దేవులపల్లి అమర్
డేట్‌లైన్ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనే!
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మార్పులు తీసుకురావలసిన అవసరం చాలా ఉందని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ప్రతిసారీ చెబుతున్నారు. ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆ సవరణలు తీసుకురావచ్చు కూడా. ఇంతకూ విభజన చట్టంలో తీసుకురావలసిన మార్పు లేమిటి? ఎలాంటి మార్పులు అవసరమని కేంద్రం అనుకుంటున్నది? పోనీ ఈ మార్పులను గురించి పదే పదే మాట్లాడుతున్న వెంకయ్యనాయుడికైనా ఈ విషయంలో స్పష్టత ఉందా?
మార్పులు సరే, అవి ఎలాంటివి?
ఒకటి నిజం. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు ఈ మార్పులకు సంబంధించి చెప్పిన వివరాలు పెద్దగా లేవు. శాసనమండలి, శాసనసభల స్థానాల హెచ్చింపు, రాజ్యసభ సభ్యులకు రాష్ట్రాల కేటాయింపులో జరిగిన మార్పులు వంటి అంశాలే అందులో వినిపిస్తున్నాయి. కానీ ఇవి ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధిలో పెద్దగా సంబంధంలేనివే. అంతర్రాష్ర్ట సమస్యల మీద సరైన నిర్ణయాలు తీసుకోకుండానే హడావుడిగా విభజన బిల్లును పార్లమెం ట్‌లో ఆమోదింపచేసుకున్నారని విపక్షాలన్నీ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతు న్నాయి. కానీ, అవే లోపాలను సవరిస్తానని చెబుతున్న వెంకయ్య నాయుడు గారి పాత్ర కూడా అందులో చాలా ఉందని ఎన్‌డీఏకు నాయకత్వం వహి స్తున్న బీజేపీ గుర్తించాలి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ వ్యవహారం ఇట్లాంటి మలుపు తిరిగి ఉండేది కాదు. ఎంతసేపూ రాష్ర్ట విభజన మీద ‘మీ వైఖరి స్పష్టం చెయ్యండి!’ అని ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే ఎత్తుగడ తప్ప భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల మీద కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదు. కాబట్టే అక్కడా, ఇక్కడా ఆ పార్టీ శిక్ష అనుభవిస్తోంది. ఇక బీజేపీ విషయం చూస్తే, ‘ఆనాడు మా వెంకయ్యనాయుడు గట్టిగా నిలబడి ఉండకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోయి ఉండేది!’ అని మాట్లాడుతున్నది. ఈ ఎనిమిది నెలల కాలంలో రెండు కేంద్ర మంత్రిపదవులు మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ఆ పార్టీ చేసిందేమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు ఉండా ల్సిందేనని రాజ్యసభలో అంత గట్టిగా మాట్లాడి, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేత మౌఖిక హామీ పొందిన వెంకయ్యనాయుడు ఇప్పు డేమో ‘ప్రత్యేక హోదా చాలా కష్టం, అన్ని రాష్ట్రాలూ అంగీకరించాలి’ అని పదేపదే చెబుతున్నారు. మిత్రపక్షం తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నోటితో కూడా చెప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడయితే ఇంకాస్త ముందుకు పోయి, కేంద్రం కష్టాల్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టొద్దు అని మంత్రివర్గ సహచరులతో చెబుతున్నారు. దీనిలో మతలబు ఏమై ఉంటుంది? మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనో, దాని మిత్రపక్షాల చేతుల్లోనో ఉన్నాయి. ఇంకొన్ని కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రులను ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించడం వారికి ఎందుకు అంత దుస్సాధ్యమయింది?
సాగర్‌లో కొట్టుకుపోయిన పరువు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తమ తమ రాష్ట్రాలలో ప్రజల మెప్పు పొందడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వీటికి పరోక్షంగానే అయినా మద్దతు పలుకుతున్నారు. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారు లను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, మొన్న శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనూ, వాటి ముఖ్యమంత్రులనే. ఇద్దరు ముఖ్యమంత్రులకూ సమాచారం లేకుండానే ఈ ఘటనలన్నీ జరుగుతు న్నాయా? నాగార్జునసాగర్ డ్యాం దగ్గర జరిగిన సంఘటన ఎటువంటిది? యావత్ భారతదేశం ముందు రెండు తెలుగు రాష్ట్రాలకూ తలవంపులు తెచ్చిన సంఘటన. రెండు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ ఒకరినొకరు తిట్టుకున్నారు. తోసుకున్నారు, లాఠీ చార్జ్ చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కంట్రోల్ రూం మీద దాడి చేసి, తలుపులూ, కిటికీలూ బద్దలుకొట్టుకున్నారు. ఇటువంటి చిల్లరమల్లర పనులకు పాల్పడే అల్లరి మూకలను నియంత్రించే నైతిక హక్కు ఇకపై ఈ రెండు రాష్ట్రాల పోలీసులకు ఏం మిగిలింది? ఆరంభంలోనే పరిస్థితిని చక్కబరచకపోగా, పరువంతా పోయాక ముఖ్యమంత్రులు ఇరువురూ గవర్నర్ సమక్షంలో సమస్యను పరి ష్కరించుకుందాం అని ఫోన్‌లో మాట్లాడుకున్నారు. మరునాడు ఉద యమే రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మాట్లాడుకున్న ముఖ్య మంత్రులు అన్ని వివాదాలనూ శాశ్వతంగా పరిష్కరించుకోడానికి చర్చలు జరుపుకోవాలని నిర్ణయానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆ వెంటనే రెండు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు రెండు రాష్ట్రాల పంటలకు నష్టం జరగకుండా చూస్తామని మీడియా ముందు ప్రకటించడమూ సంతోషించదగ్గ పరిణామమే. అయితే, ఇది మొదట్లోనే ఎందుకు జరగలేదు? ఇంతకీ ఈ మాటకు ఇరువురూ కట్టుబడి ఉంటారా అన్నది కూడా సందేహం. శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద జరిగిన ఘటన విషయంలో ఇరు రాష్ట్రాల పొలీస్ డెరైక్టర్స్ జనరల్ పట్ల గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, వివరణ కోరినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. నిజంగా ఈ వ్యవహారం ఇరువురు ముఖ్యమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అంద కుండానే జరిగిపోయి ఉంటే, ఇద్దరు డీజీపీలను వివరణ కోరడం కాదు, బాధ్యతా రాహిత్యం కింద పదవుల నుంచి తొలగించాల్సి ఉంటుంది కదా!
కాంగ్రెస్ తప్పిదాలు పునరావృతం కారాదు
ఇదంతా ఉదహరించడానికి కారణం రాష్ర్ట విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పడానికే. ఇక ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కేంద్రం నోరు మెదపదు. ప్రధానమంత్రి మాట్లాడరు, కేంద్ర హోంమంత్రి పెదవి విప్పరు. వెంకయ్యనాయుడు మాత్రం విభజన బిల్లులో మార్పులు తేవలసి ఉంది అని గత నాలుగైదు మాసాలుగా పాడిన పాటే పాడుతున్నారు. కేంద్రం లో కీలక స్థానంలో ఉండి వెంకయ్యనాయుడు ఈ ఎనిమిది మాసాలలో రెండు మాటలు మాత్రమే మాటిమాటికీ చెబుతున్నారు. అందులో మొదటిదే - ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కష్టం. విభజన చట్టంలో సవరణలు అవసరం అన్నది రెండో మాట. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మార్పులు రెండు రాష్ట్రాల మంచి కోసం చెయ్యదలిస్తే ఆహ్వానించవలసిందే. అయితే కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పు మళ్లీ చెయ్యకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమం త్రులతో పాటు అన్ని ప్రతిపక్షాలను ఒకచోట కూర్చోపెట్టి సావధానంగా వారి వారి వాదనలు కూడా విని పారదర్శకంగా వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌లో తన మిత్రపక్షమే అధికారంలో ఉంది. బీజేపీ తానూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి సమస్య లేదు.
ఎన్‌డీఏ దిశగా టీఆర్‌ఎస్?
ఇక మిగిలింది తెలంగాణ రాష్ర్టం. అక్కడి ప్రభుత్వాన్నీ తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో మోదీ - షా ద్వయం పడిందని జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఆ మేరకు తెలంగాణ లోని అధికార పార్టీ టీఆర్‌ఎస్, భార తీయ జనతా పార్టీల నాయకుల స్వరాలలో మార్పు కూడా ప్రస్ఫుటమ వుతున్నది. వచ్చే ఏప్రిల్‌లో కేంద్ర మంత్రివర్గంలో జరిగే మార్పులలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు స్థానం దక్కబోతున్నదనీ, ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ సభ్యులు చేరబోతున్నారనీ వార్తలొస్తున్నాయి. పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టే. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత , టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె .కేశవరావు కేంద్రంలో చేరితే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ రాష్ర్ట ప్రభుత్వంలో చేరవచ్చు. సమస్యలు పరిష్కరించడం సాధ్యం కానప్పుడు ఇది మంచి ఉపాయం కదా! రెండు తెలుగు రాష్ట్రాలలో మిత్రపక్షాలే కొలువై వుంటే ఇంకేం కావాలి! ఇదే జరిగితే త్వరలో మనం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తన పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి వలెనే కేంద్రం కష్టాలలో ఉంది, మనం ఒత్తిడి చేయవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అని సహచరులను కూర్చో బెట్టుకుని బోధలు చేయడం చూడవచ్చు!
datelinehyderabadgmail.com