ఆ నడిపించు వాడెవడు? ఖ్యాతి
గడింతురె జీర్ణ దేహులున్?
‘‘వానికి గోచి గుడ్డయును, వాని
కరమ్ముల నూత కఱ<యున్
వాని కనీనికా సుధము, పాపల
వోలిక బోసి నవ్వులున్
వానిని చూడు! పోచవలె, వాడు
మహీధర మేరు ధీరుడున్!’’
ఆ నినదించు కోటి జనులు, ఆ గొని
పోయెడు గమ్యమెచ్చటో?
‘‘దీనుల స్వేచ్ఛగోరి నినదించు
గంభీర సముద్ర తీరముల్!
కానని ఉచ్ఛనీచములు, కన్నులు
గానని దండనీతియున్,
పూని మహా సముద్రమటు పొంగెడు
నేలకు జైళ్లు చాలునే?’’
‘‘ఆ నడిపించు వాడు, వెనుకంజను
వేయని ముక్త కంఠముల్
ప్రాణముపైన ప్రీతి, ఉరిత్రాతను
భీతియు, లేని జాతియున్
బానిస సంకెలల్ విడి, త్రివర్ణ
పతాకము నెత్తు రోజునన్
మౌనవ్రతమ్ము వానికి, క్షమం
ధరణిన్ విభజించు బాధచే!’’
ఆ నడిపించు వానిని, మహాత్ముడ
టంచు నుతింతురేటికిన్?
‘‘వాని అహింస, సత్యమును, వాని
ధరాతల శాంతి మంత్రమున్
వాని అఖండ త్యాగమును,
వజ్రము వంటి కఠోర దీక్షయున్
వానికభాగ్య మానవులపై గల
జాలి, దయాంతరంగమున్!’’
ఆ నడిపించు తండ్రి నకటా! బలి
దానము కోరె దేశమున్?
‘‘కానలె మానవోత్తముడొకందు
బుజంబున శిల్వ దాల్చుటన్?
పూనడె కాలకూటమును మోదముతో
నొక తత్వవేత్తయున్?
మానిత ధీర మానవుల మార్గమిదే,
బలిపీఠమెక్కుటన్!’’
‘‘వాని విశిష్ట దేహమిట వ్రాలె
జపించుచు రామనామమున్
వానిని గొన్న నేల తలవాల్పవొ
భక్తిని చిట్టి తమ్ముడా!
వాని పవిత్ర ధూళి గొని, ఫాలము
దిద్దవె ముద్దు చెల్లెలా!
మీ నయనాల ముత్తెములు, మీ పసి
బుగ్గల మౌన బాష్పముల్?’’
– నివర్తి మోహన్ కుమార్
ఇన్‌బాక్స్ : ఆ నడిపించు వాడు
Published Tue, Oct 1 2019 12:41 AM | Last Updated on Tue, Oct 1 2019 12:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment