తిక్కెక్కిస్తున్న పవన్ లెక్క
డేట్‌లైన్ హైదరాబాద్
పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందే హాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం.
అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసేసుకుని ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు కూడా చేశారు. దీనితో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో జనం ఒక విషయం పట్టించుకోకుండా వదిలేసినట్టు కనిపిస్తున్నది. అది– వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎన్‌డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహాలు కేంద్ర ప్రభుత్వానికి అచ్చిరావని ఇప్పటికే ఒకసారి తేలిపోయింది. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే లక్ష్యంగా తిరుమల దారిలోని అలిపిరి వద్ద తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. ఆ ఘటన ద్వారా వచ్చిన సానుభూతిని వాడుకుని మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆనాడు ఆలోచించారు.
అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆయన సలహా పాటించి ఆరునెలల ముందే ఎన్నికలకు (2004) వెళ్లింది. అప్పుడే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం, ఢిల్లీలో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కూడా చంద్రబాబు లేఖకు స్పందించి, ఆయన సలహా మేరకే జరిగి ఉంటే మోదీ ప్రభుత్వానికి తగులుతున్న జనాగ్రహం వేడితో బీజేపీ నేతలకు పొరపాటు అర్థమయ్యే ఉంటుంది. అంటే రెండోసారి ఎన్‌డీఏని చంద్రబాబు ఇబ్బందుల్లో పడేశారు. కానీ ఆయన ఆ లేఖ రాసి నప్పుడు చేసుకున్నంత ప్రచారం, ఇప్పుడు చేసుకోవడానికి మాత్రం సాహసం చేయడం లేదు. కేంద్ర నిర్ణయం వికటించేసరికి ఇదంతా తన లేఖ ఘనతేనని ప్రకటించుకునేందుకు ముందుకు రావడం లేదు.
పెద్దనోట్ల రద్దు.. మింగలేక, కక్కలేక..
నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే పద్ధతి ఇది కాదనీ, ఇది ఒక పరిణతి చెందిన ప్రభుత్వ నిర్ణయం మాదిరిగా కాకుండా, ఆకతాయి పనిగా ఉందనీ అత్యధిక సంఖ్యాకులయిన ప్రజలు ఇవాళ అభిప్రాయపడుతున్నారు. ఒకటి నిజం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏ మాత్రం సానుకూల ప్రజాస్పందన పొందినా, చంద్రబాబునాయుడు వెంటనే ఇదంతా తన లేఖ ఘనతేనని కచ్చితంగా ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టు తయారయింది. కేంద్ర నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలూ తీవ్రమయిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చే మాసాల్లో ఎదురుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బహిరంగంగానే కేంద్రం నిర్ణయాన్ని విమర్శి స్తున్నారు. కేంద్రంలో భాగస్వామి కావడం వల్లా, పెద్ద నోట్ల రద్దును కోరుతూ స్వయంగా లేఖ రాసిన కారణం వల్లా చంద్రబాబు ఇప్పుడు ఏమీ మాట్లా డలేరు. కానీ మోదీతోపాటు జనాగ్రహాన్ని కొంత తానూ మూటకట్టుకోక తప్పదు.
అదీ కాకుండా రద్దు నిర్ణయం చాలా ముందే తెలుసు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ పెద్దలూ, వారి సమర్థకులూ ఇప్పటికే సర్దుకున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తానికి ఈ వ్యవహారం ప్రత్యేక హోదా హామీని అటక ఎక్కించిన కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి ఎదురుకానున్న వ్యతిరేకతను మరింత తీవ్రం చేస్తుం దనడంలో సందేహం లేదు. నోట్ల రద్దు గందరగోళంలో పడి అందరూ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఇక ఆయన క్రియాశీలక రాజకీయాల గురించి మాట్లాడుకుందాం.
మొత్తానికి పోటీ చేస్తానన్నారు!
2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిర్ధారించారు. గత వారం అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగం మధ్యలో ఈ ప్రకటన చేశారు. 2014 ఎన్నికలకు కొద్ది ముందుగా ఆయన తన సొంత పార్టీ జనసేన ప్రకటించినా పోటీ చెయ్యబోవడం లేదని స్పష్టంగా చెప్పి బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం మాత్రం చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తీవ్రమయిన సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నా మిత్రధర్మం అనుకున్నారేమో, ఆయన తాను బలపరిచిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నర సంవత్సరాలు గడిచాయి. అడుగడుగునా సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే శాసనసభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం ఆందోళన బాట పట్టి, దాదాపు రోజూ వీధుల్లోనే ఉంటున్న పరిస్థితిలో కూడా ప్రశ్నిస్తానూ, ప్రశ్నిస్తానూ అని పదే పదే చెప్పిన పవన్ ఒక్కమాట మాట్లాడకుండా ఇప్పుడు పెదవి విప్పారు.
పవన్ వైఖరి ఏమిటి?
ఎవరైనా రాజకీయాల్లోకి ప్రవేశించాలని అభిలషించినా, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా ఆ ఆలోచన వెనుక చాలా అంతర్మథనం జరగడం సహజం. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల వైపు బలవంతంగానే ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికీ, ఆ తరువాత అధికారంలోకి రావడానికే. పవన్ కల్యాణ్ గత రెండు మాసాల కాలంలో తిరుపతి నుంచి మొదలు పెట్టి అనంతపురం దాకా మాట్లాడిన మూడు సభల్లో ఎక్కడా ఆయన అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించదు. తిరుపతి తరువాత ఆయన ప్రత్యేక హోదా పోరాటం కాకినాడ నుంచి ప్రారంభించారు. ఆ తరువాత అనంతపురం వచ్చేసరికి మాత్రం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అంశంలో స్పష్టత వచ్చింది.
ఈ మధ్యలో ఆయన ఏలూరులో ఇల్లు తీసుకోవడం, అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఆయనను అభిమానించే వారిలో కొంత నమ్మకం కలిగించిన మాట నిజమే కావచ్చు. అయినా ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కల్యాణ్ మాటలు మాత్రం ఆయన అభిమానులను నిరుత్సాహపరిచేవిగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తన శత్రువు ఎవరో ఆయనకు స్పష్టత లేదు. బలంగా నిలిచి శత్రువు మీద గెలుస్తాననే ఆత్మవిశ్వాసమూ ఆయన మాటల్లో వినిపించదు. ప్రజలు తనను నమ్ము తున్నారనీ, తనతో ఉంటారనీ కూడా ఆయనకు నమ్మకం లేదు. అదే వేదిక మీద ఆయన ‘‘మీరు నాతో ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను’’అనడం, అలాగే పోటీ అయితే చేస్తాను, గెలిచినా ఓడినా సరే అనడంతోనూ ఆయనకు తాను ఏం చేయదలుచుకున్నారన్న విషయంలో స్పష్టత లేదన్న సంగతి అందరికీ అర్థం అయింది.
తెలుగుదేశం పార్టీలో అవినీతిని గురించి ఆయన ప్రస్తావించారు. 20 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొనడం తప్పు అనే మాట మాట్లాడరు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని విమర్శిస్తారు. సన్మా నాలు చేయించుకున్న వెంకయ్యనాయుడును ఇతర బీజేపీ నాయకులనూ విమర్శిస్తారు. కానీ మొట్టమొదటి రోజు నుంచీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనతో భుజం కలపడానికి సిద్ధపడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని తెలుగు దేశం, బీజేపీ కూటమి అంటుంటే నిరంతర పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆందోళన చేస్తున్నాయి.
2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి బరిలోకి దిగినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన అనేక సభల్లో మాట్లాడారు. అప్పుడు ఉన్న స్పష్టత ఇప్పుడు సొంత పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వారిని ఆయన చాలా మొహమాటంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో లేదా రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్‌లు మొదలయిన సమస్యల మీద పోరాటం చేస్తే, నిలదీస్తే పెద్ద పెట్టున విరుచుకుపడి సంస్కారహీనమయిన భాషలో దూషించే అధికారపక్ష పెద్దలు కూడా పవన్ కల్యాణ్‌ను గట్టిగా విమర్శించడానికి సిద్ధపడటం లేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని పవన్ చేసిన విమర్శ మీద తెలుగుదేశం సీనియర్ నాయకుడొకరు, ‘అవును కొద్ది మాసాల క్రితం మా ముఖ్యమంత్రి కూడా పార్టీ మీటింగ్‌లో ఈ విషయం చెప్పారు, పవన్‌కు మెల్లగా నచ్చచెబుదాం అన్ని విషయాలు’ అన్న స్వరంలో మాట్లా డారంటే ఏమనుకోవాలి? కాపుల రిజర్వేషన్‌ల విషయంలో ముద్రగడ పద్మ నాభం పాదయాత్ర తలపెడితే అది శాంతిభద్రతల సమస్య అవుతుంది. దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు పాదయాత్ర చెయ్యడానికి మాత్రం అనుమతి ఉంటుంది. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. వీటిలో వేటి గురించి పవన్ నోరు మెదపరు.
విపక్షాలతో కలవరేం?
ఇదే ధోరణి కొనసాగితే పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం కేంద్రం మీదనో, రాష్ట్ర ప్రభుత్వం మీదనో అని ఎవరూ అనుకోరు. ఈ సమస్యలన్నిటి మీదా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంతో కలసి నడిస్తేనే జనం నమ్ముతారు. అధికారపక్షాలతో పవన్ చేస్తున్నది లాలూచీ కుస్తీ అనే అపవాదు మూట కట్టుకోకుండా ఉండాలంటే, జనసేనను, సేనాధిపతినీ ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల మీద జరుగుతున్న పోరాటంలో నిజాయితీగా ఇతర పక్షాలతో భుజం కలిపి నడవటం ఒక్కటే మార్గం.
datelinehyderabad@gmail.com
దేవులపల్లి అమర్