రచనలు అపోహలు కలిగించేలా ఉండొద్దు
* రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు ఉండాలి: సీఎం
* తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసింది
* అమర్ ‘డేట్‌లైన్ హైదరాబాద్’ వ్యాసాల సంకలనాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ పురోభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు సాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అపోహలు కలిగించే విధంగా రచనలు ఉండకూడదని, అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు.
కొన్ని వార్తలు బాధ కలిగిస్తున్నాయని, నిజాలు విశ్లేషిస్తే బాగుటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వచ్చిన విశ్లేషణలను ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గురువారం రవీంద్రభారతిలో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ‘డేట్‌లైన్ హైదరాబాద్’ శీర్షికతో రాసిన వ్యాసాల సంకలనాన్ని సీఎం ఆవిష్కరించారు. జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజాతంత్ర’ పత్రిక 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో అమర్ ఈ సంకలనాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. అమర్ రాసిన పుస్తకం గొప్పగా ఉందని, తనను విమర్శిస్తూ రాసిన పుస్తకాన్ని తానే ఆవిష్కరించానని అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే కరెంటు శ్లాబ్ రేటును రూ.18 నుంచి రూ.35కు పెంచటంపై అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, ఇదే ఉద్యమానికి నాంది ప్రస్తావన అయిందన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ఏడాది ముందు మూడున్నర వేల గంటలపాటు తెలంగాణ ఉద్యమంపై మేధోమథనం జరిపినట్లు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా పలు ఛలోక్తులతో అప్పటి కరెంటు సమస్యతోపాటు ట్రాన్స్‌ఫార్మర్లు పొందటానికి రైతులు పడిన ఇబ్బందులను సీఎం వివరించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతిరోజూ సీనియర్ పాత్రికేయులతోపాటు 100 నుంచి 150 మంది ప్రముఖలతో చర్చించిన పలు అంశాలను గుర్తుచేశారు. ఉద్యమ కాలంలో ప్రజాతంత్ర పత్రిక రాసిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ... ‘డేట్‌లైన్ హైదరాబాద్’ అందరూ చదవదగిన పుస్తకం అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పత్రిక, టీవీ, ఉద్యమం, ఆంగ్లంలో జర్నలిస్టుగా అమర్ విజయం సాధించారన్నారు.
ప్రజాహితం కోరి అమర్ ముక్కుసూటిగా రచనలు చేశార న్నారు. ఏ వ్యాఖ్య చేసినా ధర్మబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి చేయాల్సి ఉంటుందన్నారు. నిజాయితీ గల చరిత్రకారుడుగా చెప్పినట్లుగా అమర్ వ్యాసాలున్నాయని కొనియాడారు. మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అమర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 2,500 మంది జర్నలిస్టుల ఇళ్ల కోసం సీఎం 100 ఎకరాలు ఇవ్వడాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. సభలో ముఖ్య అతిథులకు అమర్, ఆయన సోదరులు ఘనంగా సన్మానించారు. అనంతరం అమర్‌ను హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సత్కరించారు.