గతం మిథ్య.. విపక్షం మిథ్య | Importance of Opposition | Sakshi
Sakshi News home page

గతం మిథ్య.. విపక్షం మిథ్య

Published Wed, Jan 7 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

దేవులపల్లి అమర్

దేవులపల్లి అమర్

 డేట్‌లైన్ హైదరాబాద్
 అవసరాన్ని బట్టి,  పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యానికీ ఉన్న అర్ధాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.  294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని, ఆయన మామగారు ఎన్.టి. రామారావు అసెంబ్లీలోకి అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు  చేసుకుంటే బాగుంటుంది.

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్స రంలో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకైపైన ప్రతి శనివారం తమ పార్టీ శాసనసభ్యులను కలుసుకోవడానికే రోజంతా కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గత శనివారం ఆయన ఓ 30 మంది శాసనసభ్యులతో విడివిడిగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై వారి సమస్యలు విన్నారు. పనిలో పనిగా కొంత మంది నాయకులతో కలసి మేధోమథనం కూడా చేశారు. ఈ మేధోమథనానికి ప్రాతిపదిక ఆరునెలల తన ప్రభుత్వ పనితీరు మీద చేయిం చిన సర్వేలో వెల్లడైన ఫలితాలు. ఇందులో విశేషం ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన పనితీరు మీద ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇటువంటి సర్వేలు చేయించుకోవడం సహజం. అధికార పార్టీకి ఇది మరీ అవసరం. ఈ కార్యక్రమం అంతటినీ పత్రికలు నివేదించాయి.

 ఒకటి రెండు పత్రికలు ఈ సమావేశాల గురించి రిపోర్ట్ చేసిన తీరు, రాసిన వివరాలు చూసిన వారెవరయినా ప్రజాస్వామ్యం ఇట్లా ఉంటుందా లేక తెలుగు దేశం అధినేత, ఆయనను, ఆయన పార్టీని సమర్ధిస్తున్న మీడియా పెద్దలు ప్రజా స్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారా అని ఆశ్చర్యపోక మానరు.

 ఏపీలో ప్రతిపక్షం లేదట...
 ఇంతకూ ఆ పత్రిక ఏం రాసిందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదు, అట్లా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, స్వీయ సమీక్షలు చేసుకుందాం అని ముఖ్య మంత్రి తన పార్టీ నాయకులకు హితబోధ చేసినట్టుగా ఆ పత్రిక రాసింది. పైగా నేనట్లా అనలేదు అని ముఖ్యమంత్రి ఖండించలేదు కాబట్టి ఆయన అదే మాట అని ఉంటారన్నది ఖాయం.

 దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి అందులో ఎనిమిది సంవత్స రాలకు పైబడిన పరిపాలనానుభవం కలిగి, ఢిల్లీ పీఠం మీద ప్రధానమంత్రు లను ప్రతిష్టించి మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం అంటే ఏమిటో ఎవరూ చెప్పనక్కరలేదనుకుంటా. కానీ ఆయన అట్లానే మాట్లాడుతున్నారు. 67 మంది శాసనసభ్యులు, 8 మంది పార్ల మెంట్ సభ్యులతో ఏకైక బలమైన ప్రతిపక్షం శాసనసభలో తన కళ్లెదుట కనిపి స్తున్నా కూడా చంద్రబాబు నాయుడూ, ఆయనను గుడ్డిగా సమర్ధించడమే ధ్యేయంగా పెట్టుకున్న మీడియాలోని ఒక వర్గం కళ్లు మూసుకుని ఇదే నిజం, ఇక్కడ ప్రతిపక్షం లేదు అని పదే పదే జపం చేస్తే ప్రతిపక్షం లేకుండా పోతుం దా? తమను తాము నమ్మించుకునే ప్రయత్నంలో ఆత్మవంచన చేసుకోగలరేమో కాని ప్రజలను నమ్మించలేరు కదా! నిజానికి ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్న అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుకే బాగా తెలిసి ఉండాలి ప్రతి పక్షం అంటే ఏమిటో? ఆ పక్షం బాధ్యత ఏమిటో? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఏమిటో?

 గతాన్ని మరచిపోయారా?
 1989 నుంచి 1994 వరకు, ఆ తరువాత 2004 నుంచి 2014 వరకూ అంటే పది హేను సంవత్సరాల పాటు శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చున్న అనుభవా లను ఆయన, ఆయనను ఈ విషయంలో సమర్ధిస్తున్నవారు ఒక్కసారి నెమ రేసుకుంటే బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనుభవం ఎంత? ఎన్ని సీట్లు గెలిచింది? చట్టసభలో దాని బలమెంత? అన్న విషయాలు పక్కన పెడితే, అసలు ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ఆయన సమర్ధకుల నిఘంటువులో ఏం రాసి ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, అభిమానించే, దానినే జీవన విధానంగా ఎంచు కుని బతుకుతున్న వారిలో కలగడం సహజం.

 అవసరాన్ని బట్టి అర్థాలు మారతాయా?
 అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యా నికీ ఉన్న అర్థాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని ఆయన మామగారు ఎన్.టి.రామారావు అసెంబ్లీలోకి అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. చాలా ఏళ్లు గడిచాయి కాబట్టి అది ఆయనకు గుర్తుండక పోవచ్చు. తాజాగా ఏడుమాసాల క్రితం వరకు కూడా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నిసార్లు ప్రతిపక్షం ప్రాధాన్యం గురించి, ప్రజాస్వామ్యంలో దాని అవసరాన్ని గురించి ఉపన్యాసాలు ఇచ్చారో అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది.

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయనను సమర్ధించే వారు ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థల పెద్దలు సమయానుకూలంగా నిర్వచనాలు మార్చేస్తూ ఉంటారనడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 1980, 1990 దశ కాలలో జరిగిన రెండు ఆగస్టు సంక్షోభాలు, రెండు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాలు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. 1984లో ఎన్.టి. రామారావు మీద తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కరరావు వీరి దృష్టిలో ప్రజాస్వామ్య హంతకుడు అవుతారు, అదే ఎన్.టి. రామారావును 1995 ఆగస్టులో పదవీచ్యు తుడిని చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడు అవుతారు. ఇట్లా అవసరాన్ని బట్టి అర్థాలు, నిర్వచనాలు మారిపోతుంటాయి. ఇప్పుడు రాష్ర్టంలో ప్రతిపక్షం లేదన్నది కూడా అట్లాంటి అవసరం కోసమే వారు మాట్లాడుకుంటున్నారని వేరే చెప్పనక్కర లేదు.

 విపక్షనేతకు మాత్రం స్వేచ్ఛ లేదు
 రాష్ర్టంలో ప్రతిపక్షం లేదు అన్నమాటకు కొనసాగింపుగా ఆయన ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. రాష్ర్టంలో ప్రతిపక్షం లేదనీ, కాంగ్రెస్‌కు ఉనికి లేదనీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఉండదని ఆయన వ్యాఖ్యా నించడంతోపాటు, అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండడం తగదని చంద్రబాబు హితవు పలికారు. సోమ వారం ప్రభు త్వం రాజధాని నిర్మిస్తానం టున్న గ్రామాల రైతులు ప్రతి పక్ష నాయకుడు జగన్‌మో హన్ రెడ్డిని కలుసుకుని వారి గోడు వినిపించినప్పుడు ఆయన ఈ ప్రభుత్వం రెండు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని వ్యాఖ్యానించినం దుకు ఒక్క గంట కూడా గడ వకుండా రాద్ధాంతం మొద లు పెట్టిన తెలుగుదేశం పెద్దలు, వారిని సమర్ధిస్తున్న మీడియా మిత్రులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఉండదు అని చంద్రబాబు దిశానిర్దేశం చేసినప్పుడు అదెట్లా అని అడగలేదు ఎందుకని? ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్య తప్పయిన ప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఒప్పు ఎట్లా అయింది? అంకెల ప్రకారమే మాట్లాడుకున్నా అధికార తెలుగుదేశం పార్టీకీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకీ మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఓట్ల తేడా 5 లక్షలు. అంటే రెండు శాతం మించలేదు. మరి ప్రతిపక్షం లేకుండాపోయింది ఎట్లాగో తెలుగుదేశం రాజకీయ పండితులు చెప్పాలి.

 ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా!
 ప్రతిపక్షాన్ని లెక్కచెయ్యక పోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడ మన్న విషయం మన అధికార రాజకీయ నాయకులకూ, వారి పక్షం వహిస్తున్న పెద్దలకూ ఎన్నటికి అర్థం అవుతుందో? ఒక్క సీటు కూడా అసెంబ్లీలో గెలవ లేదు కాబట్టి కాంగ్రెస్‌కు ఉనికి లేదంటారు ముఖ్యమంత్రి. వామపక్షాల ఊసు లేనే లేదు. ఎన్నికల అవసరానికి వామపక్షాలతో స్నేహం చేసిననాడు వాటికి ప్రజలలో ఉండే ఆదరణ, ప్రజా సమస్యల మీద వారు చేసిన పోరాటాలు తమ అవసరానికి కావాలి, చట్ట సభలలో సీట్లు రాకపోతే మాత్రం ఆ పక్షాలు అస్తిత్వం లో లేనట్టే లెక్క. సీట్ల సంఖ్య మీద ఆధార పడి ప్రతిపక్ష పాత్ర ఉండదని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే స్పృహ, దీక్ష మీద ఆధారపడి ఉంటుందని ఆయనకు అర్థం కాదు. 1999లో మొదటిసారి ఎన్నికలలో వాజపేయి, కార్గిల్ ఇమేజ్‌తో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక శాసనసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి ఒక్క స్థానం కూడా లేదని ప్రజా సమస్యల మీద అఖిలపక్షానికి పిలవని నాయ కుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

 రాష్ర్ట విభజన జరిగి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడు మాసాలలో జరిగిన ఆ రాష్ర్ట శాసనసభ సమావేశమయిన మూడు పర్యాయాలు ప్రతిపక్షాన్ని గౌరవించే, అసలు దాని ఉనికిని భరించే స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదని తేటతెల్లమయింది. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న వ్యవహారం దాన్ని మరింత బలపరుస్తున్నది.
 ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పట్టించుకోను అంటే ప్రజలే ప్రతిపక్ష మయ్యే పరిణామం చోటు చేసుకుంటుందని ఏలినవారు ఎవరయినా గుర్తిం చడం బాగుంటుంది.
 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 98480 48536)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement