తెలుగునాట ముందస్తు ముచ్చట
డేట్‌లైన్ హైదరాబాద్
తెలంగాణలో ప్రతిపక్షం తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాల్లో పడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం ప్రజాక్షేత్రంలో సమస్యల మీద నిత్యం నినదిస్తున్న పరిస్థితి. రెండు రాష్ట్రా ల్లోనూ ప్రశ్నించాల్సిన మీడియా, కారణాలు ఏమైనా, అయితే పాలకపక్షం వహించడం లేదా మౌనం వహించడం. ఇది దురదృష్టం. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్నాడు లెనిన్. ఇప్పుడు ఎవరి నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు.
నిర్ణీత గడువు కంటే ముందుగా వచ్చేదాన్ని ‘ముందస్తు’ అంటున్నాం. ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 2003లో. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అలిపిరి వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చి గాయపరిచిన దరిమిలా, జనంలో ఆ ఘటన తాలూకు సానుభూతి చెరిగిపోక ముందే ఎన్నికలకు వెళితే ప్రభుత్వ వ్యతిరేకత తెరమరుగై, తెలుగుదేశం మళ్లీ గెలుస్తుందని ఒకానొక జర్నలిస్ట్ మిత్రుడు తొలుత తాను పనిచేస్తున్న పత్రికలో ఒక కథనం వెలువరించారు. అప్పటి ముఖ్యమంత్రికి కూడా అది నచ్చి, తనతో బాటు కేంద్రాన్ని కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేశారు.
అయినా గడువుకు ముందే ఎన్నికలు జరగాలన్న ఆ ఆలోచన ఎన్నికల సంఘం ముందు పెద్దగా పనిచెయ్యలేదు. చంద్రబాబు, ఆయన ఆనాటి మిత్రబృందం ఆశించినట్టు అలిపిరి ఘటన రాష్ట్ర ప్రజల్లో సానుభూతి కలిగించకపోగా, అప్పటికి ఎనిమిదిన్నరేళ్ల క్రితం జరిగిన బషీర్‌బాగ్ కాల్పులు వంటి ప్రజా వ్యతిరేక చర్యలే తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడాయి. అయినా ఎన్నికలను కొన్నిమాసాలు ముందుకు జరిపితే ప్రజాభిప్రాయం మారిపోతుందా?
స్వాగతించదగిన నిర్ణయం
ఇప్పుడు మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వినిపిస్తున్నది. ఇందుకు కారణం ‘ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు’ నినాదం. ఇది నిజంగానే మంచి ఆలోచన. లోక్‌సభకు ఎన్నికలు జరిగి కేంద్రంలో ప్రభుత్వం తన సీటు మీద ఇంకా కుదురుకోక ముందే ఏవో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు రావడం, ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం, ఐదేళ్ల పుణ్యకాలం కాస్తా ఎన్నికల పోరులోనే గడిచిపోతే ఇక పాలన మీద దృష్టి ఎట్లా ఉంటుంది? ప్రజలకు ఏం మంచి చెయ్యగలరు? కాబట్టి లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆలోచనను అందరూ ఆహ్వానించవలసిందే.
అయితే ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనగానే ఎదురయ్యే సాధకబాధకాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది– ఎన్నికల నిర్వహణ యంత్రాంగం సంసిద్ధత. మొన్ననే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఒక పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా ఉండే సరికి దాదాపు ఏడు విడతల పోలింగ్ అవసరమైంది. మరి, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు అంటే సక్రమ నిర్వహణ సాధ్యమేనా? అక్రమాలను అరికట్టడానికీ, శాంతిభద్రతల పరిరక్షణకూ అవసరమైనంత మందీ మార్బలం మనకు ఉన్నాయా అన్న విషయం కేంద్రం నిశితంగా ఆలోచించుకోవాలి. అన్ని వనరులూ సమకూడి లోక్‌సభకూ, అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు జరపగలిగితే కొన్ని రాష్ట్రాలు ఐదేళ్ల కాలపరిమితి ముగియకుండానే తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న రాష్టాలు ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు అంగీకరించవచ్చు. కానీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అంత సులభంగా ఇందుకు ఒప్పుకుంటాయా? ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి సమస్య ఎదురవుతుంది. అటువంటి వారిని ఎట్లా దారిలోకి తెచ్చుకుంటారో చూడాలి. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా, ఈ మార్పుతో ఒనగూడే ఒక ప్రయోజనం మాత్రం అందరికీ సంతోషం కలిగించేదే. అది–2019 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగితే ఎండలు మండిపోతుంటాయి.
అభ్యర్థులకూ, ఎన్నికల యంత్రాంగానికీ, ముఖ్యంగా ఓటర్లకూ నరకం కనిపిస్తుంది. అనేకచోట్ల ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదొక ముఖ్య కారణం కూడా. మన బాధ్యతా రాహిత్యంతో ఏ ఏటికి ఆ యేడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. మోదీ ఆలోచిస్తున్నట్టుగా 2018 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలొస్తే అందరికీ హాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పక్షాలు పుట్టించే ప్రచార వేడిని వాతావరణంలోని శీతలం చల్లబరుస్తుంది.
తెలుగు ప్రాంతానిది ఎప్పుడూ అదే దారి
గడువు కంటే ముందుగా వచ్చే ఈ ఉమ్మడి ఎన్నికల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు సమస్య ఏమీ లేదు. 1994లో తప్ప, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989 నుంచి కూడా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలోనే జరిగాయి. లోక్‌సభకు 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగిన కారణంగా, 1994లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గడువు మేరకు విడిగా ఎన్నికలు జరిగాయి. రాష్ట్రం విడిపోయిన సంవత్సరం కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటే (2014) అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. కాబట్టి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు కలసి వచ్చినా ఇక్కడ పెద్ద తేడా ఉండదు.
అయితే ఎన్నికలు గడువు కంటే ముందే రావడం, దాని వల్ల ఎదురయ్యే లాభనష్టాలను గురించి అధికార పక్షాలు ఆలోచించడం సహజం. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం లోక్‌సభకూ, అసెంబ్లీలకూ 2018 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎన్నికలు జరగవచ్చు. అంటే గడువు కంటే కేవలం అయిదారు మాసాల ముందన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికార పక్షాల విషయం ఆలోచిస్తే ఎన్నికలు కొంచెం ముందు జరిగినంత మాత్రాన పెద్ద తేడా ఏమీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో ప్రజలకు స్పష్టత ఉంది. ఈ ఐదారు మాసాల్లో ప్రజాభిప్రాయాన్ని పెద్దగా మార్చగల స్థితి ఏమీ కనబడదు. మొన్నటి నీతి ఆయోగ్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లిన ఇద్దరు ముఖ్యమంత్రులూ ఈ మార్పునకు అంగీకరించి వచ్చినట్టే వార్తలు వెలువడినాయి.
టీఆర్‌ఎస్‌కు బీజేపీ బెడద
తెలుగు రాష్ట్రాలలోని అధికార పక్షాల పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ మొన్ననే జరి గింది. రేపు వరంగల్‌లో లక్షలాది మందిని సమీకరించి ఆవిర్భావ దినోత్సవం పేరుతో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. ప్రజలనూ, పార్టీ శ్రేణులనూ ఎన్నికలకు సన్నద్ధం చేసే బహిరంగ సభ ఇదే అవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాలకు ఎడా పెడా గుప్పిస్తున్న వరాలు కూడా గడువు కంటే ముందే రానున్న ఎన్నికలకు సంకేతాలు పంపుతున్నాయి. దక్షిణాదిన బీజేపీ కన్నేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైనదన్న విషయం కూడా టీఆర్‌ఎస్‌ను కొంచెం కలవరపాటుకు గురిచేస్తున్నట్టు కనిపిస్తున్నది.
చిరకాల పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా, ప్రతిపక్షాన్ని రాష్ట్రంలో దాదాపు నిర్వీర్యం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి తిరిగి అధికారంలోకి తామే వస్తామన్న ధీమా ఉండటం సహజం. కానీ క్షేత్రస్థాయిలో ఎన్నికల సమరంలో ముందుండి పార్టీని గెలిపించాల్సిన శ్రేణుల్లో కేంద్రీకృత అధికారం కారణంగా తీవ్ర నిరాసక్తత కనిపిస్తున్న మాట నిజం. ప్రజాభీష్టం ఎంత తమ వైపు ఉన్నా, వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాల్సిన శ్రేణులు పనిచెయ్యకపోతే ఏం జరుగుతుందో 1989లో ఎన్.టి. రామారావుకూ, ఆయన పార్టీకీ ఎదురైన అనుభవమే పెద్ద రుజువు.
ఒకచోట ఆయనే ఓడిపోయిన పరిస్థితి. ఆ ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు ఆ విషయం తెలిసే ఉంటుంది. తెలంగాణలో అధికారపక్ష ప్రజాప్రతినిధులలో కొంత నైరాశ్యం మొన్నటి కొంపల్లి ప్లీనరీలో స్పష్టంగా కని పించింది. ప్రజా ప్రతినిధులలో నైరాశ్యం, కార్యకర్తల్లో నిరాసక్తతను అధిగమించి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన ప«థకాలు ఏ మేరకు అధికార పక్షానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని స్థిరం చేస్తాయో చూడాలి.
ధనం జనాభిప్రాయాన్ని మార్చలేదు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వచ్చే నెల విశాఖపట్నంలో మహానాడును నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార పక్షం ఒక్కటి కాదు రెండు, ఆ రెండో అధికారపక్షం భారతీయ జనతా పార్టీ మొన్ననే కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గుట్టు చప్పుడు కాకుండా ఒక ఉత్సవం జరుపుకుంది. ఎంత గుట్టు చప్పుడు కాకుండా అంటే, ఆ పార్టీ ముఖ్య నాయకులే చాలామందికి సమాచారం కూడా లేనంత గుట్టుగా. ఇక భాగస్వామి అయిన తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును పిలవనేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షం వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం తప్ప విజయానికి ఇంకో మార్గమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నది.
నిధుల సేకరణకు అడ్డదారులు
అధికారంలోకి వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారుల సమావేశంలో తన మనోగతం వెల్లడించారు. అక్కడి నుంచే తెలుగుదేశం నాయకులు మీది నుంచి కింది వరకూ వచ్చే ఎన్నికలకు అవసరమైన నిధులను ఎన్ని అడ్డదారులైనా తొక్కి సంపాదించుకునే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న తీరు, ఆ మొత్తం వ్యవహారంలో అందరూ అధికార పక్షానికి సంబంధించిన వారే ఉండటమూ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఆర్థిక అక్రమాలను గురించీ, అవినీతి గురించీ కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నా పల్లెత్తు మాట అనక పోవడానికీ, వేలెత్తి చూపకపోవడానికీ మిత్రధర్మం కారణం కావచ్చు. కేవలం డబ్బే జనాభిప్రాయాన్ని మార్చబో దన్న వాస్తవం గతంలో పలుమార్లు రుజువైన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడిప్పుడే తిరిగి బలం పుంజుకునే ప్రయత్నాల్లో పడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క ప్రతిపక్షం ప్రజాక్షేత్రంలో సమస్యల మీద నిత్యం నినదిస్తున్న పరిస్థితి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రశ్నించాల్సిన మీడియా, కారణాలు ఏమైనా, అయితే పాలకపక్షం వహించడం లేదా మౌనం వహించడం. ఇది దురదృష్టం. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్నాడు లెనిన్ మహాశయుడు. ఇప్పుడు ఎవరి నినాదాల వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకోగలిగి నంత విజ్ఞులయ్యారు తెలుగు ప్రజలు.
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్