జీవన పర్యంతం రాజీలేని పోరాటం | Tiruvaipati Rajagopal Article On Mahatma Gandhi 150th Birth Anniversary | Sakshi
Sakshi News home page

జీవన పర్యంతం రాజీలేని పోరాటం

Published Tue, Oct 1 2019 12:35 AM | Last Updated on Tue, Oct 1 2019 12:35 AM

Tiruvaipati Rajagopal Article On Mahatma Gandhi 150th Birth Anniversary - Sakshi

గాందీకి మహాత్ముడు, జాతిపిత, బాపు అనే కితాబులు తగిలించేసి ఆయన విశ్వసించి,  ఆచరించిన సమస్తాన్నీ ఉపేక్షించిన జనం మనం.  అక్టోబరు 2ను సెలవు దినంగా పరిగణించి ఏవో సంస్మరణ సభలు జరుపుకోవడం మినహాయించి  గాంధీ చూపిన ఆదర్శాలు మనం ఏమేరకు ఆచరిస్తున్నాం ? జాతి సమస్తానికీ సంపద, ప్రగతి సమంగా చెందాలని గాంధీ కలలుగన్న  సర్వోదయ మనకింకా కనుచూపుమేరలో నైనా అగుపడుతోందా? ‘నా కెలాంటి మహత్తులూ లేవు. యే మహత్తులూ నాకొద్దు కూడా...’  అని నిస్సంకోచంగా చెప్పేసిన ఆచరణ శీలి, నిరంతర చలనశీలి గాంధీ. తాను ఆచరించని దేన్నీ గాంధీ మాట్లాడేవాడు కాదు.  యే పడికట్టు పిడివాదం పంజరంలోనూ ఆయన బందీ అవలేదు. హింసకు తావు లేని పోరాటపథంలో ఆయన యెప్పటికప్పుడు సవరణలూ, సర్దుబాట్లూ చేసుకుంటూ చివరిదాకా గమనం సాగించాడు. 

బ్రిటిష్‌ వాళ్ళు ఇండియాను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించడానికి గాంధీ అనుసరించిన పోరాటం అసలు కారణం కాదనీ, సువిశాల భారతావనిలో తమ ప్రభుత్వం కొనసాగడానికి తగిన ఆరి్థక వనరులు సన్నగిల్లడమే కారణమనీ చెప్పుకొస్తారు కొందరు మేధావులు. 1930లో గాంధీ వ్యూహాత్మకంగా ఇచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ ప్రభావం బ్రిటిష్‌ ప్రభుత్వం ఆదాయాన్ని కోలుకోలేనట్టుగా దెబ్బ తీయడం కాదనగ లమా? భారత్‌కు ఎగుమతుల ద్వారా 1924లో ఇంగ్లండు 90.6 మిలియన్ల స్టెర్లింగ్‌ పౌండ్లు ఆర్జించగా 1930 కి అది 52.9 మిలియన్‌ పౌండ్లకు పడిపోయింది. బ్రిటిష్‌ పాలకులకు ఈ లోటు  గాంధీ వ్యూహం తెచి్చంది కాదా? 

అహింసను ఒక సైద్ధాంతిక నైరూప్యంగా కాకుండా ఆచరణీయ రాజకీయ సాధనంగా చేపట్టిన సాహసి, దార్శనికుడు గాం«దీ.మోహన్‌ దాస్‌ గాంధీ  అనే ఒక మామూలు మనిషి  మహాత్ము డైన  వైనం నమ్మశక్యం కానిది. అలాంటి ఒక మానవుడు రక్తమాంసాలతో భూమ్మీద తిరిగా డని ఊహించలేం (ఈ మాట ఐన్‌స్టీన్‌ది).  గాంధీ పోరాడింది కేవలం దేశ స్వాతంత్య్రం కోసమే కాదు. మహిళలకు హక్కులు, కుల వివక్షను రూపుమాపడం, మత విద్వేషాలకు ఎదురునిలవడం, జంతు సంక్షేమం.. ఇవన్నీ గాంధీ చివరిదాకా విస్మరించని సామాజికాంశాలు. 

‘ఇండియన్‌ ఒపీనియన్‌’ (1903 –1914), ‘యంగ్‌ ఇండియా’ (1919 –1932), ‘హరిజన్‌’ (1933 –1948)లకు సంపాదకుడుగా ఆయన తాను నమ్మిన విలువలకు, సిద్ధాంతాలకూ విస్తృత ప్రచారమే చేశారు. రాజ్యహింస, నరమేధం అక్కడక్కడా అన్ని భౌగోళిక ప్రాంతాలలోనూ తలెత్తుతూనే ఉన్నా అహింస ఆచరణీయత ఇంకా బతికే ఉంది. నవ్య మానవ చరిత్రలో అహింసను అంతగా అపరిగ్రాహ్యం చేసిన మహనీయుడు ఖచి్చతంగా మహాత్ముడే.  

వందేళ్ళ క్రితం స్వాతంత్య్రోద్యమం తన కనుసన్నలలో నడిచినప్పుడు గాంధీ తీసుకున్న నిర్ణయాలు, వాటి ఔచిత్యం, తన పోరాటంలోని నైతిక సూత్రావళి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. నియంతృత్వానికి ప్రతిగా ని్రష్కియాపరత్వంలో ఉండిపోయే పలాయన వాదం కాదు గాంధీ నమ్మిన అహింస. అహింస అంటే గాం«దీకి అంతర్గత ధీరత్వం; పిరికి వాడి ఆఖరి అస్త్రం కాదు. సంక్లిష్ట సమయాల్లో నిమ్మళంగా నిలబడడం, ఓటమి అంచుల్లోనూ నమ్మకంతో నడవడం, జాతి తన మీద పెట్టుకున్న విశ్వాసం అనుక్షణం స్పృహలో ఉంచుకోవడం గాంధీ ఎన్నడూ విస్మ రించలేదు. 

శ్రమ లేని సంపద, వివేకాన్ని ఆవ లకు నెట్టిన విలాసం, మానవత్వం లేని శాస్త్ర విజ్ఞానం, శీలం కొరవడిన ప్రతిభ, నియమావళి  లోపించిన రాజకీయం, నైతికత లేని వాణిజ్యం, త్యాగం కొరవడిన పూజ... వీటన్నిటినీ గాంధీ తప్పుపట్టాడు. సత్యం అంటే అవ్యాజ ప్రేమ, అన్యాయం పట్ల ఆగ్రహం, అణగారిన జనం పట్ల సానుభూతి జీవన పర్యంతమూ ఆయన రాజీ పడకుండా అంటిపెట్టుకున్న సూత్రాలు.                                            
వ్యాసకర్త :  రాజగోపాల్‌  తిరువాయపాటి, సీనియర్‌ పాత్రికేయుడు, తిరుపతి,
మొబైల్‌ :  95731 6905
7

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement