అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’  | Sakshi Guest Column On Gurudayal Singh | Sakshi
Sakshi News home page

అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’ 

Published Mon, Jun 26 2023 3:12 AM | Last Updated on Mon, Jun 26 2023 3:12 AM

Sakshi Guest Column On Gurudayal Singh

గురుదయాళ్‌ సింగ్‌

1960లలో డూన్‌ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఒక్కసారైనా క్రికెట్‌ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం స్పష్టంగా కనిపించేది. ఇందుకు భిన్నంగా 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన ‘గురు’ క్రీడాప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను విద్యార్థులలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడుతుండేవారు.

విద్యార్థులు ఆయన వద్ద పాఠ్యాంశంగా చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, వారు నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు ఆయన బోధించినవే. ఇలా చేయమని గురు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ఆయనొక ఉదాహరణగా కనిపించేవారు. 

మేము ఆయన్ని ‘గురు’ అని పిలుచు కోవడం ఆపేక్షతోనే అయినప్పటికీ నిజానికి ఆయనకు అదే కచ్చితమైన మాట. విశ్వగురు అనడం ఫ్యాషన్‌ ఈ రోజుల్లో. కానీ ఆయన నిజమైన, అంకితభావం కలిగిన, శ్రద్ధాబద్ధుడైన ఉపాధ్యాయుడు. కావాలంటే మీరు ఆయన్ని భారతీయ ‘మిస్టర్‌ చిప్స్‌’ అనుకోవచ్చు. డూన్‌ స్కూల్‌ అబ్బాయిలకు ‘గురు’ అనే పేరుతోనే గురుదయాళ్‌ సింగ్‌ తెలుసు. గురు అన్నది ఆయన పేరుకు సముచి తమైన నామకరణ. గత నెలలో ఆయన కన్ను మూసినప్పుడు కూడా అదే పేరుతో మాకు స్మరణీయం అయ్యారు. 

నేను గురును మొదటిసారి కలిసినప్పుడు నా వయసు పదేళ్లు. జైపూర్‌ హౌస్‌ ‘హౌస్‌ మాస్టర్‌’ ఆయన. పొడవాటి మనిషి. నా వయ సుకు ఇంకా పొడవుగా, భారీగా కనిపించారు. అయితే ఆయన చిరు నవ్వుతో నా భయాలు, అందోళనలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఆయన నవ్వినప్పుడు నేనూ పెద్దపెట్టున నవ్వాను. నవ్వును ఆపు కోలేకపోయాను. 

ఆయన వద్ద పాఠ్యాంశంగా నేను చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, నేను నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు సైతం ఆయన బోధించినవే. ఆ కొన్నింటిలో మొదటిది అతి కష్టమైనది మాత్రమే కాకుండా, అసలు నేనేమిటన్న దాన్ని నాకు బహిర్గతం చేసినది కూడా!  

1960లలో డూన్‌ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన  విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. దీనర్థం ఒక్కసారైనా క్రికెట్‌ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం అన్నది స్పష్టంగా కనిపించేదని! నేను నటనలో, వాదోపవాద చర్చలలో ముందుండే వాడిని. అలాగే, ఆఖరు నిమిషంలో చదివి మార్కుల్ని అదర గొట్టేయడంలో కూడా. కానీ నేను ఆటల్లో లేకపోవడం వల్ల నాలోని ఈ నైపుణ్యాలు చిన్నచూపునకు గురయ్యేవి.   

అయితే గురు, క్రీడా ప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను నాలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడు తుండేవారు. నేను పాల్గొన్న చర్చల్లోని నా తెలివైన మాటల్ని గుర్తు చేసుకునేవారు. అదొక ప్రశంసలా ఉండేది నాకు. లేదా చర్చావేదిక మీద అలా స్తంభించిపోయిన నా భంగిమ గురించి మాట్లాడుతూ నవ్వేసేవారు.

పైకి అది సున్నితమైన ఎగతాళిగా ఉన్నప్పటికీ నిన్ను నేను శ్రద్ధగా గమనిస్తున్నాను సుమా అనే ఒక అంతర్లీనత కూడా ఆయనలో వ్యక్తం అయి, నేనొక ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన నాలో కలిగించేది. జూనియర్స్‌ క్రికెట్‌లో నేను అత్యుత్తమంగా ఆడినప్పటికీ ఆయన ఉద్దేశం ప్రకారం నా చివరి ఏడాదిలో నేను ‘హౌస్‌ కెప్టెన్‌’ అవడానికి తగిన కారణం మాత్రం నాలోని ఆ కళాత్మక నైపుణ్యాలే! ఎందుకంటే, క్రికెట్‌ గ్రౌండ్‌లో నేనొక్కడినే ఉన్న వైపు నేరుగా వచ్చి నా చేతుల్లో పడిన బంతిని కూడా నేను క్యాచ్‌ పట్టలేకపోయాను.  

ఆ విధంగా గురు, డూన్‌ స్కూల్‌ తానుగా ఎప్పటికీ నాకు అందించని విశ్వాసాన్ని నాలో కలిగించారు. నాలోని ప్రతిభ, నైపుణ్యాలతో సమానంగా, నా పరిమితుల్నీ నేను గుర్తించేలా; నా అపజయాల్ని, వైఫల్యాలను, తప్పుల్ని నేను ఎదుర్కొనేలా నేను ఎదగడానికి గురు తోడ్పడ్డారు. పడిపోతే పైకి లేచి, ముందుకు సాగిపోవడం ఎలాగో నేర్పించారు. అది నాకు ముఖ్యమైన పాఠం. ఎందుకంటే జీవితంలో తరచు నేను పొరపాట్లు చేసి పడిపోతుంటాను.  

ఏళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయినప్పుడు గురు నాకు చెప్పిన మరొక పాఠాన్ని గుర్తుకు చేసుకున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించడం అన్నదొక్కటి మాత్రమే ఉత్తమ మార్గం కాదు. తప్పును మన్నించడం అన్నది ఉత్తమమైన మార్గం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అంటారు గురు. గురు స్వయంగా ఈ సూత్రాన్ని పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొండితనాన్ని, అబద్ధాలను, ఉద్దేశ పూర్వకమైన తెలివితక్కువ వేషాలను ఆయన భరించారు.

నా తప్పు లన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆ తప్పుల్ని పోనిచ్చేవారు. అయితే ఆయన ముఖభావాలను బట్టి, నేను మరికొంత మెరుగ్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించేవాడిని. ఏమీ తెలియని టీనేజ్‌లో ఉన్నప్పటికీ ఆ గ్రహింపు నాకు బాధను కలిగించేది. గురు దృష్టిలో గొప్పగా ఉండటం కన్నా నాకు వేరేదీ అక్కర్లేకపోయేది. అందుకే ఆయన అనిష్టత నా మనసును పిండేసినట్లుగా ఉండేది. ఆ మాత్రం శిక్ష సరిపోతుందని గురుకు తెలుసు. 

ఇతరులు తప్పు చేసినప్పుడు నేను ఈ పాఠాన్ని గుర్తు చేసు కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత తేలికగా ఉండదు. అందుకు వివేకం, నిగ్రహం రెండూ కావాలి. గురుకు ఆ రెండూ ఉన్నాయి. నాకు తరచు అవి రెండూ ఉండవు. నేను సరిగా నేర్చుకోని ఒక పాఠం ఇది. 

మూడవ పాఠం, నేనింకా సాధన చేస్తూనే ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అది సులభమైనది. కొద్దిపాటి మర్యాదల పాటింపుతో స్పష్టమైన వ్యత్యాసాలను మీరు చూపగలుగుతారు. గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అందరినీ పలకరించండి. ‘దయచేసి’, ‘ధన్యవాదాలు’ అని చెప్పడాన్ని ఎప్పుడూ విస్మరించకండి.   

ఇలా చేయమని గురు స్పష్టంగా నాకెప్పుడైనా చెప్పి ఉంటారని నేను అనుకోను. అయితే ఆయనొక ఉదాహరణగా ఎల్లవేళలా ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఉంటారు. జాగ్రత్తగా గమనించవలసింది ఆయన పెంపొందించిన సత్ప్రవర్తన, ఆయన పట్ల మనలో ఉన్న గౌరవ భావన ఆయన్ని మనం అనుకరించేలా చేస్తాయన్నది. ప్రత్యక్షంగా ఆయన ప్రబోధించని విలువలకు మనమంతా అలవాటు అవుతాం. అనుకరణ ద్వారానే నేను నేర్చుకున్నాను. 

నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నాపై గురు ముద్ర పొరపాటున పడినట్లుగా అనిపించదు. వాటర్లూ యుద్ధంలో బ్రిటన్‌ గెలుపు ఈటన్‌ (పాఠశాలల) ఆట మైదానాల వల్ల సాధ్యమయిందేమో నాకు తెలియదు కానీ నాలోని మనిషిని మలిచింది మాత్రం కచ్చితంగా జైపూర్‌ హౌస్‌ ‘హౌస్‌ మాస్టర్‌’ అనే చెప్పగలను. అందుకే ఎప్పటికీ ఆయన నా ‘గురు’.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement