వసతులు వారికి-వెతలు వీరికి! | Dateline Hyderabad article on AP employees evacuation | Sakshi
Sakshi News home page

వసతులు వారికి-వెతలు వీరికి!

Published Wed, Jun 8 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

వసతులు వారికి-వెతలు వీరికి!

వసతులు వారికి-వెతలు వీరికి!

- డేట్‌లైన్ హైదరాబాద్
 
‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు  నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి  బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందులోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని, అద్దెలు తగ్గించి మీరూ త్యాగాలు చేయండి  అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్యమంత్రి.
 
రాష్ర్టం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబునాయుడును అభినందించడానికి సచివాలయ ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ర్టం విడిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మన కొత్త రాజధాని ప్రాంతానికి వెళ్లి, కష్ట నష్టాలకు ఓర్చి అయినా పనిచెయ్యడానికి సిద్ధపడదామంటూ ఆ సంద ర్భంలో ఉద్యోగ సంఘాల నేతలు  పిలుపునిచ్చారు. ‘చెట్ల కింద పనిచేయడాని కైనా మేం సిద్ధం’ అని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. అప్పుడు ముఖ్య మంత్రి, ‘తమ్ముళ్లూ! ఆవేశపడొద్దు. మనకు తొందరలేదు. హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు కొనసాగించడానికి విభజన చట్టం పదేళ్ల వెసులుబాటు కల్పించింది. కాబట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని, సావ కాశంగా వెళదాం!’ అని ప్రకటించారు. నిజమే, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టం చెబుతున్నది. అది ఈ రోజుకు కూడా వర్తిస్తుంది. కానీ, రెండేళ్లు గడవగానే ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటన తారుమారై హైదరాబాద్ నుంచి శాశ్వతంగా బిచాణా ఎత్తేయా ల్సిందేనని ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది?

వెళ్లక తప్పదు అయినా...
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కొత్త రాష్ర్టం ఏర్పడింది. కాబట్టి ఏనాటికైనా ఉద్యోగులూ, అధికారులూ, మంత్రివర్గం అందరు కొత్తగా ఏర్పడే రాజధానికి తరలిపోవాల్సిందే. మరి, చెట్లకిందయినా పనిచెయ్యడానికి సిద్ధ పడ్డ ఉద్యోగులు, ఇప్పుడే వెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? తొందరేం లేదన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రెండేళ్లు గడవక ముందే తాత్కాలిక రాజధానికి రావాల్సిందేనని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ముఖ్యమంత్రి తన అభినందన సభలో చేసిన వ్యాఖ్యల మేరకు అప్పుడు ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


ప్రజల ముంగిట్లో పరిపాలన ఉండడం న్యాయమే. ఉద్యోగులూ, అధికారులూ రాష్ట్రానికి దూరంగా ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుంటే తమ అవసరాల కోసం ప్రజలు సచివాలయాన్ని వెతుక్కుంటూ ఏ శ్రీకాకుళం నుంచో, అనంతపురం నుంచో, నెల్లూరు నుంచో రావాల్సిన అగత్యం ఉండకూడదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నడి మధ్యనే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన సాగాలి. అయితే దానికి అవసరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 27 నాటికి ఉద్యోగులంతా తరలి రావాల్సిందేనని చెబుతూ, ‘ఇంకా ఏం సౌకర్యాలు కావాలి? టాయిలెట్స్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. పని చేసుకోడానికి ఇంకా ఏం  కావాలి?’ అని విసుక్కున్నారు.

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి పోయి, సర్వీస్‌లో ఆదా చేసుకున్న డబ్బుతో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుని, పిల్లల్ని చదివించుకుంటూ కుదురుగా కాలం వెళ్లబుచ్చుతున్న ఉద్యోగులను ఉన్నఫళంగా టాయిలెట్‌లూ, క్యాంటీన్‌లూ చూపించి తరలి రమ్మంటే ప్రభుత్వం ఎంత యాంత్రికంగా ఆలోచిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మాన సికంగా ఒక బంధం ఏర్పడి ఉంటుంది, అది తెంచుకుని వెళ్లాలి. తప్పదు, కాబట్టి సిద్ధపడతారు. కానీ అటువంటి వారిని ఒకరినో  ఇద్దరినో కాదు, వందలూ వేల సంఖ్యలో తరలిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగా మానవీయ కోణం నుంచి సమస్యను చూడాలి? సచివాలయ ఉద్యోగులూ, వివిధ శాఖల ఉద్యోగులూ నూతన రాజధానికి వెళ్లబోమని ఎప్పుడూ అనలేదు. ఒకటికి పదిసార్లు ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ తాము వెంటనే తరలి వెళ్లమంటే ఎదురయ్యే ఇబ్బందులను గురించి విన్నవించుకున్నారు. అయినా ఎట్టి పరిస్థితులలో జూన్ 27కు వెళ్లాల్సిందే అన్నది ఈ పూటకు కచ్చితంగా చెబుతున్న మాట.

రాజధాని ఇక్కట్లు నాడూ-నేడూ
 ‘‘ఉమ్మడి మద్రాస్ రాష్ర్టం నుంచి విడిపోయి కర్నూలును రాజధానిని చేసుకున్ననాడూ, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్‌కు తరలించిననాడూ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆ నగరాలకు తరలి వెళ్లడానికి పెద్దగా బాధపడలేదు. కర్నూలులో ఏ సౌకర్యాలూ లేకపోయినా గుడారాలలో కూడా పనిచేశారు. హైదరాబాద్‌కు తరలివచ్చినప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ  విలీనాన్ని ఇష్టపడని ఆనాటి హైదరాబాదీలు నిర సించినా, ఛీత్కరించినా బాధ పడలేదు, పనిచేశాం!’’ అని కర్నూలు నుంచి జీప్‌లో టైప్‌రైటర్‌లు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించిన తొలి బృందంలోని ఒక రిటైర్డ్ అధికారి అఖ్తర్ హుస్సేన్ చెబుతూ ఉంటారు.

ఉద్యోగులు కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సి రావడం ఇది మూడోసారి. కానీ ఇవాళ్టి పరిస్థితి మొదటి రెండుసార్లు ఎదురైనటు వంటిది కాదు. దీర్ఘకాల పోరాటం ఫలించి తెలంగాణ  ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం వారు బలవంతంగానే అయినా విడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉద్యో గులు రాష్ర్ట విభజనను వ్యతిరేకించారు. అటువంటి ఉద్యోగులను తరలి స్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిం చాలి తప్ప, ‘వస్తారా చస్తారా’ అన్న పద్ధతిలో వ్యవహరించడం అన్యాయం.


 ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్ర బాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు  నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి  బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందు లోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని ఉద్యోగులకు ఉద్బోధిస్తారు ముఖ్యమంత్రి. అద్దెలు తగ్గించి ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్య మంత్రి. తమ సామాజికవర్గం వారో, బంధువులో, మిత్రుల విష యానికో వచ్చేసరికి మాత్రం రాజధాని చుట్టూ భూముల బాగోతం గురించి ప్రశ్నిస్తే మా వాళ్లు వ్యాపారాలు చేసుకోవద్దా అని ఆగ్రహం ప్రదర్శిస్తారు. మరి విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఇంటి యజమానులు మాత్రం డబ్బు సంపాదించుకోవద్దా? ఉద్యోగులు కొత్త చోటికి వెళుతున్నప్పుడు అద నపు ఆదాయాన్ని ఆశించడం తప్పా? ఖరీదైన బస్సులో బస చేసి, ప్రత్యేక విమానాలలో ప్రయాణించి, తాత్కాలిక కార్యాలయాలకు వందల కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో నీతులు వల్లిస్తున్నారు.

 ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు ఎందుకు?
 పదేళ్లపాటు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించే వీలు ఉండి కూడా  హడావుడిగా విజయవాడకు 20 కిలోమీటర్లు,  గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న  రెండు అంతస్తుల తాత్కాలిక భవంతికి వచ్చి పనిచేయవలసిందేనని ఉద్యోగులను ఎందుకు శాసిస్తున్నారు? ఓటుకు కోట్లు వ్యవహారంలో శృంగభంగమయ్యాక ముఖ్య మంత్రిలో ఈ మార్పు వచ్చిందనేది  బహిరంగ రహస్యం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కూడా హైదరాబాద్ ఉమ్మడి శాసనసభా ప్రాంగణంలో కాకుండా విజయవాడకు మార్చాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుని కాదనిపించుకోవడం కూడా అధికార పక్షం దురుద్దేశానికి నిదర్శనమనే విమర్శ వచ్చింది.


 రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే ఒక వెయ్యీ 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఆ డబ్బు వెలగపూడిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఖర్చు చేసింది. మరి శాశ్వత రాజధానికి మళ్లీ నిధులు ఎట్లా? పైగా  కొండవీటి వాగు పొంగితే ఈ తాత్కాలిక సచివాలయ సముదాయం రెండు అంతస్తుల భవంతి మునిగిపోతుందని వెలగపూడి గ్రామం చుట్టుపక్కల గోచీ పెట్టుకుని గోళీలు ఆడుకుంటున్న చిన్నపిల్లలు కూడా చెబుతున్నారు. ఏదో విధంగా ఉద్యో గులను తరలించాల్సిందే అన్న పట్టుదల తప్ప ప్రభుత్వానికి ఇవేం పట్టవా? హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచి వాలయ భాగాలను తెలంగాణ  సర్కార్‌కు అప్పగించవలసిందిగా అధికారు లను ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఒక కొలిక్కి రాలేదు. అక్కడికి వెళ్లి పనిచెయ్యడానికి ఇంకా ఉద్యోగులు మానసికంగా సిద్ధం కాలేదు. పరిష్కరించాల్సిన సమస్యలు బోలెడు ఉన్నాయి. నేను త్యాగాలు చేస్తున్నాను అని తన మీద తానే జాలి పడటం(సెల్ఫ్‌పిటీ) మానేసి, ముఖ్యమంత్రి వ్యవహర్త  లాగా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది.
 

 - దేవులపల్లి అమర్
 datelinehyderabad@gmail.com

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement