సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం కొర్రీలు వేసింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేదంటూ పలు అంశాలను లేవనెత్తింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి సుమిత్ ముఖర్జీ రెండు నెలల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత ఇచ్చేందుకు సరిపడే సమాచారం లేదని లేఖలో ఈసీ ప్రస్తావించింది.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలంటూ కేంద్రం గతంలో ఈసీకి వర్కింగ్ పేపర్లను పంపింది. రాష్ట్రంలో 119 స్థానాలను 153కు, ఏపీలో 175 స్థానాలను 225కు పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. తదనుగుణంగా ఏపీ రీ ఆర్గనైజేషన్ (రిమూవల్ ఆఫ్ డిఫీకల్టీస్) ఆర్డర్–2015ను కేంద్ర హోం శాఖ ప్రచురించింది. అందులో ప్రస్తావించిన ప్రతిపాదనలను ఈసీ తప్పుబట్టింది. పెరిగే అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్యను నిర్ణయించాల్సి ఉంటుందని ప్రస్తావించింది.
‘‘అలా ఎస్సీ, ఎస్టీ స్థానాలను నిర్దేశించేందుకు అసెంబ్లీ పరిధి అత్యంత కీలకం. ప్రభుత్వం నుంచి అందిన సమాచారంలో మరింత స్పష్టత కావాలి’’అంటూ పలు అంశాలను ఉటంకించింది. విభజన సమయంలో రంపచోడవరం, పోలవరం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు తెలంగాణ, ఏపీ మధ్య అటువిటుగా చెల్లాచెదురయ్యాయి. కొన్ని రెండు రాష్ట్రాల పరిధిలో విస్తరించటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో నాలుగు అంశాలను ఈసీ ప్రధానంగా లేఖలో ప్రస్తావించింది.
ఏపీలోని రంపచోడవరంలో నెల్లిపాక మండలం ఉన్నట్టుగా ప్రతిపాదనలు అందాయని, పునర్విభజనతో నెల్లిపాక మండలం ప్రభావితమైనట్లు చట్టంలో లేదంటూ ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగా రంపచోడవరంలో ఏయే ప్రాంతాలుండాలో కచ్చితంగా నిర్ణయించలేని పరిస్థితి నెలకొందని రిమార్కు రాసింది.
ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఉమ్మడి రాష్ట్రంలో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. విభజన నేపథ్యంలో ఈ మండలంలోని ఆరు గ్రామాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. కానీ వాటిని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చాలనేది హోం శాఖ ప్రచురించిన ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదని ఈసీ అభ్యంతరం వెలిబుచ్చింది.
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలు విభజన సందర్భంగా ఏపీలో చేరాయి. వాటిని కొత్తగా ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో చేర్చాలో కూడా హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొనలేదంది. ఇన్ని సందిగ్థతలున్నందున ఎస్టీ స్థానాలు, వాటి పరిధిలోకి వచ్చే ప్రాంతాలను స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి ఉందని ఈసీ అభిప్రాయపడింది. అందుకే మరింత స్పష్టతతో వెంటనే సమాచారమివ్వాలంటూ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర హోం శాఖ రెండు నెలల కింద లేఖలు రాసింది. తాజాగా ఏప్రిల్ 19న ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ కూడా రాసింది.
Comments
Please login to add a commentAdd a comment