17వ లోక్‌సభ ఎన్నికలకు పొత్తుల విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పోలిస్తే అధికార బీజేపీ కాస్త ముందుంది. బిహార్‌లో జేడీయూతోనూ, మహారాష్ట్రలో శివసేనతోనూ బీజేపీ ఒక అంగీకారానికి వచ్చింది. కాగా, కేంద్రంలో అధికారానికి ఆయువు పట్టయిన యూపీలో ఎస్‌పీ, బీఎస్‌పీ సయోధ్య కారణంగా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బహుజన్ సమాజ్‌పార్టీ (బీఎస్పీ) 38, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 37 సీట్లకు పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
రాష్ట్రీయ లోక్‌దళ్‌కు మూడు సీట్లు కేటాయించిన ఎస్‌పీ, బీఎస్‌పీ కూటమి కాంగ్రెస్‌కు మాత్రం రెండు సీట్లు(రాయ్‌బరేలీ, అమేథీ) వదిలేయడం గమనార్హం. ఇదే కూటమిలోని ఈ రాష్ట్రంలో బీజేపీ తన మిత్రపక్షాలైన అప్నాదళ్(సోనేలాల్ పటేల్), సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)తో ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు చేసుకోలేదు. కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన రెండు సీట్లు గెలుచుకుంది. ఎస్బీఎస్పీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షమైంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు లేకుండా అన్ని సీట్లకూ పోటీ చేస్తానని ప్రకటించింది.
బిహార్‌లో జేడీయూ, బీజేపీ
40 సీట్లున్న బిహార్‌లో సంకీర్ణ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న జేడీయూ, బీజేపీ చెరో 17 సీట్లకు పోటీచేసేలా ఇటీవల అంగీకారం కుదిరింది. మిగిలిన సీట్లలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) పోటీ చేస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, ఇతర బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమిలో ఇంకా సీట్ల పంపిణీ పూర్తి కాలేదు. అయితే ఆర్జేడీ 20 సీట్లకు, కాంగ్రెస్ 10 సీట్లకు పోటీచేసేలా ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ సీటుకు సంబంధించి పాలకపక్షమైన ఏఐఏడీఎంకేతో లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపిణీ ఒప్పందం చేసుకుంది.
తమిళనాడులో ఏఐఏడీఎంకే 27 సీట్లకు, బీజేపీ ఐదు స్థానాలకు కలిసి పోటీచేస్తాయి. సినీ నటుడు విజయకాంత్ నాయకత్వంలోని ఎండీఎంకే కూడా ఈ కూటమిలో చేరుతుందని, ఈ పార్టీకి నాలుగు సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎస్ రామదాస్ నేతృత్వంలోని వన్నియార్ల పార్టీ పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి)కు ఇదివరకే ఏడు సీట్లు ఏఐఏడీఎంకే కేటాయించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన ఏఐఏడీఎంకే 39కి 37 సీట్లు కైవసం చేసుకోగా, ఎన్డీఏలోని బీజేపీ, పీఎంకేలు చెరో సీటు దక్కించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే, కాంగ్రెస్, ఇతర పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు కుదిరింది. డీఎంకే 20, కాంగ్రెస్ 9 సీట్లకు పోటీచేస్తాయి. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, వీసీకే పార్టీకి రెండేసి చొప్పున సీట్లను డీఎంకే కేటాయించింది.
మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ
మహారాష్ట్రలోని 48 సీట్లలో 45 లోక్‌సభ సీట్లు పంచుకునే విషయంలో జనవరిలో కాంగ్రెస్, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మధ్య అంగీకారం కుదిరింది. రెండింటిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేదీ ఇంకా తేలలేదు. యూపీఏ కూటమిలోకి పూర్వపు ఎన్డీఏ భాగస్వామి స్వాభిమాని షేట్కారీ సంఘటన, సీపీఎం, ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని బీబీఎంను చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు నడుపుతున్న బీజేపీ 25 సీట్లకు, భాగస్వామ్య పక్షం శివసేన 23 లోక్‌సభ స్థానాల్లో పోటీకి నిర్ణయించారు. కేరళలోని 20 సీట్లలో వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రధాన పక్షాలైన సీపీఎం 16, సీపీఐ నాలుగు సీట్లకు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ భాగస్వామ్యపక్షాల మధ్య ఇంకా సీట్ల పంపిణీ పూర్తి కాలేదు.
జార్ఖండ్‌లో కుదరని సర్దుబాటు
14 లోక్‌సభ సీట్లున్న జార్ఖండ్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, జనతా దళ్(యూ)మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదు. ఈ ప్రయతాలు విఫలమైతే బీజేపీ ఒంటరిగా అన్ని సీట్లకూ పోటీచేస్తుందని భావిస్తున్నారు.
మళ్లీ పుంజుకున్న కమలం
గతేడాది చివర్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నుంచి ప్రతిపక్షంలోకి రావడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో బీజేపీ మళ్లీ పుంజుకుందనీ, ఇప్పుడు ప్రతిపక్షాలతో పోలిస్తే బాగా బలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, రైతు గౌరవ నిధి పథకం, ప్రజాకర్షక బడ్జెట్, ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడి, తదనంతర పరిణామాలతో ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment