న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై వచ్చిన ఎన్నికల నిబంధనావళి (కోడ్) ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం (ఈసీ)ను ఆదేశించాలంటూ వచ్చిన పిటిషన్లను మంగళవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మోదీ, అమిత్ షాలు విద్వేష వ్యాఖ్యలు చేయడం, సాయుధ బలగాల అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం తదితరాల ద్వారా పలుసార్లు నిబంధనలను ఉల్లంఘించారనీ, వీటిపై ఫిర్యాదులు చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు.
దీనిపై వెంటనే విచారణ జరపాల్సిందిగా సుస్మిత తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ కోర్టును కోరారు. సింఘ్వీ విన్నపాన్ని పరిశీలించిన ధర్మాసనం, సుస్మిత పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని హామీనిచ్చింది. కాగా, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, రాహుల్‌లపై వచ్చిన ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఫిర్యాదులపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. కమిషన్‌లోని సభ్యులంతా మంగళవారం ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈసీ సోమవారం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment