Doon School
-
అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’
1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం స్పష్టంగా కనిపించేది. ఇందుకు భిన్నంగా 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన ‘గురు’ క్రీడాప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను విద్యార్థులలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడుతుండేవారు. విద్యార్థులు ఆయన వద్ద పాఠ్యాంశంగా చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, వారు నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు ఆయన బోధించినవే. ఇలా చేయమని గురు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ఆయనొక ఉదాహరణగా కనిపించేవారు. మేము ఆయన్ని ‘గురు’ అని పిలుచు కోవడం ఆపేక్షతోనే అయినప్పటికీ నిజానికి ఆయనకు అదే కచ్చితమైన మాట. విశ్వగురు అనడం ఫ్యాషన్ ఈ రోజుల్లో. కానీ ఆయన నిజమైన, అంకితభావం కలిగిన, శ్రద్ధాబద్ధుడైన ఉపాధ్యాయుడు. కావాలంటే మీరు ఆయన్ని భారతీయ ‘మిస్టర్ చిప్స్’ అనుకోవచ్చు. డూన్ స్కూల్ అబ్బాయిలకు ‘గురు’ అనే పేరుతోనే గురుదయాళ్ సింగ్ తెలుసు. గురు అన్నది ఆయన పేరుకు సముచి తమైన నామకరణ. గత నెలలో ఆయన కన్ను మూసినప్పుడు కూడా అదే పేరుతో మాకు స్మరణీయం అయ్యారు. నేను గురును మొదటిసారి కలిసినప్పుడు నా వయసు పదేళ్లు. జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ ఆయన. పొడవాటి మనిషి. నా వయ సుకు ఇంకా పొడవుగా, భారీగా కనిపించారు. అయితే ఆయన చిరు నవ్వుతో నా భయాలు, అందోళనలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఆయన నవ్వినప్పుడు నేనూ పెద్దపెట్టున నవ్వాను. నవ్వును ఆపు కోలేకపోయాను. ఆయన వద్ద పాఠ్యాంశంగా నేను చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, నేను నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు సైతం ఆయన బోధించినవే. ఆ కొన్నింటిలో మొదటిది అతి కష్టమైనది మాత్రమే కాకుండా, అసలు నేనేమిటన్న దాన్ని నాకు బహిర్గతం చేసినది కూడా! 1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. దీనర్థం ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం అన్నది స్పష్టంగా కనిపించేదని! నేను నటనలో, వాదోపవాద చర్చలలో ముందుండే వాడిని. అలాగే, ఆఖరు నిమిషంలో చదివి మార్కుల్ని అదర గొట్టేయడంలో కూడా. కానీ నేను ఆటల్లో లేకపోవడం వల్ల నాలోని ఈ నైపుణ్యాలు చిన్నచూపునకు గురయ్యేవి. అయితే గురు, క్రీడా ప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను నాలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడు తుండేవారు. నేను పాల్గొన్న చర్చల్లోని నా తెలివైన మాటల్ని గుర్తు చేసుకునేవారు. అదొక ప్రశంసలా ఉండేది నాకు. లేదా చర్చావేదిక మీద అలా స్తంభించిపోయిన నా భంగిమ గురించి మాట్లాడుతూ నవ్వేసేవారు. పైకి అది సున్నితమైన ఎగతాళిగా ఉన్నప్పటికీ నిన్ను నేను శ్రద్ధగా గమనిస్తున్నాను సుమా అనే ఒక అంతర్లీనత కూడా ఆయనలో వ్యక్తం అయి, నేనొక ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన నాలో కలిగించేది. జూనియర్స్ క్రికెట్లో నేను అత్యుత్తమంగా ఆడినప్పటికీ ఆయన ఉద్దేశం ప్రకారం నా చివరి ఏడాదిలో నేను ‘హౌస్ కెప్టెన్’ అవడానికి తగిన కారణం మాత్రం నాలోని ఆ కళాత్మక నైపుణ్యాలే! ఎందుకంటే, క్రికెట్ గ్రౌండ్లో నేనొక్కడినే ఉన్న వైపు నేరుగా వచ్చి నా చేతుల్లో పడిన బంతిని కూడా నేను క్యాచ్ పట్టలేకపోయాను. ఆ విధంగా గురు, డూన్ స్కూల్ తానుగా ఎప్పటికీ నాకు అందించని విశ్వాసాన్ని నాలో కలిగించారు. నాలోని ప్రతిభ, నైపుణ్యాలతో సమానంగా, నా పరిమితుల్నీ నేను గుర్తించేలా; నా అపజయాల్ని, వైఫల్యాలను, తప్పుల్ని నేను ఎదుర్కొనేలా నేను ఎదగడానికి గురు తోడ్పడ్డారు. పడిపోతే పైకి లేచి, ముందుకు సాగిపోవడం ఎలాగో నేర్పించారు. అది నాకు ముఖ్యమైన పాఠం. ఎందుకంటే జీవితంలో తరచు నేను పొరపాట్లు చేసి పడిపోతుంటాను. ఏళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయినప్పుడు గురు నాకు చెప్పిన మరొక పాఠాన్ని గుర్తుకు చేసుకున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించడం అన్నదొక్కటి మాత్రమే ఉత్తమ మార్గం కాదు. తప్పును మన్నించడం అన్నది ఉత్తమమైన మార్గం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అంటారు గురు. గురు స్వయంగా ఈ సూత్రాన్ని పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొండితనాన్ని, అబద్ధాలను, ఉద్దేశ పూర్వకమైన తెలివితక్కువ వేషాలను ఆయన భరించారు. నా తప్పు లన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆ తప్పుల్ని పోనిచ్చేవారు. అయితే ఆయన ముఖభావాలను బట్టి, నేను మరికొంత మెరుగ్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించేవాడిని. ఏమీ తెలియని టీనేజ్‌లో ఉన్నప్పటికీ ఆ గ్రహింపు నాకు బాధను కలిగించేది. గురు దృష్టిలో గొప్పగా ఉండటం కన్నా నాకు వేరేదీ అక్కర్లేకపోయేది. అందుకే ఆయన అనిష్టత నా మనసును పిండేసినట్లుగా ఉండేది. ఆ మాత్రం శిక్ష సరిపోతుందని గురుకు తెలుసు. ఇతరులు తప్పు చేసినప్పుడు నేను ఈ పాఠాన్ని గుర్తు చేసు కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత తేలికగా ఉండదు. అందుకు వివేకం, నిగ్రహం రెండూ కావాలి. గురుకు ఆ రెండూ ఉన్నాయి. నాకు తరచు అవి రెండూ ఉండవు. నేను సరిగా నేర్చుకోని ఒక పాఠం ఇది. మూడవ పాఠం, నేనింకా సాధన చేస్తూనే ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అది సులభమైనది. కొద్దిపాటి మర్యాదల పాటింపుతో స్పష్టమైన వ్యత్యాసాలను మీరు చూపగలుగుతారు. గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అందరినీ పలకరించండి. ‘దయచేసి’, ‘ధన్యవాదాలు’ అని చెప్పడాన్ని ఎప్పుడూ విస్మరించకండి. ఇలా చేయమని గురు స్పష్టంగా నాకెప్పుడైనా చెప్పి ఉంటారని నేను అనుకోను. అయితే ఆయనొక ఉదాహరణగా ఎల్లవేళలా ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఉంటారు. జాగ్రత్తగా గమనించవలసింది ఆయన పెంపొందించిన సత్ప్రవర్తన, ఆయన పట్ల మనలో ఉన్న గౌరవ భావన ఆయన్ని మనం అనుకరించేలా చేస్తాయన్నది. ప్రత్యక్షంగా ఆయన ప్రబోధించని విలువలకు మనమంతా అలవాటు అవుతాం. అనుకరణ ద్వారానే నేను నేర్చుకున్నాను. నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నాపై గురు ముద్ర పొరపాటున పడినట్లుగా అనిపించదు. వాటర్లూ యుద్ధంలో బ్రిటన్ గెలుపు ఈటన్ (పాఠశాలల) ఆట మైదానాల వల్ల సాధ్యమయిందేమో నాకు తెలియదు కానీ నాలోని మనిషిని మలిచింది మాత్రం కచ్చితంగా జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ అనే చెప్పగలను. అందుకే ఎప్పటికీ ఆయన నా ‘గురు’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బడి నేర్పిన బతుకు పాఠం
జీవితంలోకి వచ్చి పడ్డాక, ఎప్పుడైనా బాల్యం గుర్తొస్తే ఆనాటి కాలమంతా బంగారు వర్ణంతో మెరిసిపోతూ కళ్ల ముందర లీలగా కనిపించి మాయం అవుతుంది. మళ్లీ వచ్చి జీవితంలో పడిపోతాం. బాల్యంలో ముఖ్యమైనవి బడిలో గడిపిన రోజులు. అవి ముఖ్యమైనవే. కానీ పూర్తిగా సంతోషాన్ని చ్చిన రోజులైతే కాకపోవచ్చు. అప్పట్లో భయంకర సమయాలూ ఉండేవి. అయినాసరే వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు ఆ రోజుల్లో పడ్డ కష్టాలను మర్చిపోతుంటాం. పుస్తకాల్లోని సిలబస్‌తో పాటు బడి అనేక జీవిత పాఠాలు నేర్పిస్తుంది. అన్నిటికన్నా ఉత్తమ జీవితపాఠం... ‘‘తప్పులు చేస్తే చేశావు గానీ, ప్రయత్నం మాత్రం ఆపకు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా...’’ అనే పాఠం. పాఠశాల రోజులు నిజంగానే ఒకరి జీవితంలో అత్యుత్తమమైన రోజులా? ఇది నిజమే. అయితే కొన్నిసార్లు బాధగానూ ఉంటుంది. నా విషయానికి వస్తే 16 ఏళ్ల వయసులో డూన్ స్కూల్‌ని వదిలిపెట్టిన తర్వాత నా జీవితం కోలుకోలేనంతగా దిగజారిపోయింది. మరోవైపున గులాబీ రంగులోని జ్ఞాపకాల ద్వారా మనం వెనక్కు తిరిగి చూస్తాము. మనం ఎంత పెద్దవారమైతే ఆ జ్ఞాపకాలు అంత పవిత్రంగా ఉంటాయి. పాత పాఠశాల చిత్రాల ఆల్బమ్‌ని చూస్తున్నప్పుడు నిన్న నా మనస్సులో చోటుచేసుకున్న ప్రశ్న ఇది. ప్రతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, డాస్కోస్ (డూన్ స్కూల్) పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలను తిరిగి సందర్శించినప్పుడు వేల మంది ఈ ప్రశ్నకు గట్టిగా అవును అని జవాబు చెబుతారు. అయితే నిజం ఏమిటంటే... మనలో ఎవరికీ పాఠశాల కేవలం సంతో షకరమైన ఉల్లాస క్షణాల సేకరణగా ఉండలేదన్నదే. అప్పట్లో భయంకరమైన సమయాలు కూడా ఉండేవి. అవి కూడా మనం ఎదగడంలో సహాయం చేసి ఉన్నప్పటికీ, వాటిని మననం చేసుకుంటున్నప్పుడు ఇప్పటికీ బాధాకరంగానే ఉంటాయి. అయినా సరే మనం వెనక్కు తిరిగి చూస్తున్నప్పుడు మనం ఆరోజుల్లో పడ్డ కష్టాలు, బాధలను మర్చిపోతుంటాము. ఆటపట్టించడం, ఆనాటి నవ్వులు, విజయాలను మాత్రమే మనం మననం చేసుకుంటుంటాము. ఆనాటి శిక్షలను, జరిమానాలను మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, వాటిని ఎదుర్కొని కూడా మనగలగడం గర్వించదగిన విషయమే. కాబట్టి నలభైలు, యాభైలు, అరవైలలో తమను పెద్దలను చేసిన... అలాగే ఇరవైలలోని కుర్రాళ్లను మృదువుగా మార్చిన డూన్ స్కూల్ మాట ఏమిటి? న్యాయంగా చెప్పాలంటే, సమాధానంలో కొంత భాగం తప్ప కుండా తననూ, ప్రపంచాన్నీ ఒక టీనేజర్ చూస్తున్నంత అమాయకత్వంతో, నమ్మకంతో ఉంటుంది. అతను తన పరిమితులను తెలుసు కోలేనంత చాలా చిన్నవాడు, పైగా తన ఆకాంక్షలను వమ్ము చేయగల అవరోధాల గురించి తనకు ఇప్పటికీ తెలీదు. కలలు ఫలిస్తున్నట్లు, కష్టాలను అధిగమిస్తున్నట్లు, ప్రపంచం ఒక న్యాయమైన చోటుగాను కనిపి స్తుంటుంది. ఈ అర్థంలో... పాఠశాల రోజులు నిజంగానే రమణీయంగానే ఉంటాయి. డూన్ని అంత ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, మాలో ప్రతి ఒక్కరినీ ఒక విశిష్ట వ్యక్తిగా ట్రీట్ చేయడమే! అనేకమందిలో ఒకడిగా నేను ఎన్నడూ భావించలేదు. నా ఉనికి, ప్రాధాన్యం, ఆసక్తుల గురించి నేను జాగరూకతతో ఉండేవాడిని. నేను క్రీడలంటే ద్వేషించేవాడిని. అది చూసి అందరూ నన్ను ఆటపట్టించేవారు కానీ ఎవరూ నన్ను ఆడాలని బలవంత పెట్టలేదు. చర్చలు, నటనను నేను ఆస్వా దించేవాడిని, వాటిలో పాల్గొనాలని నన్ను ప్రోత్సహించే వారు. నేను రాసేవాడిని, చదువుకునేవాడిని. దాన్నీ అందరూ ఆమోదించారు. ఈరోజు డూన్ స్కూల్ స్కాలర్స్ బ్లేజర్ కథను నేను ప్రస్తావిస్తాను. అది నా ఉద్దేశాన్ని నిరూపిస్తుంది. దశాబ్దాలపాటు క్రీడాకారులు మందపాటి నీలి బ్రౌజర్‌తో గుర్తింపు పొందేవారు. అది వారికి ఎంతో ప్రత్యేకత కలిగించేది. విద్యాపరంగా మొగ్గు చూపేవారికి అలాంటిదేమీ ఉండదు. అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని పాఠశాల చేత అంగీకరింప చేయడానికి నేను చాలా సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అది 1971లో సాధ్యమైంది. ఆ సంవత్సరం వ్యవస్థాపక దినో త్సవం సందర్భంగా హెడ్మాస్టర్ కల్నల్ సిమోన్ మొట్టమొదటి స్కాలర్స్ బ్రేజర్ని నాకు బహూకరించారు. దాన్ని గెలుచుకున్నందుకు నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను కానీ ఆ తర్వాత అది మరింత చిరస్మరణీయంగా రుజువైంది. ‘ఈ బ్లేజర్ ఎలా ఉండాలి;’ అని హెడ్మాస్టర్ ప్రశ్నించారు. నేను చీకాకు పడలేదు. స్పోర్ట్స్ బ్లేజర్ని అనుకరించడం గురించే నేను ఆలోచించగలిగాను. అయినా, నేను కోరుకుంటూ వచ్చింది ఇదే కదా! ‘‘రండి యంగ్ మ్యాన్’’ అంటూ కల్నల్ సిమోన్ పలకరించాడు. ‘‘మీరే మొట్టమొదటి వ్యక్తి. డూన్ స్కూల్ మొత్తం పాటించేటటువంటి డిజైన్ ని మీరు రూపొందించారు. అయితే మీరు కాపీ క్యాట్‌గా ఉండాలనుకుంటున్నారా?’’ అన్నారు! స్కాలర్స్ బ్లేజర్ని డిజైన్ చేయడానికి ఒక టీనేజర్‌కి స్కూల్ హెడ్మాస్టర్ అనుమతించడాన్ని 50 సంవత్సరాల తర్వాత... ఈనాటికీ నేను నమ్మలేకున్నాను. నలుపు రంగులో సాంప్రదాయికమైన డబుల్ బ్రెస్టెడ్ స్టయిల్ని నేను ఎంచుకున్నాను. అందుకే ఆనాటి నుంచి అదే కొనసాగుతూ వచ్చింది. డూన్ గర్వించదగిన ఒక కారణం ఏమంటే, కల్నర్ సిమోన్ వంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ప్రత్యేకమైన వారు కారు. నా హౌస్ మాస్టర్ గురుదయాళ్ సింగ్, నా మ్యాథ్స్ మాస్టర్ షీల్ వోహ్రా, నా జాగ్రఫీ ట్యూటర్ చార్లీ కండ్జాట, హిస్టరీ హెడ్ జీక్స్ సిన్హా.. ఇంకా అనేకమంది ఇతరుల ముఖాలు నాకు ఇప్పటికీ గుర్తే. ఇకపోతే నేను ఎన్నటికీ మర్చిపోలేని ఈ గొంతులు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి. నేనేం చేయాలి అని వీరు నాకు చెప్పడమే కాదు, నా పద్ధతిలో నేను చేయడాన్ని వీరు ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను తప్పు చేసినప్పుడు (తరచుగా నేను తప్పులు చేశాను) కూడా తప్పు చేయడం అనేది నేరం కాదని వారు నాకు వివరించారు. ఎన్నటికీ ప్రయత్నించకుండా ఉండే కన్నా ప్రయత్నించి విఫలం చెందడం మంచిది కదా! డూన్ స్కూల్ నాకు నేర్పిన ఉత్తమ పాఠం అదే మరి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి: థరూర్
డెహ్రడూన్: నేరమయ రాజకీయాలు అంతంకావాలంటే నాగరిక, విద్యాధిక సమాజం చొరవ చూపాలని కేంద్ర మంత్రి శశి థరూర్ పిలుపునిచ్చారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. ఇటువంటి వారు ప్రజలకు ప్రాతినిథ్యం వహించినప్పుడే రాజకీయాలు బాగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక డూన్ పాఠశాల విద్యార్థులతో థరూర్ ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసు ఉందని ఆయన తెలిపారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మంచివారు రాజకీయాల్లోకి రావాలన్నారు.