విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి: థరూర్
డెహ్రడూన్: నేరమయ రాజకీయాలు అంతంకావాలంటే నాగరిక, విద్యాధిక సమాజం చొరవ చూపాలని కేంద్ర మంత్రి శశి థరూర్ పిలుపునిచ్చారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. ఇటువంటి వారు ప్రజలకు ప్రాతినిథ్యం వహించినప్పుడే రాజకీయాలు బాగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానిక డూన్ పాఠశాల విద్యార్థులతో థరూర్ ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న ఎంపీల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసు ఉందని ఆయన తెలిపారు. నాగరికులు, విద్యాధికులు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే మంచివారు రాజకీయాల్లోకి రావాలన్నారు.