ముందస్తు మోజులో మోదీ పడతారా? | PM Narendra Modi Is Interest In Pre Elections In India | Sakshi
Sakshi News home page

ముందస్తు మోజులో మోదీ పడతారా?

Published Sat, Jun 30 2018 11:57 PM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

PM Narendra Modi Is Interest In Pre Elections In India - Sakshi

ముందస్తు మోజులో మోదీ పడతారా?

దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? జమిలి ఎన్నికలు కూడా వస్తున్నాయా? ఢిల్లీలో చడీచప్పుడూ లేదు కానీ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ప్రధాని, జేడీ (ఎస్‌) అధినేత దేవెగౌడ మాత్రం గడువు కంటే ముందే ఎన్నికలు జరగబోతున్నాయంటూ ఢిల్లీలో జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కానీ ముందస్తు ఎన్నికల గురించి ఒక్క మాట కూడా అనలేదు. జమిలి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే అభిలాషను మాత్రం ప్రధాని వెలిబుచ్చారు. ‘ఒక దేశం, ఒకే పన్ను’ విధానం లాగానే ‘ఒక దేశం ఒకే దఫా ఎన్నికలు’ అనే విధానం వల్ల ఎన్నికైన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదేళ్ళపాటు ఎన్నికల గొడవ లేకుండా పరిపాలన సాఫీగా సాగించవచ్చునని మోదీ ‘నీతి ఆయోగ్‌’ సమావేశంలో అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఇటీవల ఢిల్లీలో ప్రధానితో భేటీ జరిపిన తర్వాత ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) నాయకులనూ, కార్యకర్తలనూ తరచుగా అప్రమత్తం చేస్తున్నారు. తామూ ముందస్తు ఎన్నికలకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులను నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు రావచ్చునంటూ హెచ్చరించారు. ఆయన తనయుడు లోకేశ్‌ మాత్రం ముందస్తుకు ఒప్పుకునేది లేదంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విజయసాయిరెడ్డి కూడా ఎన్నికలు గడువు కంటే ముందే రావచ్చునంటూ పార్టీ నాయకులకూ, కార్యకర్తలకూ చెప్పారు.

జమిలి ఎన్నికలు కొత్త కాదు 
ముందుగా జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం. దేశంలో 1952 నుంచి 1967 వరకూ మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు అత్యధిక రాష్ట్రాల ఎన్నికలు జమిలిగానే నిర్వహించారు. ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీకి మాత్రం 1955లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు హోరాహోరీ పోరాడాయి. కాంగ్రెస్‌ విజయం సాధించింది. అదే విధంగా కేరళలో తొలి అసెంబ్లీ ఎన్నికలు 1957లో జరిగినప్పటికీ నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్‌ చేసి అసెంబ్లీని 1959లో రద్దు చేసింది. ఫలితంగా 1960 ఫిబ్రవరిలో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ 1969లో చీలిపోయిన తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మైనారిటీలో పడిపోయి సీపీఐ మద్దతుతో నడిచింది. సిండికేట్‌గా ముద్రపడిన సీనియర్‌ నాయకులు నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, ఎస్‌కె పాటిల్, అతుల్యఘోష్‌ తదితరులు కాంగ్రెస్‌ (ఆర్గనైజేషన్‌)లో మిగిలిపోయారు. పార్టీ చీలిన తర్వాత రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ వంటి అనేక ప్రగతిశీల నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని భావించారు.

1972లో జరగవలసిన ఎన్నికలను 1971 మార్చిలోనే నిర్వహించారు (తూర్పు పాకిస్తాన్‌ విమోచన పోరాటం 1971 మార్చిలో ఆరంభమై డిసెంబర్‌లో ముగిసింది). ఎన్నికలలో ‘గరీబీ హటావ్‌’ నినాదంతో ప్రచారం చేశారు. ఆమెను ప్రజలు విశ్వసించారు. మొత్తం 545 లోక్‌సభ స్థానాలలో ఇందిరా కాంగ్రెస్‌కు 352 రాగా, కాంగ్రెస్‌ (వో)కి కేవలం 16 స్థానాలు దక్కాయి. లోక్‌సభకు గడువుకంటే ముందుగా ఎన్నికలు నిర్వహించడంతో లోక్‌సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ అంతవరకూ ఉండిన లంకె తెగిపోయింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదంటూ 1975లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.

ప్రధాని పదవి నుంచి తాత్కాలికంగా వైదొలిగి, తన స్థానంలో మరో నాయకుడిని కూర్చోబెట్టి, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవలసిన ఇందిరాగాంధీ ఆ పని చేయకుండా అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో పెట్టారు. 1976లో గడువు ముగిసిన లోక్‌సభను మరో సంవత్సరం పొడిగించారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నిరసన ప్రకటిస్తూ జైలు నుంచే సోషలిస్టు నాయకులు మధులిమాయే, శరద్‌యాదవ్‌లు తమ రాజీనామాలు పంపించారు.

1977లో ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితిని రద్దు చేసి లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ఉత్తరాదిలో తుడిచిపెట్టుకొని పోయింది. ఇందిరాగాంధీ స్వయంగా రాయ్‌బరేలీలో రాజ్‌నారాయణ్‌ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెబుతూ మొరార్జీ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలన్నిటినీ రద్దు చేసింది. అసెంబ్లీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించారు. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసి అసెం బ్లీలను రద్దు చేసి ఎన్నికలు జరిపించారు. ఈ రకంగా జమిలి ఎన్నికలకు కాంగ్రెస్, ప్రతిపక్షాల నిర్వాకం వల్ల గండిపడింది. ఐదేళ్ళ పొడవునా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల సందడి తప్పడం లేదు. నరేంద్రమోదీ జమిలి ఎన్నికల ప్రతిపాదన చేసినప్పుడు అది ప్రజాస్వామ్యానికి హానికరమైనదంటూ తీవ్రంగా ఆక్షేపించిన కాంగ్రెస్‌ నాయకులు గతాన్ని విస్మరించారు. మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో ఉన్న సంప్రదాయాన్నే పునరుద్ధరిద్దామంటే వ్యతిరేకించడం ఎందుకో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలి. 

ముందస్తు ఎవరికి లాభం? 
ఈ నేపథ్యంలోనే లోక్‌సభకు ముందస్తు ఎన్నికల మాట కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిపాదనకు నిర్దిష్టమైన భూమిక ఉన్నది. 2017 మోదీ, అమిత్‌షాలకు దివ్యంగా ఆరంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో ఘనవిజయం సాధించారు. సంవత్సరం చివరలో గుజరాత్‌లో గెలిచినప్పటికీ ఓడినంత పని అయింది. రాజస్థాన్‌లో రెండు లోక్‌సభ స్థానాల (అజ్మీర్, అల్వార్‌)కు జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుపొందింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలలోనూ బీజేపీ ఓడిపోవడం మోదీ, షాలకు దిమ్మతిరిగే ఎదురుదెబ్బ. అనంతరం యూపీలో మూడు లోక్‌సభ స్థానాలకు (ఫుల్‌పూర్, గోరఖ్‌పూర్, ఖైరానా) ఉపఎన్నికలు జరిగితే మూడింటినీ బీజేపీ కోల్పోయింది. దీంతో మోదీ ప్రాబల్యం తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌లో జరగవలసి ఉంది. మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ పరిస్థితి గడ్డుగానే ఉంది.

మూడు రాష్ట్రాలలో పరాజయం చెందిన తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరిగితే పరాజయభారంతో మోదీ ప్రచారం సమర్థంగా చేయలేరనీ, అందుకనే ఈ మూడు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను కలిపి లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపి నవంబర్‌లోనో, డిసెంబర్‌లోనో జమిలి ఎన్నికలు జరిపిస్తారని ఊహాగానం. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్రధాని అనుకుంటే ఆయనను నిరోధించే శక్తి ఎవ్వరికీ లేదు. అది ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఇందిరాగాంధీ 1971లో ముందస్తు ఎన్నికలు నిర్వహించిన అనంతరం 2004లో బీజేపీ ప్రధాని అటల్‌బిహారీ వాజ పేయి అదే రకమైన సాహసం చేశారు. భారత్‌ వెలిగిపోతోందంటూ (ఇండియా షైనింగ్‌) కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని వాజపేయి విశ్వసించి అదే అదను అనుకొని ముందస్తుకు సిద్ధమైనారు. ఆయనను ఆ దిశగా ప్రోత్సహిం చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.

అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చిన ఘటనలో వెంట్రుకవాసిలో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న కారణంగా తనకు అనుకూలంగా సానుభూతి పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయంతో రాష్ట్ర అసెంబ్లీకి కూడా గడువుకంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అంచనాలు తప్పాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ముందస్తు ఎన్నికలకు పోవలసిన పరిస్థితి ప్రస్తుతానికి ఉన్నదా? మూడు రాష్ట్రాలలో ఓడిపోతాననే భయంతో లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరపడంలో వివేకం ఉన్నదా? జమిలి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రాలలోని స్థానిక సమస్యలు చర్చనీయాంశాలు అవుతాయి. జాతీయ అంశాలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. డిసెంబర్‌లో మూడు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎట్లా ఉన్నప్పటికీ 2019 ఏప్రిల్‌–మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి నష్టం కన్నా లాభమే ఎక్కువ.

అంత యాతన అవసరమా?
మాటవరుసకు ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ఓడిపోయిందని అనుకుందాం. డిసెంబర్‌లో ఎన్నికైన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే సమస్యలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు కర్ణాటకలో అదే తంతు. అసమ్మతి ఆరంభం అవుతుంది. తర్వాత అయిదారు నెలలకు జరిగే లోక్‌సభ ఎన్నికలలో నిర్ణాయక అంశం ఒక్కటే. దేశానికి ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగాలా, రాహుల్‌గాంధీ రావాలా? ఈ ప్రశ్నకు రాహుల్‌ రావాలనే సమాధానం రావడం కంటే మోదీ కొనసాగాలని జవాబు వచ్చే అవకాశాలే అధికం. ప్రతిపక్షాలు బీజేపీని ఓడించేందుకు ఒకే తాటిపైకి వచ్చినప్పటికీ ప్రతిపక్ష కూటమికి నాయకుడిగా రాహుల్‌గాంధీనే ప్రజలు భావిస్తారు. బహుజన సమాజ్‌ పార్టీ నేత మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ముందే ప్రకటించి అత్యధిక ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ముందుగానే ఒక కూటమిగా ఏర్పడి, కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొం దించుకొని పోటీకి దిగితే అది వేరే సంగతి. అటువంటి సూచనలు కనిపించడం లేదు.

రెండు రకాల ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్, బీజేపీలు లేని ఫెడరల్‌ ఫ్రంట్‌. రెండోది కాంగ్రెస్‌తో కూడిన ప్రత్యామ్నాయ కూటమి. మాజీ ప్రధాని దేవెగౌడ శనివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆదివారంనాడు కేసీఆర్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌పైన చర్చలు జరుపుతారు. ఆయనకు మరోసారి ప్రధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆసనాలూ, యోగా అంటూ హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ లేకుండా ఎన్‌డీఏకి ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ నిర్మాణం అసాధ్యమనే అభిప్రాయం చాలామంది ప్రతిపక్ష నేతలలో ఉంది. కేసీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌. దేవెగౌడకు కాంగ్రెస్‌ ప్రస్తుతం భాగస్వామి. ఆ కాపురం కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని బీజేపీతో జేడీ (ఎస్‌) పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్, జేడీ (ఎస్‌)ల నుంచి కొంతమంది ఎంఎల్‌ఏలు బీజేపీకి ఫిరాయిస్తే యడ్యూరప్ప నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడవచ్చు. బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటున్నాయి. కానీ రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సంసిద్ధత వెల్లడించింది.

కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు ఒకే కూట మిలో ఇమడగలవా? ఇటువంటివే అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. అయినప్పటికీ నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా ప్రజలలో ప్రాబల్యం ఉంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల ప్రజలలో గల వైముఖ్యాన్ని మోదీ భుజాన వేసుకొని మోస్తూ జమిలి ఎన్నికలలో పోటీ చేయడం అవివేకం. పదిహేనేళ్ళుగా పదవిలో ఉన్న రమణ్‌సింగ్, శివరాజ్‌సింహ్‌ చౌహాన్‌ల పట్ల ప్రజలు అసహనంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్‌లో ఒకే పార్టీకి రెండోసారి పట్టం కట్టడం అరుదు. పైగా వసుంధరారాజే వైఖరి కారణంగా పాలకపక్షానికి ప్రజలు దూరం జరుగుతారు. ఈ మూడు రాష్ట్రాలలో పరాజయం పొందుతామనే భయంతో లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపితే అసలుకే ముప్పు రావచ్చు. గడువు కంటే ముందుగానే లోక్‌సభను రద్దు చేయమని సిఫార్సు చేయడం అనర్థదాయకమని మోదీకి తెలుసు. అటువంటి సంక్లిష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. లోక్‌సభకూ, తెలుగు శాసనసభలకూ ఎన్నికలు గడువు ప్రకారమే (2019 ఏప్రిల్‌–మేలో) జరుగుతాయని భావించవచ్చు.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement