దేవులపల్లి అమర్
డేట్‌లైన్ హైదరాబాద్
మొదటి నుండీ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి తీరు కొంత అభ్యంతరకరమే. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ఆయనను అవమానించడం మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఎట్లా సాధ్యం? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని రాజయ్యను ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుండి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనలేకపోయిన తీరును జోడించి రాజయ్యకు ఉద్వాసన పలికారు.
రాష్ర్ట గవర్నర్‌లు శాసనసభల్లో ప్రసంగించినా, రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనంలో మాట్లాడినా ‘నా ప్రభుత్వం’ అంటూ తమ ఉపన్యాసాలు మొదలు పెడతారు. మన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు మాత్రం ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ మాట్లాడే అవ కాశం లభించింది. జనవరి 26 ఉదయం ఆయన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొని, వెంటనే హైదరాబాద్ చేరుకొని అక్కడా తెలంగాణ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఆయనకు ఆ అరుదయిన అవకాశం లభించింది. శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగాలను రాష్ర్ట ప్రభుత్వమే తయారుచేసి మంత్రివర్గం ఆమోదం తీసుకుని మరీ ఖరారు చేస్తుంది. గవర్నర్ అదే ప్రసంగాన్ని శాసనసభలో చదువుతారు. రిపబ్లిక్ దినోత్సవం నాటి గవర్నర్ ప్రసంగాన్ని అట్లా ప్రభుత్వమే తయారు చేయక పోయినా, అది పంపిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాల ఆధారం గానే రాజభవన్‌లో రిపబ్లిక్ డే ప్రసంగం తయారవుతుంది. సాధారణంగా అది కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించేదిగానే ఉంటుంది.
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ తన ప్రభుత్వం అవినీతి రహిత బంగారు తెలంగాణను అందిస్తుందని చెప్పారు. అవినీతి అంశంపైనే ఉప ముఖ్య మంత్రి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన మరునాడే గవర్నర్ రాజకీయ అవినీతి నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని చెప్పడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ అది తెలంగాణ సమాజంలోకి కొన్ని సంకేతాలు వెళ్లడానికి దోహదపడిందనే చెప్పాలి. రాజకీయ అవినీతిని కచ్చితంగా పట్టిపల్లార్చవలసిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. పూర్తి అవినీతి రహిత పాలన నెలకొన్నప్పుడే దాన్ని సమర్థవంతమైన పాలనగా గుర్తించాల్సి ఉంటుంది.
సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వరా?
రాజకీయ అవినీతి రాజయ్యతోనే ఆరంభం అయిందా? ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడంతోనే అంతమైపోబోతున్నదా? దేశంలో, రాష్ర్టం లో ఎంతో కాలంగా రాజకీయ అవినీతివేళ్లూనుకుని ఉన్నది కాబట్టి రాజయ్య వంటి నాయకులు అవినీతికి పాల్పడితే క్షమించెయ్యాలని ఎవరూ అనరు. కాకపోతే ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుండానే, కనీసం వాటికి సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఒక ఉపముఖ్యమంత్రిని హఠాత్తుగా బర్తరఫ్ చేశారు. కాబట్టే ఈ ప్రశ్నలు అడగవలసి వస్తున్నది.
మంత్రివర్గంలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని తొలగించాలి అన్న విష యంలో ముఖ్యమంత్రికి ఉన్న పూర్తి అధికారాన్ని ఎవరూ ప్రశ్నించడానికి లేదు. అయితే మంత్రివర్గంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఉన్నవాళ్లే. కాబట్టి వారిపై తీసుకునే చర్యల గురించి చర్చించే హక్కు ప్రజలకు ఉంటుంది. రాజయ్యను తొలగించడం నిర్దాక్షిణ్యమని ఎందుకు అనాల్సివ స్తోందంటే మంత్రి వాదన వినడానికి సమయం కూడా ఇవ్వకుండా ముఖ్య మంత్రి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధిని, ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, వారి తరఫున అడిగే హక్కు ప్రతిపక్షాల వారికీ ఉంది.
అలా అని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లాగా ప్రతిపక్షాల వారు తలాతోకా లేని విమర్శలు చెయ్య కూడదు. 1999లో చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణల కారణంగానే కే చంద్రశేఖరరావును మంత్రి పదవి నుంచి తొలగించారనడం దయాకర్‌రావు రాజకీయ అనుభవానికి తగ్గ మాట కాదు. ఒక వేళ కేసీఆర్ నాడు ఆ కారణం గానే మంత్రి పదవిని కోల్పోయి ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ఎవరు అవినీతికి పాల్పడినా చూస్తూ ఊరుకోవాలని ఆయన చెప్పదల్చుకున్నారా? అదలా ఉంచితే, దయాకర్‌రావు మాటలు నిజమైతే అదే అవినీతిపరుడిని చంద్రబాబు తన ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్‌గా ఎలా ఉంచుకున్నారు? 1999లో జరిగిందేమిటో అందరికీ తెలుసు. కేసీఆర్ సామా జిక వర్గానికే చెందిన ఐపీఎస్ అధికారి, ిసీబీఐ మాజీ ైడెరైక్టర్ విజయ రామారావును మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగు తుందనేది నాటి చంద్రబాబు ఆలోచన. క్లిష్ట సమయంలో తన వెంట ఉన్న నాయకులను కాదని చంద్రబాబు ఆ రోజుల్లో తటస్థులను తెచ్చి అందలం ఎక్కించారన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు వ్యవహార శైలి దయాకర్‌రావుకు తెలియదనుకోవాలా?
రాజయ్య రాజకీయ భవిత ప్రశ్నార్థకమే
ఇంతకూ రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్యకు పిల్లల ైవైద్యుడిగా మంచి పేరు ఉండేది. రాజయ్య స్థానంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిని ఓడించి గెలుపొందారు. తరువాత టీఆర్‌ఎస్‌లో చేరి పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో కూడా శ్రీహరిపై గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన 2014లో మూడోసారి గెలుపొందారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడం కాదుగదా, కనీసం ఆయన వాదనైనా వినకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి, నిన్నటి దాకా ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడినే ఆ స్థానంలో నియమించడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ్ధకంగా మారడం నిజం కాదా? అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన రాజయ్యకు 2019లో తెలంగాణ రాష్ర్ట సమితి అసెంబ్లీ టికెట్ ఇస్తుందా? లేక అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన శ్రీహరికి టికెట్ ఇస్తుందా? ఇదేమీ లక్ష కోట్ల డాలర్ల ప్రశ్న కాదు.
రాజీనామాలు, ఉప ఎన్నికలు అచ్చి వచ్చాయా?
కడియం శ్రీహరి పరిపాలన అనుభవం ఉన్న నాయకుడే. ఆయన, ముఖ్య మంత్రి కేసీఆర్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా కలసి పనిచేసిన వారే. విద్య, భారీ నీటి పారుదల వంటి శాఖలను నిర్వహించిన అనుభవం శ్రీహరికి ఉంది. పైగా డాక్టర్ రాజయ్య సామాజిక వర్గానికే చెందిన దళిత నాయకుడు కూడా. కాబట్టి శ్రీహరిని తన మంత్రివర్గంలో ప్రధాన స్థానంలో చేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని ఆక్షేపించవల సిన అవసరం లేదు . కాకపోతే ఇప్పుడు శ్రీహరికి శాసన మండలి సభ్యునిగా స్థానం కల్పించాలి. ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో బాటు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా మండలి సభ్యులుగానే మంత్రి వర్గంలో ఉన్నారు. తెలుగుదేశం నుండి తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవిలో కూర్చోపెట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పటికే శాసనమండలి సభ్య త్వం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు శ్రీహరి కూడా ఆ వరుసలో నిలబడాలి. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంటు స్థానానికి అనవసరపు ఖర్చుతో కూడుకున్న ఉప ఎన్నిక ఇప్పుడు అవసరమా?
రాజీనామాలు, ఉప ఎన్నికలు మాకు కొత్తేమీ కావు, పైగా అచ్చివొచ్చా యని టీఆర్‌ఎస్ నేతలు వాదించవచ్చు. కానీ వీటన్నిటికీ కారణమయిన డాక్టర్ రాజయ్య ఉద్వాసన తీరు మాత్రం సమర్థనీయంగా లేదు. ఆయన వాదనా వినలేదు. ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టి తప్పు చేశాడని నిర్ధారించనూ లేదు. మొదటి నుండీ డాక్టర్ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కొంత అభ్యంతరకరంగానే కొనసాగింది. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ముఖ్యమంత్రి రాజయ్యను అవమానిం చిన సంఘటన మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎట్లా సాధ్యం? అది అయ్యే పనేనా? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని డాక్టర్ రాజయ్యను ఆయన ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను సకాలంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన తీరును జోడించి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పదవిని ఊడగొట్టారు. ఈ ఉద్వాసనతో ముఖ్యమంత్రి అవినీతిని సహించని చండశాసనుడని కొద్ది రోజులు చెప్పుకోవచ్చు. కానీ బీరువాలో ఇంకెన్ని కంకాళాలు ఉన్నాయో! అవి బయటపడిన నాడు కింకర్తవ్యమ్. ఈ లోగా ఒక నాయకుడి రాజకీయ భవితవ్యాన్ని అగాధంలోకి నెట్టినట్టే కదా!
datelinehyderabad@gmail.com