ఇక్కడ పుట్టుకైనా చావైనా అంతా రాజకీయమే! | Guest Column By Devulapalli Amar Over Chandra Babu Naidu And KCR | Sakshi
Sakshi News home page

అన్నిటిపైనా రాజకీయ ముద్రలేనా?!

Published Wed, Sep 26 2018 2:51 AM | Last Updated on Wed, Sep 26 2018 11:35 AM

Guest Column By Devulapalli Amar Over Chandra Babu Naidu And  KCR - Sakshi

కారు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొండగట్టు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని అసలు పట్టించు కోలేదు. తానేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది కాగా, రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటనపై బాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్‌ సమర్పించిన నివేదిక ఒక న్యాయ విచారణ నివేదికలా లేదు. ఇక్కడ పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయమే.

జనం అంటే తమకు అధికారం తెచ్చిపెట్టే ఓట్లు, తాము అధికార పీఠం చేరుకోడానికి నిచ్చెన మెట్లు, డబ్బు పారేస్తే కొనడానికి దొరికే వస్తువులు. వాళ్ళు మనుషులు కాదు. మనుషులు ఎందుకు? ఓట్ల మిషన్‌ మీద తమకు ఓటేయడానికి నొక్కే వేలు ఉంటే సరిపోదా? దానికి ఆకలి ఉండదు, ఆలోచనా ఉండదు. అప్పుడు మనుషుల ఆకలి తీర్చడానికి నయా పైసా ఖర్చుండదు. తమను అధికారం నుంచి దింపి వేస్తారేమో ననే భయం ఉండదు. చాలామంది రాజకీయ నాయకుల ఆలోచన ఇలా ఉంటుంది. అలాంటి నాయకులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ కాలపు ప్రతినిధులు. ఇంకే రాజకీయ నాయకుడయినా వారిని చూసి నేర్చుకోవాల్సిందే. అధికారం దీర్ఘకాలం.. మళ్లీ మాట్లాడితే శాశ్వతంగా తమ వద్దనే ఉండిపోవడం కోసం ఏమైనా చేస్తారు. కొడు కులూ ఇంకా మనుమలకు అధికారాన్ని వారెంత సామర్ధ్యం లేనివారైనా, బదలాయించడానికి వెనకాడరు. పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయం. 

కేసీఆర్, చంద్రబాబు గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుకోడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొన్ననే తెలంగాణ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కొండగట్టు దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సంస్థ బస్సు ప్రమాదం జరిగి 60 మంది గ్రామీణులు మరణించారు. వారంతా పేదలు. అంతకు కొద్ది రోజుల ముందే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కుమారుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ట రోడ్డు ప్రమాదంలో మరణించారు.  తెలం గాణ  ఏర్పడిన కొద్ది మాసాలకే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీకొన్న ఘటనలో అమా యక పసిపిల్లలు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్క రాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట కారణంగా 29 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. 

నేరాలకు శిక్షలుండవా?
నందమూరి హరికృష్ణ తెల్లవారుజామునే కారు స్వయంగా నడిపి ప్రమా దంలో చనిపోయారు. ముఖ్యమంత్రి హుటాహుటిన హరికృçష్ణ ఇంటికి వెళ్లి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలు జరిగిన మహా ప్రస్థానంలో 450 గజాల స్థలంలో స్మృతిచిహ్నం నిర్మాణానికి నిర్ణయిం చారు. ఇదంతా హరికృష్ణ మీద గౌరవమో ప్రేమో అనుకుంటే పొర పాటు. ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల కనీసం 25–30 నియోజకవర్గాల్లో ఎన్నికలను  ప్రభావితం చేసే ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్ల మీద ప్రేమతోనే ఇదంతా. హరికృష్ణ మరణంతో పోలిస్తే కొండగట్టు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం పెను విపత్తు. అది ప్రభుత్వం చేసిన సామూహిక హత్య. విశ్రాంతి లేకుండా నాలుగు రోజులుగా ఆ డొక్కు బస్సు నడుపుతూ అలసిపోయిన డ్రైవర్, ఏమాత్రం ప్రయాణా నికి పనికిరాని రోడ్డు, లాభాపేక్షతో కెపాసిటీకి మించి బస్సులో కుక్కిన 110 మంది ప్రయాణికులు... ప్రమాదానికి ఇవీ కారణాలు. ఆర్టీసీలో 6,000 డ్రైవర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 300 కొత్త బస్సుల అవ సరమున్నా  పట్టిం చుకునే నాథుడు లేడు. 

హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన ముఖ్యమంత్రి జాడే లేదెందుకు కొండగట్టు దగ్గర? వారంతా ఓటర్లు మాత్రమే కాదు, తెలం గాణ పోరాటంలో సమరశీల పాత్ర పోషించిన జగిత్యాల ప్రాంత ప్రజలు. కానీ, అక్కడ చనిపోయిన ఓటర్ల సంఖ్య 60 మాత్రమే. వారేమీ 25–30 స్థానాల్లో గెలుపోటములు ప్రభావితంచేసే వారు కాదు అనుకుని ఉండొచ్చు. 100 నియోజకవర్గాల ప్రజలు ఇది గమనిస్తున్నారన్న విషయం సీఎం మరిచిపోయినట్టున్నారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ నిర్ల క్ష్యమే కారణమైనప్పుడు నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలి. కనీసం రవాణా మంత్రి లేదా ఆర్టీసీ అధిపతికైనా ఉద్వాసన జరగాలి. డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారు.

ఏపీ సీఎంకు అన్నీ ఈవెంట్లే!
ఇక ఏపీ సీఎం చంద్రబాబు తీరు మరో రకం. ప్రతిదీ రాజకీయ లబ్ధికి వాడుకునే అలవాటు ఆయనది. ప్రతి సంక్షోభాన్నీ వాడుకుంటారు. ఆయనకు అన్నీ ‘ఈవెంట్లే’. జనం మరణాలను కూడా తనకు అను కూలమైన ఈవెంట్‌గా మార్చుకొనే ప్రయత్నం చేయడంలో దిట్ట. నేనేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది. రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటన తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్‌ నిన్న కాక మొన్న తన నివేదికను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అధికారపక్షం ఆమోదం పొందిన ఆ నివేదిక గతంలో ఎంతో ప్రతిష్ట కలిగి ఉండిన జస్టిస్‌ సీవై సోమయాజులు రాసి నట్టుగా లేదం   టున్నారు. అసలు అది ఒక న్యాయ విచారణ నివేదికలా లేదనే అభి ప్రాయం వ్యక్తమైంది.

పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు ప్రజల విశ్వాసాలకు సంబంధించినవి. ప్రభుత్వాలకు వాటితో ఏ సంబంధమూ ఉండకూ డదు. పుష్కర స్నానాలు చేసే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిం చడం, పెద్ద సంఖ్యలో జనం వస్తారు కాబట్టి నేరాలూ, ప్రమాదాలూ జర గకుండా చూడటం, శాంతి భద్రతలను పరిరక్షణ–ఇంత వరకే ప్రభు త్వాల పాత్ర పరిమితం కావాలి. కానీ చంద్రబాబుకు ప్రతిదీ ఈవెంట్‌గా మలచుకునే అలవాటు కాబట్టి గోదావరి పుష్కరాలను ఒక అంతర్జా తీయ ఈవెంట్‌ చేయాలనుకున్నారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందడానికి చేసిన పనే 29 మంది అమాయక భక్తుల దుర్మ రణానికి కారణమైంది.

ఒక విదేశీ టీవీ చానల్‌లో ప్రదర్శన కోసం ఆయన నిర్మించిన ప్రచార చిత్రం కారణంగానే తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద సంఖ్యలో కనపడేట్టు సినిమా తీయాలన్న కీర్తి కండూతి కారణంగా వీఐసీ ఘాట్‌లో కాకుండా  మామూలు భక్తులు స్నానం చేసే ఘట్టాల దగ్గర చంద్రబాబు కుటుంబం పుణ్యస్నానాలు చేసినందువల్ల, ఆయన రక్షణ కోసం, అప్పటి దాకా ఆపి ఉంచిన జనాన్ని ఒక్క సారిగా వదిలేసరికి తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. న్యాయ విచారణ జరపాల్సింది ఈ అంశంపైనే. అయితే ఇది తప్ప చాలా అనవ సరపు విషయాలు జస్టిస్‌ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్‌ నివేదికలో ప్రస్తావించారు.

మీడియాలో ప్రచారమే కొంప ముంచింది!
పుష్కరాల ప్రారంభ దినాన ఉదయం ఒక ముహూర్తంలోనే స్నానాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ప్రభుత్వమే మీడియాకు విడుదల చేసిన వ్యాపార ప్రకటనల్లో ఊదర గొట్టింది. ఆ విషయం పక్కన పెట్టి సోమయాజులు గారు తన నివేదికలో ‘అసలే పిచ్చి నమ్మకం. ఆపై ప్రసార మాధ్యమాలలో అతిశయోక్తులతో కూడిన సిద్ధాంత రాద్దాంతం. ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది?’ అని దుర్ఘటన కారణాలను భక్తుల నమ్మకం మీదా, మీడియా మీదా నెట్టేశారు. ‘ఫలానా ముహూర్తంలోనే స్నానం చెయ్యండి, పుణ్యం వస్తుంది’’ అని ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని పక్కన పెట్టి ‘స్నానాలు ఎప్పుడు చేసినా పుణ్యం వస్తుందన్న విషయాన్ని సరిగా చెప్పలేక చానళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించాయి’ అని బాధ్యతను మీడియా మీదకు నెట్టేశారు జస్టిస్‌ సోమయాజులు.

మరో పక్క గోదావరిని ఒక బ్రాండ్‌గా ప్రమోట్‌ చెయ్యడానికి సంవత్సరం ముందు నుంచే రూ.1500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రణాళికలు రచించిందోనని కొనియాడారు న్యాయమూర్తి. ‘కోటగుమ్మం దగ్గర ఉన్న పుష్కర ఘాట్‌ మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి, తదితర ప్రముఖులు స్నానాలు ముగించుకు వెళ్ళే దాకా జనాన్ని ఆపి ఉంచడం వల్ల ఇబ్బంది అయింది’ అని చెపుతూనే ప్రభుత్వం తప్పేమీ లేదని, అంతా ప్రతిపక్షాల ఓర్వలేనితనమేనని తేల్చేశారు తన నివేదికలో. 

ఇది జస్టిస్‌ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్‌ నివేదికలా లేదని చెప్పడానికి సాక్ష్యాధారాలుగా ఈ కింది పంక్తులు చాలు. ‘సమ కాలీన పరిస్థితులు ఏం చెపుతున్నాయంటే అధికారంలో లేని పార్టీలు, లేదా అధికార పక్షానికి వ్యతిరేకులయిన, అంత స్నేహంగా లేకపోయిన పార్టీలు, వాటి నాయకులూ అధికార పక్షం మీద బురద చల్లడానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టవు. చిన్న సంఘటనను, ఉప ద్రవాన్ని కూడా సొమ్ము చేసుకో జూస్తాయి’. ఈ నివేదికలో ఇంతకంటే దుర్మార్గమైన వ్యాఖ్యానం ఏమిటంటే, సీఎం బాబు పన్నెండు రోజులూ రాజమండ్రిలోనే బస చేసి ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొని యాడుతూ ‘అన్య మతస్తులు కూడా అనేకులు పుణ్య స్నానాలు ఆచరిం చడం ఆనవాయితీ.

అందులో భాగంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి వైఎస్సార్‌కి తీర్థ విధి నిర్వహించారు. ఆ విషయం మీడియాలో ప్రసారం కూడా అయింది’ అని. ఒక దుర్ఘటనకు సంబంధించి నిజాని జాలు విచారణ జరిపి, న్యాయబద్ధంగా నివేదిక ఇవ్వాల్సిన న్యాయ మూర్తి వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయా? ఈ నివేదికలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావన ఔచిత్యం ఏమిటో సోమయాజులు గారే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రకటన లాంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఈ నివేదికలో చాలా ఉన్నాయి. స్థలాభావం వల్ల వాటన్నిటినీ ఇక్కడ పేర్కొనడం లేదు.


వ్యాసకర్త 
దేవలపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement