్తాను.  అది నా ఉద్దేశాన్ని నిరూపిస్తుంది. దశాబ్దాలపాటు క్రీడాకారులు మందపాటి నీలి బ్రౌజర్‌తో గుర్తింపు పొందేవారు. అది వారికి ఎంతో ప్రత్యేకత కలిగించేది. విద్యాపరంగా మొగ్గు చూపేవారికి అలాంటిదేమీ ఉండదు. అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని పాఠశాల చేత అంగీకరింప చేయడానికి నేను చాలా సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది.

అది 1971లో సాధ్యమైంది. ఆ సంవత్సరం వ్యవస్థాపక దినో త్సవం సందర్భంగా హెడ్‌మాస్టర్‌ కల్నల్‌ సిమోన్‌ మొట్టమొదటి స్కాలర్స్‌ బ్రేజర్‌ని నాకు బహూకరించారు. దాన్ని గెలుచుకున్నందుకు నేను చాలా థ్రిల్‌ ఫీలయ్యాను కానీ ఆ తర్వాత అది మరింత చిరస్మరణీయంగా రుజువైంది. ‘ఈ బ్లేజర్‌ ఎలా ఉండాలి;’ అని హెడ్‌మాస్టర్‌ ప్రశ్నించారు. నేను చీకాకు పడలేదు. స్పోర్ట్స్‌ బ్లేజర్‌ని అనుకరించడం గురించే నేను ఆలోచించగలిగాను. అయినా, నేను కోరుకుంటూ వచ్చింది ఇదే కదా!

‘‘రండి యంగ్‌ మ్యాన్‌’’ అంటూ కల్నల్‌ సిమోన్‌ పలకరించాడు. ‘‘మీరే మొట్టమొదటి వ్యక్తి. డూన్‌ స్కూల్‌ మొత్తం పాటించేటటువంటి డిజైన్ ని మీరు రూపొందించారు. అయితే మీరు కాపీ క్యాట్‌గా ఉండాలనుకుంటున్నారా?’’ అన్నారు!

స్కాలర్స్‌ బ్లేజర్‌ని డిజైన్‌ చేయడానికి ఒక టీనేజర్‌కి స్కూల్‌ హెడ్మాస్టర్‌ అనుమతించడాన్ని 50 సంవత్సరాల తర్వాత... ఈనాటికీ నేను నమ్మలేకున్నాను. నలుపు రంగులో సాంప్రదాయికమైన డబుల్‌ బ్రెస్టెడ్‌ స్టయిల్‌ని నేను ఎంచుకున్నాను. అందుకే ఆనాటి నుంచి అదే కొనసాగుతూ వచ్చింది.

డూన్‌ గర్వించదగిన ఒక కారణం ఏమంటే, కల్నర్‌ సిమోన్‌ వంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రత్యేకమైన వారు కారు. నా హౌస్‌ మాస్టర్‌ గురుదయాళ్‌ సింగ్, నా మ్యాథ్స్‌ మాస్టర్‌ షీల్‌ వోహ్రా, నా జాగ్రఫీ ట్యూటర్‌ చార్లీ కండ్జాట, హిస్టరీ హెడ్‌ జీక్స్‌ సిన్హా.. ఇంకా అనేకమంది ఇతరుల ముఖాలు నాకు ఇప్పటికీ గుర్తే. ఇకపోతే నేను ఎన్నటికీ మర్చిపోలేని ఈ గొంతులు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి.

నేనేం చేయాలి అని వీరు నాకు చెప్పడమే కాదు, నా పద్ధతిలో నేను చేయడాన్ని వీరు ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను తప్పు చేసినప్పుడు (తరచుగా నేను తప్పులు చేశాను) కూడా తప్పు చేయడం అనేది నేరం కాదని  వారు నాకు వివరించారు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా! డూన్‌ స్కూల్‌ నాకు నేర్పిన ఉత్తమ పాఠం అదే మరి!

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement