ఒకటే పాట... ‘చంద్రుల’ నోట | Will Kcr Chandrababu Fulfill Election Promises | Sakshi
Sakshi News home page

ఒకటే పాట... ‘చంద్రుల’ నోట

Published Wed, Jan 14 2015 12:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Will Kcr Chandrababu Fulfill Election Promises

డేట్‌లైన్ హైదరాబాద్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హయాంలో ‘వారుణి వాహిని’ పేరిట ప్రభుత్వ సారాయిని ఆకర్షణీయమైన సీసాలలో అందించడం తెలిసిందే. అప్పుడు సైతం పల్లెల్లో, హైదరాబాద్ పాతబస్తీలో గుడుంబా పారలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూతపడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరాలున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పనిచేయించి, గుడుంబాను నిర్మూలించాల్సింది పోయి... చట్టబద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని సీఎం కేసీఆర్ భావించడం దురదృష్టం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు రెండూ ఈ ఏడు మాసాల కాలంలో ప్రకటించిన కార్యక్రమాలు ఎటువంటివి? అవి అభివృద్ధి కార్యక్రమాలా? సంక్షేమ పథకాలా? అవన్నీ అమలు చెయ్యడానికి ఎంత కాలం పడుతుంది? ఎంత పెద్ద ఎత్తున నిధులు కావాలి? అనే చర్చ ఇప్పుడు అక్కడా, ఇక్కడా జోరందుకున్నది. అక్కడా ఇక్కడా ప్రతిపక్షాలు మాట్లాడు తూనే ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే స్థితిలో లేవు. అధికారంలోకి వచ్చిన ఊపులో వాళ్లు చేస్తున్న వాగ్దానాల అమలుకు లక్షల కోట్ల రూపాయల నిధుల అవసరం వారికి గుర్తుకు రావడం లేదు.

తెలంగాణ రాష్ర్ట ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ ప్రతిపక్షాలను పట్టించుకునే స్థితిలో లేదు. ప్రజా తీర్పు ఆ పార్టీని నేల మీద నిలవనీయడం లేదు. దూకుడుగా ముందుకుపోతూ, ప్రతిపక్షాల దుకాణాలు ఖాళీచేసే పనిలో పడింది. ఇక మిగిలిన అరకొర నాయకుల మాట ఏం వింటుంది?

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నమయింది. అక్కడ ఉన్న ఏకైక ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చెయ్యాలనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నా, సాధ్యపడక రాష్ర్టంలో ప్రతిపక్షమే లేదని కళ్ళు మూసుకుని, తనను తాను నమ్మించుకునే ప్రయ త్నంలో పడింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఎవరి మాటా వినే స్థితిలోలేవు. ఎన్ని లక్షల కోట్ల విలువ చేసే వాగ్దానాలు చేస్తేనేం? వాటి అమలు కోసం అడిగే వాళ్లేరి? అన్న ధీమాతో ఉన్నాయి.

ప్రభుత్వ సారా మూడు విధాల మేలు
సుదీర్ఘ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం విషయమే చూద్దాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అధినేత చంద్రశేఖర్‌రావు కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రకటించిన పథకాలకు రెండు లక్షల కోట్ల రూపా యలు అవసరమని అంచనా. నిజంగానే వాటిని అమలు చేయడం మొదల యితే ఈ మొత్తం ఇంకా పెరగవచ్చు.

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు కాగా, అందులో ప్రణాళికా వ్యయం 48 వేల కోట్లు. వచ్చే నాలు గేళ్ల ప్రణాళికా నిధులన్నింటినీ హైదరాబాద్‌కే కేటాయించినా ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకే సరిపోవు. ఇక జిల్లాలను ఏం పెట్టి అభివృద్ధి చేస్తారన్న ప్రతిపక్షాల విమర్శను వినే స్థితిలో తెలంగాణ  ప్రభుత్వం లేదు.  నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటనలు చెపుతున్నాయి. అలా యోచించాల్సిందే. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. కానీ అలా ఆలోచించేటప్పుడు ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతలను మరిచిపోకూడదని ఏలిన వారికి ఎవరు గుర్తు చెయ్యాలి? సారాయిని మళ్ళీ ప్రవేశ పెట్టాలనీ, మద్యం ఉత్పత్తికి సొంత డిస్టిలరీలను ఏర్పాటు చేసుకోవాలనీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

రాష్ర్టంలో అమ్ముడయ్యే చాలా బ్రాండ్ల మద్యాన్ని బయటి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోడంవల్ల రాష్ట్రానికి ఆ పన్నులు రాకుండా పోతున్నాయని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సొంత డిస్టిలరీల  వల్ల ఆ మేరకు ఆదాయం పెరుగుదలతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, మద్యం ధర కొంత తగ్గి వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందని ఆయన మూడు లాభాలు చూపించారట.

సింగపూర్, డాలస్‌లకు రహదారి
సంపూర్ణ మద్య నిషేధం ఏ ప్రభుత్వం తరమూ కాదని, మన దేశంలోనే కాక, అమెరికా వంటి దేశాల్లో కూడా గతంలో తేలిపోయింది. అయితే, వీలైనంత మేరకు ఈ వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించడం పాలకుల బాధ్యత. అది మరిచి, మనుషుల బలహీనత మీద జరిగే ఈ వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన తెలంగాణ ప్రభుత్వా నికి రావడం విచారకరం. సీఎం కేసీఆర్ మొన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సర్కారీ సారాయి మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచన బయట పెట్టారు. అక్రమ సారాయి అంటే గుడుంబాను అరికట్టడం కోసమే ఈ ప్రతిపాదన విషయం యోచిస్తున్నామని ఆయన వివరణ.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ సారాయిని ‘వారుణి వాహిని’ పేరిట అందమైన, ఆకర్షణీయమైన సీసాలలో అందించి అమ్మకాలను పెంచడం తెలిసిందే. అప్పుడు సైతం తెలంగాణ పల్లెల్లో, హైదరాబాద్ పాత బస్తీలో, ముఖ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో గుడుంబా తయారీ జరగలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూత పడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరా లున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పని చేయించి, గుడుంబాను సమూలంగా నిర్మూలించాల్సింది పోయి...మళ్ళీ చట్ట బద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని ముఖ్యమంత్రి భావించడం దురదృష్టం.

వరంగల్ జిల్లా గరీబ్‌నగర్‌లో మహిళలు మళ్ళీ ప్రభుత్వ సారాయి తేవాలని అడిగారనో, అక్రమ సారాయి, కల్తీ సారాయి తాగి ప్రజలు ఆరో గ్యాలు పాడు చేసుకుంటున్నారనో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సారాయి వ్యాపారంలోకి దిగబోతోందనుకుంటే పొరపాటు. సారాయిని ఒక ఆదాయ మార్గంగా చూస్తున్నందువల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనడంలో సందేహమే అక్కరలేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోకి కల్లు తిరిగి ప్రవేశించింది. సీఎం కేసీఆర్ చెప్పినట్టు కొన్ని రోజుల్లో ప్రభుత్వం ఒక చర్చ జరిపి, ఒక విధానాన్ని రూపొందించి ప్రభుత్వ సారాయిని ప్రవేశ పెట్టేస్తుంది. ప్రభుత్వమే స్వయంగా మద్యం ఉత్పత్తి చేపట్టబోతున్నది కాబట్టి ఇక తెలంగాణ ప్రజలకు తాగినోళ్లకు  తాగినంత, ప్రభుత్వానికి హైదరాబాద్‌ను సింగపూర్, లండన్, డల్లాస్ నగరాల స్థాయికి చేర్చే ఆకాశ హర్మ్యాలను కట్టడానికి కావలసినంత ఆదాయం.

దారి తప్పుతున్న ప్రాధాన్యాలు   
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 సంవత్సరాల క్రితమే సంపూర్ణ మద్యనిషేధం అమలు అసాధ్యం అని రుజువువైంది. రాష్ట్రమంతా సారాయిని పారించిన ఎన్టీఆర్ 1994లో మద్యనిషేధం నినాదాన్ని ఎవరి ప్రోద్బలంతో తలకెత్తుకు న్నాడో అందరికీ తెలుసు. ఆయనను గద్దెదించిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని ఎత్తెయ్యడం వెనక కూడా అవేశక్తులు పనిచేసాయనీ తెలి సిందే. సాధ్యమైనంతవరకు మద్యపానంపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికి ప్రయత్నించడం లేదా ఆ ప్రయత్నం చేస్తూనే మద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. ఆదాయాలు పెంచుకుని ఆకాశహర్మ్యాలు నిర్మించాలి కాబట్టి  మద్యం ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం అన్యాయం. ప్రజలకు ఏం కావాలి? మనం ప్రజలకు ఏం ఇవ్వాలి? అనే విషయాలను గురించి ప్రభుత్వాలు జాగ్ర త్తగా ఆలోచించాలి. అక్కడే ప్రాధాన్యతల ప్రసక్తివస్తుంది. ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదని పెద్దలంటున్నారు.

మొన్న శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావం తుల వేదిక (తెవివే) 5వ రాష్ర్ట మహాసభలు జరిగాయి. సభలను ప్రారం భిస్తూ ప్రఖ్యాత సామాజిక ఉద్యమనేత స్వామి అగ్నివేష్ ఫిలింసిటీలా, రైతుల ఆత్మహత్యలు ఆపడమా? ఏది ముఖ్యం? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదనడానికి ఆ మాటలు చాలు. తెవివే కూడా సభల ముగింపు సందర్భంగా ఫిలింసిటీలు, ఫార్మాసిటీలు వద్దని హితవు పలుకుతూ తీర్మానాలు చేసింది. తెవివే, స్వామి అగ్నివేష్‌లు తెలం గాణ రాష్ర్ట ఉద్యమంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ వెంట, దాని నాయకుడూ, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వెన్నుదన్నుగా నిలిచిన వారేనని మరువ కూడదు. ప్రతిపక్షాల మాట వినకపోతే పోయారు కనీసం అగ్నివేష్ మాటల యినా ఆలకించండి. విద్యావంతుల వేదిక వినతి అయినా వినండి.

datelinehyderabad@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement