secretariat of the AP
-
AP: సచివాలయ సేవలు బాగున్నాయి
భీమవరం అర్బన్: ఏపీలో అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సేవలు బాగున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను, సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న గ్రామస్తులను పలకరించి.. ఎన్ని డోసులు వేయించుకున్నారు.. ఈ వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల సేవలు, వారికిచ్చే వేతనం గురించి ఆరా తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజావసరాలను, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల ఇంటి ముంగిటకే తీసుకెళ్లడం అభినందనీయమని కితాబిచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్‌కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్‌కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్‌కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
కాలేజీ చదువులు
సాక్షి, అమరావతి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఆధోగతిలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇటు ప్రభుత్వంలో అటు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగా దిగజారి పోయాయనేందుకు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం నిదర్శనంగా నిలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు బీటెక్ (కంప్యూటర్స్)తో పాటు పీజీ చేసిన వారు ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే ఇంత మంది పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చూసి ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను ఎత్తి చూపుతున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి 150 మార్కులకు గాను 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అయితే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత కేవలం 1.33 శాతమే ఉండటం విద్యా ప్రమాణాలు ఇంత దిగజారిపోయాయా అని ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 11,158 డిజిటల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులైన వారు కేవలం 3,623 మంది మాత్రమే ఉండటం గమనార్హం. వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టుల ఉత్తీర్ణత శాతం కూడా విద్యా ప్రమాణాలను ఎత్తి చూపింది. ఈ పోస్టులకు 52,334 మంది పరీక్షలు రాస్తే, కేవలం 1,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు పరీక్షలు రాసినప్పటికీ కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోయారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 2.8 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాయగా కేవలం 1,474 మందే ఉత్తీర్ణులవ్వటం గమనార్హం. అలాగే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టుల పరీక్షల ఉత్తీర్ణత శాతం చూస్తే అగ్రికల్చర్ బీఎస్సీ విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనే అనుమానం కలుగుతుంది. 6,714 గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టులకు 22,622 మంది పరీక్షలు రాయగా కేవలం 6,239 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 27.57 శాతం మాత్రమే. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టుల పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. 3,770 పోస్టులకు 12,643 మంది పరీక్ష రాయగా 2,096 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 16.57 శాతం మాత్రమే. విద్యా ప్రమాణాలు పెంచడంపై సర్కారు దృష్టి ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వాలు ఆ కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించిన గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోని కాలేజీలను నీరుగార్చాయి. దీంతో అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు నిర్వీర్యం అయినట్లు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత శాతం స్పష్టం చేస్తోంది. ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతాలతో సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచనున్నారు. -
టీడీపీ మంత్రుల నేమ్ ప్లేట్లు తొలగింపు
సాక్షి, అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. దీంతో సచివాలయంలో టీడీపీ కేబినెట్ మంత్రుల నేమ్ ప్లేట్లను తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులను తొలగించాల్సిందిగా జీఏడీ అధికారులు ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో సచివాలయంలోని అన్ని బ్లాకుల్ని పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో పలువురు మంత్రుల పేషీల్లో ఉన్న ఫోటోలను తొలగించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను జీఏడీ సిబ్బంది తొలగించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే లోపు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయనున్నారు. పనికిరాని డాక్యుమెంట్లను క్లియర్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మాట్లాడుతూ నూతన ప్రభుత్వానికి ఉద్యోగులు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. వైఎస్ జగన్ గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ...గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ఉద్యోగుల కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉద్యోగులకు ఎలాంటి కష్టాలు లేవని అన్నారు. -
నా పొలం కాజేశారు
సాక్షి, అమరావతి/సచివాలయం(తుళ్లూరురూరల్): తమ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెట్టిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. కృష్ణా జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన కొమ్మినేని శివకోటేశ్వరరావుకు వీర్లుపాడు మండలం జుజ్జూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 245లో 0.56 ఎకరాలు, సర్వే నంబర్ 246లో 2.06 ఎకరాల భూమి ఉంది. శివకోటేశ్వరరావు భార్య కొమ్మినేని పద్మావతికి ఆమె తండ్రి కాపా సీతారామయ్య పసుపు, కుంకుమ కింద ఈ భూమి ఇచ్చారు. 1980 నుంచి ఆ భూమిపై అడంగళ్, 1బీ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వ హక్కులు ఆమె పేరు మీదనే ఉన్నాయి. అప్పటి తహసీల్దార్ భూమిపై హక్కుదారునిగా ధ్రువీకరించిన పత్రాలు కూడా రైతు వద్ద ఉన్నాయి. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా.. పద్మావతి పేరు మీద భూమి ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. గతేడాది అడంగళ్, 1బీ రికార్డుల్లో పద్మావతి పేరు మీద ఉన్న రికార్డులు దిద్ది.. మరొకరికి సదరు భూమిని బదలాయించారు. దీనిపై ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని రైతు శివకోటేశ్వరరావు వాపోయాడు. కలెక్టర్ ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు పంపారని రైతు ఆరోపిస్తున్నాడు. సచివాలయం ఎదుటే ఆత్మహత్య రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి నూతన విధానాలు తీసుకొచ్చామని మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది సామాన్య ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదు. రెండు సంవత్సరాలుగా నా భూమి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. రికార్డుల తారుమారుకు బాధ్యురాలైన తహసీల్దార్ రాజకుమారిపై చర్యలు తీసుకోవాలి. నా సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకుంటే సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటాను. –కొమ్మినేని శివకోటేశ్వరరావు, రైతు -
వసతులు వారికి-వెతలు వీరికి!
- డేట్లైన్ హైదరాబాద్ ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందులోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని, అద్దెలు తగ్గించి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్యమంత్రి. రాష్ర్టం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబునాయుడును అభినందించడానికి సచివాలయ ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ర్టం విడిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మన కొత్త రాజధాని ప్రాంతానికి వెళ్లి, కష్ట నష్టాలకు ఓర్చి అయినా పనిచెయ్యడానికి సిద్ధపడదామంటూ ఆ సంద ర్భంలో ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ‘చెట్ల కింద పనిచేయడాని కైనా మేం సిద్ధం’ అని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. అప్పుడు ముఖ్య మంత్రి, ‘తమ్ముళ్లూ! ఆవేశపడొద్దు. మనకు తొందరలేదు. హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు కొనసాగించడానికి విభజన చట్టం పదేళ్ల వెసులుబాటు కల్పించింది. కాబట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని, సావ కాశంగా వెళదాం!’ అని ప్రకటించారు. నిజమే, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టం చెబుతున్నది. అది ఈ రోజుకు కూడా వర్తిస్తుంది. కానీ, రెండేళ్లు గడవగానే ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటన తారుమారై హైదరాబాద్ నుంచి శాశ్వతంగా బిచాణా ఎత్తేయా ల్సిందేనని ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వెళ్లక తప్పదు అయినా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కొత్త రాష్ర్టం ఏర్పడింది. కాబట్టి ఏనాటికైనా ఉద్యోగులూ, అధికారులూ, మంత్రివర్గం అందరు కొత్తగా ఏర్పడే రాజధానికి తరలిపోవాల్సిందే. మరి, చెట్లకిందయినా పనిచెయ్యడానికి సిద్ధ పడ్డ ఉద్యోగులు, ఇప్పుడే వెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? తొందరేం లేదన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రెండేళ్లు గడవక ముందే తాత్కాలిక రాజధానికి రావాల్సిందేనని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ముఖ్యమంత్రి తన అభినందన సభలో చేసిన వ్యాఖ్యల మేరకు అప్పుడు ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజల ముంగిట్లో పరిపాలన ఉండడం న్యాయమే. ఉద్యోగులూ, అధికారులూ రాష్ట్రానికి దూరంగా ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుంటే తమ అవసరాల కోసం ప్రజలు సచివాలయాన్ని వెతుక్కుంటూ ఏ శ్రీకాకుళం నుంచో, అనంతపురం నుంచో, నెల్లూరు నుంచో రావాల్సిన అగత్యం ఉండకూడదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నడి మధ్యనే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన సాగాలి. అయితే దానికి అవసరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 27 నాటికి ఉద్యోగులంతా తరలి రావాల్సిందేనని చెబుతూ, ‘ఇంకా ఏం సౌకర్యాలు కావాలి? టాయిలెట్స్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. పని చేసుకోడానికి ఇంకా ఏం కావాలి?’ అని విసుక్కున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి పోయి, సర్వీస్‌లో ఆదా చేసుకున్న డబ్బుతో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుని, పిల్లల్ని చదివించుకుంటూ కుదురుగా కాలం వెళ్లబుచ్చుతున్న ఉద్యోగులను ఉన్నఫళంగా టాయిలెట్లూ, క్యాంటీన్లూ చూపించి తరలి రమ్మంటే ప్రభుత్వం ఎంత యాంత్రికంగా ఆలోచిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మాన సికంగా ఒక బంధం ఏర్పడి ఉంటుంది, అది తెంచుకుని వెళ్లాలి. తప్పదు, కాబట్టి సిద్ధపడతారు. కానీ అటువంటి వారిని ఒకరినో ఇద్దరినో కాదు, వందలూ వేల సంఖ్యలో తరలిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగా మానవీయ కోణం నుంచి సమస్యను చూడాలి? సచివాలయ ఉద్యోగులూ, వివిధ శాఖల ఉద్యోగులూ నూతన రాజధానికి వెళ్లబోమని ఎప్పుడూ అనలేదు. ఒకటికి పదిసార్లు ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ తాము వెంటనే తరలి వెళ్లమంటే ఎదురయ్యే ఇబ్బందులను గురించి విన్నవించుకున్నారు. అయినా ఎట్టి పరిస్థితులలో జూన్ 27కు వెళ్లాల్సిందే అన్నది ఈ పూటకు కచ్చితంగా చెబుతున్న మాట. రాజధాని ఇక్కట్లు నాడూ-నేడూ ‘‘ఉమ్మడి మద్రాస్ రాష్ర్టం నుంచి విడిపోయి కర్నూలును రాజధానిని చేసుకున్ననాడూ, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్‌కు తరలించిననాడూ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆ నగరాలకు తరలి వెళ్లడానికి పెద్దగా బాధపడలేదు. కర్నూలులో ఏ సౌకర్యాలూ లేకపోయినా గుడారాలలో కూడా పనిచేశారు. హైదరాబాద్‌కు తరలివచ్చినప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ విలీనాన్ని ఇష్టపడని ఆనాటి హైదరాబాదీలు నిర సించినా, ఛీత్కరించినా బాధ పడలేదు, పనిచేశాం!’’ అని కర్నూలు నుంచి జీప్‌లో టైప్రైటర్లు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించిన తొలి బృందంలోని ఒక రిటైర్డ్ అధికారి అఖ్తర్ హుస్సేన్ చెబుతూ ఉంటారు. ఉద్యోగులు కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సి రావడం ఇది మూడోసారి. కానీ ఇవాళ్టి పరిస్థితి మొదటి రెండుసార్లు ఎదురైనటు వంటిది కాదు. దీర్ఘకాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం వారు బలవంతంగానే అయినా విడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉద్యో గులు రాష్ర్ట విభజనను వ్యతిరేకించారు. అటువంటి ఉద్యోగులను తరలి స్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిం చాలి తప్ప, ‘వస్తారా చస్తారా’ అన్న పద్ధతిలో వ్యవహరించడం అన్యాయం. ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్ర బాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందు లోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని ఉద్యోగులకు ఉద్బోధిస్తారు ముఖ్యమంత్రి. అద్దెలు తగ్గించి ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్య మంత్రి. తమ సామాజికవర్గం వారో, బంధువులో, మిత్రుల విష యానికో వచ్చేసరికి మాత్రం రాజధాని చుట్టూ భూముల బాగోతం గురించి ప్రశ్నిస్తే మా వాళ్లు వ్యాపారాలు చేసుకోవద్దా అని ఆగ్రహం ప్రదర్శిస్తారు. మరి విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఇంటి యజమానులు మాత్రం డబ్బు సంపాదించుకోవద్దా? ఉద్యోగులు కొత్త చోటికి వెళుతున్నప్పుడు అద నపు ఆదాయాన్ని ఆశించడం తప్పా? ఖరీదైన బస్సులో బస చేసి, ప్రత్యేక విమానాలలో ప్రయాణించి, తాత్కాలిక కార్యాలయాలకు వందల కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో నీతులు వల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు ఎందుకు? పదేళ్లపాటు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించే వీలు ఉండి కూడా హడావుడిగా విజయవాడకు 20 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న రెండు అంతస్తుల తాత్కాలిక భవంతికి వచ్చి పనిచేయవలసిందేనని ఉద్యోగులను ఎందుకు శాసిస్తున్నారు? ఓటుకు కోట్లు వ్యవహారంలో శృంగభంగమయ్యాక ముఖ్య మంత్రిలో ఈ మార్పు వచ్చిందనేది బహిరంగ రహస్యం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కూడా హైదరాబాద్ ఉమ్మడి శాసనసభా ప్రాంగణంలో కాకుండా విజయవాడకు మార్చాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుని కాదనిపించుకోవడం కూడా అధికార పక్షం దురుద్దేశానికి నిదర్శనమనే విమర్శ వచ్చింది. రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే ఒక వెయ్యీ 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఆ డబ్బు వెలగపూడిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఖర్చు చేసింది. మరి శాశ్వత రాజధానికి మళ్లీ నిధులు ఎట్లా? పైగా కొండవీటి వాగు పొంగితే ఈ తాత్కాలిక సచివాలయ సముదాయం రెండు అంతస్తుల భవంతి మునిగిపోతుందని వెలగపూడి గ్రామం చుట్టుపక్కల గోచీ పెట్టుకుని గోళీలు ఆడుకుంటున్న చిన్నపిల్లలు కూడా చెబుతున్నారు. ఏదో విధంగా ఉద్యో గులను తరలించాల్సిందే అన్న పట్టుదల తప్ప ప్రభుత్వానికి ఇవేం పట్టవా? హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచి వాలయ భాగాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించవలసిందిగా అధికారు లను ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఒక కొలిక్కి రాలేదు. అక్కడికి వెళ్లి పనిచెయ్యడానికి ఇంకా ఉద్యోగులు మానసికంగా సిద్ధం కాలేదు. పరిష్కరించాల్సిన సమస్యలు బోలెడు ఉన్నాయి. నేను త్యాగాలు చేస్తున్నాను అని తన మీద తానే జాలి పడటం(సెల్ఫ్పిటీ) మానేసి, ముఖ్యమంత్రి వ్యవహర్త లాగా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com