బలిపీఠం ఎక్కేది గవర్నరేనా?
డేట్‌లైన్ హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను మార్చబోతున్నట్టు ఒక ఆంగ్ల దినపత్రికలో రెండు రోజుల క్రితం వార్తా కథనం వెలువడింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరువాత ఆయనకు స్థానచలనం లేదా ఉద్వాసన జరుగుతుం దని ఆ కథనం సారాంశం. ఒక తెలుగు దినపత్రిక గవర్నర్ నరసింహన్ మీద కత్తికట్టినట్టు కొంతకాలంగా ఆయన ఉద్వాసన గురించి రాస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నరసింహన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ బాధ్యతల నుంచి తప్పిస్తారనే అనిపిస్తున్నది. కొద్దిరోజు లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ అంచనాకు ఊతం ఇస్తున్నాయి.
భిన్నమైన నియామకం
2008లో ఛత్తీస్‌గడ్ గవర్నర్‌గా నరసింహన్ నియమితులయ్యారు. తరువాత 2010లో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన నరసింహన్‌కు రెండవ దఫా కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంకా దాదాపు రెండేళ్లు ఆయన పదవిలో ఉండవచ్చు. మామూలుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక పాత ప్రభుత్వం నియమించిన గవర్నర్‌లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం సంప్ర దాయం. వారు తప్పుకోకపోతే కేంద్రం ఉద్వాసన పలకడమూ మామూలే.
ఏడాది క్రితం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఒకటి రెండు రాష్ట్రాల గవర్నర్‌లకు అలా ఉద్వాసన చెప్పవలసి వచ్చింది కూడా. అయినా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవ ర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాత్రం పదవులలో కొనసాగారు. ఈ లెక్కలో ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉండవచ్చు. కానీ ఈ ఇద్దరు గవర్నర్‌ల ఉదాహరణే తీసుకోడం ఎందుకంటే ఆ రెండూ పూర్తి భిన్నమైన నియామకాలు. రోశయ్య నిలువెత్తు రాజకీయజీవి. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ సేవలో గడిచింది. కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి దాకా అన్ని పదవులూ ఆయన ఆ పార్టీ ద్వారా సాధించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినందునే ఆయ నకు యూపీఏ ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది.
ఎన్డీయే అధికారంలోకి రాగానే నిజానికి తొలగాల్సిన తొలి గవర్నర్ రోశయ్యే. కానీ ఎన్డీయే కొనసా గించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయననే కొనసాగించా లని కోరుకున్నారు కాబట్టే ఇది సాధ్యమైందని వార్తలు వచ్చాయి. గవ ర్నర్‌గా నరసింహన్ నియామకం పూర్తి భిన్నమైనది. ఆయన టాప్ కాప్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. నిఘా విభాగం ైడెరైక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. గవర్నర్ పదవులు రాజ కీయ పునరావాస కేంద్రాలన్న విమర్శ ఉన్నా, అక్కడో ఇక్కడో నరసింహన్ లాంటి వారు కూడా నియమితులవుతూంటారు. కాబట్టి నరసింహన్ గురించి బీజేపీ రాజకీయంగా ఆలోచించి ఉండకపోవచ్చు.
వివాదాల గవర్నర్లు
గవర్నర్‌లు కేంద్ర ప్రతినిధులు. కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైనవారినే గవర్నర్‌లుగా నియమించుకోవడం సహజం. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్‌ల కార ణంగా ఘర్షణలు జరగడం అనేక సందర్భాలలో చూశాం. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన గవర్నర్ రామ్‌లాల్, అదే ఎన్టీఆర్ హయాంలోనే గవర్నర్‌గా పనిచేసిన కుముద్‌బెన్ జోషి ఇద్దరూ వివాదాస్పదులుగా పేర్గాంచారు.
వీరు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంబంధా లకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించారన్న అపఖ్యాతి ఉంది. ఆ రెండు సందర్భాలలోనూ కేంద్రంలో కాంగ్రెస్, రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీల ప్రభు త్వాలు ఉన్నాయి. రెండవసారి ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సందర్భంలో చంద్ర బాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదును సోష లిస్ట్‌గా పేరుపొందిన కృష్ణకాంత్ భరించవలసి వచ్చింది.
మార్పు ఈ దశలోనా?
మళ్లీ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విషయానికి వస్తే, ముం దే పేర్కొన్నట్టు ఆయన రాజకీయ నాయకుడు కాదు. గవర్నర్ బాధ్యతలూ, పరిమితులూ బాగా తెలిసినవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత, సంక్లిష్ట పరిస్థితులలో ఆయనను యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా ఉమ్మడి రాష్ట్రానికి పంపింది. అప్పుడు కేం ద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నిజానికి ఒక యుద్ధ సమయంలో ఆ నియామకం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మహోధృతమైన సమయంలో గవర్నర్ బాధ్యతలు నిర్వహించడం మామూ లు విషయం కాదు. చాలామంది ఇతర గవర్నర్‌ల మాదిరిగా కాక నరసిం హన్ చాలా చురుకైన వ్యక్తి. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ గట్టిగా నిర్ణ యించుకుని, విధివిధానాలను మొదలుపెట్టిన కాలంలో సీమాంధ్రలో మొద లైన సమైక్య ఉద్యమకాలంలోనూ ఆయన తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వ హించారు. కాబట్టే విభజన తరువాత రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా ఆయననే కొనసాగించారు.
ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచీ అభ్యంతరం వ్యక్తం కాలేదు కూడా. విభజనకు ముందూ, తరువాతా ఆయన కేంద్రానికి క్రమంతప్పకుండా నివేదికలు ఇస్త్తూనే ఉన్నారు. కేంద్రం కూడా సంతృప్తిగానే ఉంది. మరి మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా ఇప్పుడు గవర్నర్‌ను మార్చాలని కేంద్రం ఎందుకు ఆలోచిస్తున్నది? నరసింహన్ వారసునిగా ఒక రాజకీయ నాయకుడిని పంపాలని కేంద్రం యోచిస్తు న్నట్టుగా కూడా ఆ ఆంగ్లపత్రిక వెల్లడించింది. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. ఈ తరుణంలో సమస్య మూలాలు తెలిసిన గవర్నర్‌కు స్థానచలనం కల్పించి, ఏ అవగాహనా లేని ఒక రాజకీయ జీవిని తెచ్చి పెడితే పరిస్థితి మరింత జటిలం అవుతుంది.
నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకు?
ఇంతకూ కేంద్రానికి ఈ ఆలోచన ఎందుకు వచ్చినట్టు? ఎన్డీఏ భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుపట్టినందునే, సంకీర్ణ ధర్మాన్ని పాటించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. రాష్ర్ట విభజన సమయంలో నరసింహన్‌ను కొనసాగించినప్పుడు లేని అభ్యం తరం చంద్రబాబుకు ఇప్పుడెందుకు? కారణం అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు ఓటుకు కోట్లు వ్యవహారంలో పట్టుబ డడం, దానిని సెక్షన్ 8తో ముడి పెట్టజూసినా అందుకు సహకరించనందుకే గవర్నర్ మీద కినుక వహించి చంద్రబాబు ఆయనను తప్పించాలని పట్టు పట్టి ఉండవచ్చు.
తెలుగుదేశం ప్రముఖులు, మంత్రులు కూడా గవర్నర్‌ను అవమానించే విధంగా విమర్శిస్తే చంద్రబాబు నోరు విప్పనప్పుడే గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్టు అర్థమైంది. సెక్షన్ 8ని ప్రయోగించవలసిన పరిస్థితి హైదరాబాద్‌లో లేనప్పుడు గవర్నర్ మాత్రం ఏం చేస్తారు? హైదరా బాద్ లో ఒక్క తెలంగాణేతరుడి నుంచైనా ఫిర్యాదు వచ్చిందా? తప్పు చేస్తూ దొరికిన తెలుగుదేశం నాయకుల మీద కేసులుపెట్టడం, ఏసీబీ విచారణ జరపడం వంటివాటిని సెక్షన్ 8 ఉల్లంఘనగా గవర్నర్ పరిగణించనందుకే ఆయన బదిలీ కోరడం, కేంద్రం ఆ ఆలోచనను ప్రోత్సహించడం రాజకీ యంగా కూడా ఎంత తెలివిలేనితనం!
గవర్నర్ పక్షపాతం చూపగలరా?
తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ అనుకూలంగా ఉన్నారనే విమర్శను కూడా తెలుగుదేశం వారు విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. అట్లా అనుకునే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తరచూ గవర్నర్‌ను కలుస్తున్నారు. తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలలో ఆయనను ఎక్కువగా భాగస్వామిని చేస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు కొంచెం వెనుకబడ్డారు.
గవర్నర్ తెలంగాణ పక్షపాతిగా చెబుతున్నప్పటికీ ఆయన కొత్త రాష్ట్రానికి అదనంగా చేసేదేముంది? ఏదైనా పునర్విభజన చట్టానికి లోబడి చేయవలసిందే. కానీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన దరి మిలా తన మీద వచ్చిన విమర్శకు గవర్నర్ జవాబు చెప్పుకోక తప్పదు. తెలు గుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, శాసన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకుం డానే మంత్రివర్గంలో చేరడానికి వస్తే ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ పరిస్థితులలో గవర్నర్ మార్పు అంటే ఎన్డీయే మరిన్ని తలనొప్పులను కొనితెచ్చుకున్నట్టే.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com