జీవితమే ఒక వ్యూహం, ఓ ప్రయోగం | Kalluri Bhaskaram Article On Mahatma Gandhi 150th Birth Anniversary | Sakshi
Sakshi News home page

జీవితమే ఒక వ్యూహం, ఓ ప్రయోగం

Published Tue, Oct 1 2019 12:23 AM | Last Updated on Tue, Oct 1 2019 12:27 AM

Kalluri Bhaskaram Article On Mahatma Gandhi 150th Birth Anniversary - Sakshi

‘భారత్‌’ అనే ఈ దేశం ఆంగ్లేయుల పాలనలో ‘ఇండియా’గా మారుతున్న చారిత్రకదశలో ఆ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ గాంధీ అవతరించాడు. సంప్రదాయాన్ని నిలుపుకుంటూనే ఆధునికతవైపు, కులమతజాతి భేదాలకు అతీతమైన ఒక విస్తృతివైపు సాగడంలో గాం«దీలో మొదటినుంచీ ఉన్న ఒక జిజ్ఞాస సాయపడింది. చిన్నప్పుడు మెహతాబ్‌ అనే ముస్లింతో స్నేహంద్వారా గాంధీ మొదటిసారి తన కులమత సంప్రదాయ పరిధికి అవతల ఉన్న ప్రపంచంలోకి తొంగిచూడగలిగాడు. భారత్‌లో స్వాతంత్య్ర పోరాటానికి అంతవరకూ లేని ఒక విశాల జనభూమికను కలి్పంచడమే ఇతర సమకాలీన నాయకుల్లో ఆయనను విశిష్టంగా నిలబెట్టింది. అదే ఆయనను కొందరికి ఆరాధ్యుని చేస్తే, కొందరికి శత్రువును చేసింది. ఆ శత్రుత్వమే చివరికి ఆయన ప్రాణాలను హరించింది.

గాంధీ గురించి రాసేటప్పుడు కేవలం వాస్తవాలు రాస్తున్నా అవి అతిశయోక్తుల్లా ధ్వనిస్తాయి. ప్రపంచచరిత్రలో కానీ, మన దేశచరిత్రలో కానీ గాంధీ లాంటి వ్యక్తి మరొకరు కనిపించకపోవడమే అందుకు కారణం. గాంధీ అభిమానులకే కాదు, వ్యతిరేకులకు కూడా ఎదురయ్యే పరి స్థితి ఇది. గాంధీ భారతదేశంలోనే కాదు, అంతకుముందు దక్షిణాఫ్రికాలో కూడా స్వాతంత్య్రపోరాటం నిర్వహించాడు. ఈవిధంగా రెండు దేశాలలో స్వాతంత్య్రపోరాటం నిర్వహించిన నాయకులు కనిపించరు. 21 ఏళ్లపాటు దక్షిణాఫ్రికా గడ్డ మీద నిలబడి ఆయన సాగించిన పోరాటం, భారతదేశంలో నిర్వహించిన పోరాటానికి ఏమాత్రం తక్కువది కాదు. పైగా అది తనలో యవ్వనోత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు జరిగినది. ఇంకా చెప్పాలంటే, ఆయన భారతదేశ పోరాటానికి అవసరమైన శిక్షణ పొందినదీ, వ్యూహాలను పదును పెట్టుకున్నదీ దక్షిణాఫ్రి కాలోనే.  

బారిస్టర్‌ చదవడానికి 1888లో ఇంగ్లండ్‌ వెళ్ళేవరకూ గాంధీలో ఎలాంటి నాయకత్వ లక్షణాలూ కనిపించవు. పైగా నలుగురిముందూ మాట్లాడటానికి కూడా తగని బిడియం. ఇంగ్లండ్‌లో మాంసం ముట్టనని తల్లికి మాట ఇచ్చాడు కనుక, లండన్‌లో శాకాహార ఉద్యమంవైపు సహజంగానే ఆకర్షితుడై, ఆ ఉద్యమంలోనే రాజకీయ నాయకత్వానికి అవసరమైన శిక్షణ పొందాడు. ఉపన్యాసం ఇవ్వడానికీ, రచనలు చేయడానికీ శాకాహార ఉద్యమమే ఆయనకు ఊతమిచ్చింది. ది వెజిటేరియన్‌ అనే పత్రికకు ఆయన రాసిన వ్యాసాలలో ఉప్పుపన్ను మీద రాసినది ఒకటి. 

1930లలో ఆయన నిర్వహించిన ఉప్పుసత్యాగ్రహం ఆలోచన మూలాలు ఇంత సుదూర గతంలో ఉన్నాయన్నమాట. చదువు ముగించుకుని భారత్‌కు తిరిగివచి్చన తర్వాత కథియవార్‌ లోని బ్రిటిష్‌ రాజప్రతినిధి చార్లెస్‌ ఒలివంట్‌ రూపంలో జాతిదురహంకార రూపాన్ని నగ్నంగా దర్శించేవరకూ గాం«దీలో నాయకత్వ లక్షణం వెల్లడికాలేదు. ఆ తర్వాత దాదా అబ్దుల్లా అండ్‌ కో అనే కంపెనీకి ఒక కేసులో సహకరించడానికి ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళడం, వెడుతూనే మరింత కర్కశమైన జాతిదురహంకారాన్ని ఎదుర్కోవడం, రైలులో మొదటి తరగతిలో ప్రయా ణిస్తున్న తనను అర్ధరాత్రి చలిలో పీటర్‌ మారిట్జ్‌ బర్గ్‌ అనే స్టేషన్‌లో దింపివేయడం, ఆ క్షణంలోనే జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన సంకలి్పంచుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. 

నిజానికి అంతకుముందు డర్బన్‌లోని ఒక కోర్టులో తలపాగా తీసివేయ మన్న మేజి్రస్టేట్‌ ఆదేశాన్ని ధిక్కరిస్తూ కోర్టునుంచి బయటికి రావడం ద్వారా గాంధీ అక్కడి పత్రికల్లో ఒక సంచలన వార్త అయ్యాడు. అంతేకాదు, ఒక ప్రతీకాత్మకచర్యకు గల శక్తి ఎలాంటిదో, తన పోరాటాల తొలిరోజుల్లోనే పసిగట్టగలిగాడు. అనంతరకాలంలో సత్యాగ్రహానికి ఉప్పును సాధనం చేసుకోవడంలోనూ,  చితికిపోయిన భారత ఆరి్థకతను పునరుద్ధరించడానికి సంకేతంగా చరఖాను చేపట్టడంలోనూ ప్రతీకలపట్ల అలాంటి స్పృహే వ్యక్తమవుతుంది.  

 వేషభాషలకు గల ప్రతీకాత్మకతను గుర్తించి వాటిని కూడా గాంధీ తన ఎత్తుగడలలో భాగం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో పోరాటం చేస్తున్న రోజుల్లో కూడా ఆయన డాబు దర్పం ఉట్టిపడే యూరోపియన్‌ దుస్తులనే చాలాకాలంపాటు ధరించాడు. భారతీయులను చిన్నచూపు చూసే అక్కడి యూరోపియన్‌ అధికారులకు, విద్యా వంతులకు పాఠం చెప్పే ఒక ఎత్తుగడ దానివెనుక ఉంది. అదే గాంధీ అక్కడి ఒప్పంద కార్మికులతో మమేకమవుతూ వారి దుస్తుల్లోకి మారిపోవడమే కాదు, తన మకాన్ని చిన్న కుటీరానికి మార్చివేయడానికీ క్షణం సందేహించలేదు. 

ఈ దుస్తుల ఎత్తుగడ ఆయన భారత్‌ వచి్చన తర్వాతా కొనసాగించాడు. 1915లో బొంబాయి రేవులో ఓడ దిగుతూనే ఒప్పంద కారి్మకుల దుస్తులు విడిచేసి సంప్రదాయిక హిందూ వేషంలోకి మారిపోయాడు. గాంధీ ఆ తర్వాత అర్ధనగ్నవేషంలోకి మారడం వెనుకా పేదలతో మమేకమయ్యే ఎత్తుగడే ఉంది. దక్షిణాఫ్రికాలో మొదట్లో మొదటితరగతిలో ప్రయాణించడానికే పట్టుబట్టిన గాం«దీ, భారత్‌లో మూడవ తరగతి బోగీలో ప్రయాణించడం వెనుక ఉన్నదీ ఇలాంటి ప్రతీకాత్మకతే. 

లక్ష్యసాధనకు తన జీవితం మొత్తాన్నే ఒక ఎత్తుగడగా, ఒక ప్రయోగశాలగా గాంధీ మార్చుకున్నాడు. ఆ ఎత్తుగడలో, ప్రయో గంలో తన కుటుంబం మొత్తాన్ని భాగం చేశాడు. ఆయనకు బహి రంగ జీవితమే తప్ప, ప్రైవేట్‌ జీవితం ఉన్నట్టే కనిపించదు. క్రియకు దూరమైన క్షణం ఆయన జీవితం మొత్తంలో ఎక్కడా లేదు. ఒకవిధంగా ఆయన చేసినదంతా తపస్సే. ‘భారత్‌’ అనే ఈ దేశం ఆంగ్లేయుల పాలనలో ‘ఇండియా’గా మారుతున్న చారిత్రకదశలో ఆ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ గాంధీ అవతరించాడు. 

సంప్రదాయాన్ని నిలుపుకుంటూనే ఆధునికతవైపు, కులమతజాతి భేదాలకు అతీతమైన ఒక విస్తృతివైపు సాగడంలో గాం«దీలో మొదటినుంచీ ఉన్న ఒక జిజ్ఞాస సాయపడింది. చిన్నప్పుడు మెహతాబ్‌ అనే ముస్లింతో స్నేహంద్వారా గాంధీ మొదటిసారి తన కులమత సంప్రదాయ పరిధికి అవతల ఉన్న ప్రపంచంలోకి తొంగిచూడగలిగాడు. అలా పడిన అడుగులు తన లండన్‌ జీవితంలో ఆయనను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. అక్కడాయన క్రైస్తవమత బోధలకు వెళ్ళేవాడు, చర్చి సేవల్లో పాల్గొనేవాడు, దివ్యజ్ఞాన సమాజానికి వెళ్ళేవాడు, అంజుమన్‌–ఎ–ఇస్లాం సమావేశాల్లో పాలుపంచుకునేవాడు.

ప్రసిద్ధ నాస్తికుడైన చార్లెస్‌ బ్రాడ్‌ లాఫ్‌ను ఎంత అభిమానించాడంటే, ఆయన అంత్యక్రియలకు కూడా వెళ్ళాడు. ఆయన జీవితంలో, ఉద్యమ జీవితంలో మొదటినుంచీ ఉన్న ముస్లిం భాగస్వామ్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్‌లో మొదట్లో న్యాయవాదిగా రాణించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయన చేత మొదటిసారి అర్జీ రాయించుకుని ఆవిధంగా ఎంతోకొంత సంపాదనకు మార్గం చూపిన వ్యక్తి ఒక పేద ముస్లిం. ఆయన దక్షిణాఫ్రికా వెళ్లడానికి కారణం కూడా ముస్లిమే. అక్కడ ఆయన నిర్వహించిన పోరాటాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నది ముస్లింలే.  


ఈ కులమతాతీత దృష్టి ఆయన పోరాటాలలో ఒక ప్రధానవ్యూహానికి రూపకల్పన చేసింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు, మహిళలు అనే తేడా లేకుండా దక్షి ణాఫ్రికాలో భారతీయులందరూ జాతివివక్షను ఎదుర్కొంటూ ఉండడం ఆయన విశాలవ్యూహానికి ఒక కారణం. భారత్‌లో ఆయన చేసిందల్లా ఈ దక్షిణాఫ్రికా ప్రయోగాన్ని యథాతథంగా అమలు చేయడమే. ఆ విధంగా భార త్‌లో స్వాతంత్య్ర పోరాటానికి అంతవరకూ లేని ఒక విశాల భూమికను కలి్పంచడమే సమకాలీనుల్లో ఆయనను విశిష్టంగా నిలబెట్టింది. అదే ఆయనను కొందరికి ఆరాధ్యుని చేస్తే, కొందరికి శత్రువును చేసింది. ఆ శత్రుత్వమే చివరికి ఆయన ప్రాణాలను హరించింది. 
భారత్‌కు తిరిగివస్తూనే ఇక్కడ ఏం చేయాలో ఆయన ముందే వ్యూహం రచించుకున్నాడు. పేదలతోనూ, రైతులతోనూ కనెక్ట్‌ కావడం అందులో భాగం. 

విప్లవవాద విద్యార్థుల సమావేశంలోనూ, బెనారస్‌ హిందూవిశ్వవిద్యాలయ స్థాపన సమావేశంలోనూ రెచ్చగొట్టేలా చేసిన రెండు ప్రసంగాలతో గాంధీ యావద్భారత దృష్టినీ ఆకర్షించాడు. కృపలానీ, పటేల్, నెహ్రూ, ఆజాద్, రాజేంద్రప్రసాద్, రాజాజీ, వినోబాభావే తదితరులను ఒక్కొక్కరినే తన ప్రభావ పరిధిలోకి ఆకర్షించాడు. చంపారన్‌ ఉద్యమంతో మొదలు పెట్టి, ఖెడా రైతు పోరాటం, రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా నిర్వహించిన హర్తాళ్, సహాయ నిరాకరణ, నిర్మాణ కార్యక్రమం, ఉప్పుసత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం మీదుగా గాంధీ నాయకత్వంలో సాగిన పోరాటం మరో ఉజ్వలఘట్టం. 

కులమతభాషాప్రాంత భేదా లతో నిండిన భారత్‌ వైవిధ్యానికి అద్దంపట్టే నాయకుడిగానే కాదు; భిన్నభావజాలాల వారిని కలిపే కేంద్రబిందువుగా కూడా వ్యవహరించాడు. భావజాలపరంగా దగ్గరైన నెహ్రూ కన్నా గాం«దీకే సోషలి స్టులు సన్నిహితంగా ఉండేవారు. అలాగే హిందూవాదులైన స్వామి శ్రద్ధానంద, లాలా లజపతిరాయ్, మాలవీయ తదితరులు కూడా.  రెండు పంథాలవారికి మాత్రమే గాంధీ దగ్గర కాలేకపోయాడు. 

ఒకరు మహమ్మదాలి జిన్నా. ఆయనకు దగ్గర కావడానికి గాంధీ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. రెండవ వ్యక్తి సావర్కర్, ఆయన భావజాల ప్రతినిధులు. ఎవరు బతికారు మూడు యాభైలు అంటారు. చనిపోయిన తర్వాత కూడా బతకడమే నిజమైన బతుకు అనుకుంటే ఇప్పటి దేశవాతావరణంలో గాంధీ ఇంకా బతకాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయనలో బలహీనతలు, వైరుధ్యాలు లేవని కాదు. ఎవరూ పరిపూర్ణులు కారనీ, కాకపోతే పరిపూర్ణతకు గాంధీ కాస్త దగ్గ రగా వెళ్లాడన్న లజపతిరాయ్‌ వ్యాఖ్య కొంత అర్థవంతమనిపిస్తుంది. 
వ్యాసకర్త : కల్లూరి భాస్కరం, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement