పురా చరిత్రగా, సామాజిక పరిణామ చరిత్రగా మహాభారతాన్ని పరిశీలిస్తూ కల్లూరి భాస్కరం రాసిన వ్యాసాల సంపుటి ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ 800 పేజీల పుస్తకంలోంచి కొంత భాగం.
ఓరోజు సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్న (ఐర్లాండ్) గ్రామంలో జార్జి థామ్సన్ పచార్లు చేస్తూ ఊరి బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ తెలిసినామె కనిపించింది. ఆమె ఒక వృద్ధ రైతుమహిళ. అప్పుడే బొక్కెనలో నీళ్లు నింపుకుని సముద్రం వైపు తదేకంగా చూస్తూ నిలబడివుంది. ఆమె భర్త చనిపోయాడు. ఏడుగురు కొడుకులు. ఏడుగురూ ‘కట్టకట్టుకుని’(ఆమె అభివ్యక్తి) మసాచూసెట్స్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌కు వెళ్లిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఒక కొడుకు దగ్గరనుంచి ఆమెకు ఉత్తరం వచ్చింది. ‘ఈ చివరి రోజుల్లో మా దగ్గర సుఖంగా ఉందువుగాని, వచ్చేయి, నువ్వు సరేనంటే ప్రయాణానికి డబ్బు పంపిస్తా’మని దాని సారాంశం.
ఈ విషయం ఆమె థామ్సన్‌తో చెప్పింది. కొండలు, బండలు ఎక్కుతూ, ఎగుడు దిగుడు పచ్చికబీళ్ల మీద నడుస్తూ జీవితంలో తను పడిన కష్టాల గురించి, తను పోగొట్టుకున్న కోళ్ల గురించి, పొగచూరిన చీకటి గుయ్యారం లాంటి తన చిన్న ఇంటి గురించి వర్ణించుకుంటూ వచ్చింది. తర్వాత అమెరికా గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె ఊహలో అమెరికా అంటే బంగారపు దేశం. అక్కడ కాలిబాటల మీద కూడా బంగారం దొరుకుతుందట. ఆ తర్వాత, కొడుకులుండే కార్క్ నగరానికి రైలు ప్రయాణం గురించి, అట్లాంటిక్ దాటడం గురించి మాట్లాడింది. ఆపైన తన శరీరం ఐరిష్ మట్టిలోనే కలిసిపోవాలన్న తన చివరి కోరిక గురించి చెప్పింది.
ఆమె మాట్లాడుతున్నకొద్దీ ఉత్తేజితురాలు కావడం ప్రారంభించింది. ఆమె భాష క్రమంగా మరింత ప్రవాహగుణాన్ని సంతరించుకోసాగింది. అది మరింత ఆలంకారికతను, లయాత్మకతను, శ్రావ్యతనూ పుంజుకుంటూ వచ్చింది. ఆమె దేహం స్వాప్నికమైన ఒక ఊయలలో ఊగిపోతున్నట్టు అనిపించింది. తను కవినన్న భావన ఏ కోశానా లేని ఈ నిరక్షరాస్య వృద్ధమహిళ మాటల్లో కవిత్వానికి ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయంటాడు థామ్సన్.
ఇదొక పూనకం; కవిత్వం ఒక ప్రత్యేకమైన వాక్కు అంటాడు. కవిత్వం పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. వాక్కు ఎలా పుట్టిందో తెలుసుకోవడమంటే, మనిషి ఎలా అవతరించాడో తెలుసుకోవడమే. వాక్కు సామూహిక శ్రమలో భాగంగా పుట్టింది. శ్రమ చేసేటప్పుడు కండరాల కదలికకు అది సాయపడుతుంది. శ్రమలో భాగమైన వాక్కును శ్రమకు కారణంగా, లేదా చోదకంగా మనిషి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం మాట అనుకుంటున్నది, అతని దృష్టిలో మాట కాదు, మంత్రం!
శ్రమ సాంకేతికత అభివృద్ధి చెందినకొద్దీ, శ్రమలో గొంతు పాత్ర తగ్గిపోతూ వచ్చింది. వ్యక్తులు సమూహంగానే కాక విడివిడిగా కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. అయితే సామూహిక ప్రక్రియ వెంటనే అదృశ్యం కాలేదు. అది, ఒక అసలు కార్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రదర్శించే రిహార్సల్ రూపంలో మిగిలింది. ఇంతకుముందు అసలు కార్యంలో భాగమైన సామూహిక కదలికలే ఒక నృత్యరూపంలో రిహార్సల్స్‌గా మారాయి. ఈ మూకాభినయ నృత్యం ఇప్పటికీ ఆదిమజాతులలో ఉంది.
అయితే, నృత్యంలో వాచికాభినయం ఉన్న చోట, అది మాంత్రికరూపం తీసుకుంది. అందుకే అన్ని భాషలలోనూ రెండు రకాల వాగ్రూపాలు కనిపిస్తాయి. నిత్యజీవితంలో మాట్లాడుకునే సాధారణ వాక్కు, కవితాత్మకమైన వాక్కు. ఈ విధంగా చూసినప్పుడు సాధారణ వాక్కు కంటే కవితాత్మకమైన వాక్కే ప్రాథమికమని తేలుతుంది. వాళ్లకు తెలిసిన కవిత్వరూపం పాట ఒక్కటే. వారి పాట, తీరిక సమయంలో పాడుకునేది కాదు. పనిలో భాగంగా పాడుకునేది. పని ద్వారా ఏ భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారో పాట ద్వారా కూడా అదే భౌతిక ప్రయోజనాన్ని ఆశిస్తారు.
ఈ సందర్భంలో మావోరీలు(న్యూజిలాండ్) జరిపే పొటాటో నృత్యాన్ని థామ్సన్ ప్రస్తావించాడు. ఆడపిల్లలు ఆలుగడ్డలు పండించే పొలానికి వెళ్లి పంట ఎదుగుదలకు అవసరమైన తూర్పుగాలి వీస్తున్నట్టు, వర్షం పడుతున్నట్టు, పంట మొలకెత్తి పెరుగుతున్నట్టు తమ శరీరపు కదలికల ద్వారా సూచిస్తూ పాడుతూ నృత్యం చేస్తారు. అంటే, వాస్తవంగా తాము కోరుకునేది ఊహాత్మకంగా సాధిస్తారు. వాస్తవికమైన క్రియకు భ్రాంతిపూర్వక క్రియను జోడించడమే మాంత్రికత.
యుద్ధంలో విజయం సాధించడానికి ముందు యాగం జరుపుతారు. అది యుద్ధానికి రిహార్సల్స్. అందులో విజయాన్ని భ్రాంతిపూర్వకంగా ముందే సాధిస్తారు. ఆ భ్రాంతిపూర్వక విజయం అసలు విజయాన్ని కట్టబెడుతుందని నమ్మకం. వర్షాలు పడనప్పుడు సహస్రఘటాభిషేకం చేస్తారు. ఆ జల పుష్కలత్వం గురించిన భ్రాంతివాస్తవికత, వాస్తవికమైన జలపుష్కలత్వాన్ని ఇస్తుందని నమ్మకం.మహాభారతంలో ఇటువంటి మాంత్రికతకు అద్దం పట్టిన ఘట్టాలలో సర్పయాగం, ద్రౌపదీ, దృష్టద్యుమ్నుల జన్మవృత్తాంతం ప్రముఖంగా చెప్పుకోదగినవి.
-కల్లూరి భాస్కరం
Comments
Please login to add a commentAdd a comment