
సచివాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతు శివకోటేశ్వరరావు నుంచి ఫ్లెక్సీని బలవంతంగా తీసుకుంటున్న పోలీసులు
సాక్షి, అమరావతి/సచివాలయం(తుళ్లూరురూరల్): తమ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి వేరొకరికి కట్టబెట్టిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. కృష్ణా జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన కొమ్మినేని శివకోటేశ్వరరావుకు వీర్లుపాడు మండలం జుజ్జూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 245లో 0.56 ఎకరాలు, సర్వే నంబర్ 246లో 2.06 ఎకరాల భూమి ఉంది. శివకోటేశ్వరరావు భార్య కొమ్మినేని పద్మావతికి ఆమె తండ్రి కాపా సీతారామయ్య పసుపు, కుంకుమ కింద ఈ భూమి ఇచ్చారు.
1980 నుంచి ఆ భూమిపై అడంగళ్, 1బీ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వ హక్కులు ఆమె పేరు మీదనే ఉన్నాయి. అప్పటి తహసీల్దార్ భూమిపై హక్కుదారునిగా ధ్రువీకరించిన పత్రాలు కూడా రైతు వద్ద ఉన్నాయి. దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా.. పద్మావతి పేరు మీద భూమి ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. గతేడాది అడంగళ్, 1బీ రికార్డుల్లో పద్మావతి పేరు మీద ఉన్న రికార్డులు దిద్ది.. మరొకరికి సదరు భూమిని బదలాయించారు. దీనిపై ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని రైతు శివకోటేశ్వరరావు వాపోయాడు. కలెక్టర్ ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు పంపారని రైతు ఆరోపిస్తున్నాడు.
సచివాలయం ఎదుటే ఆత్మహత్య
రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి నూతన విధానాలు తీసుకొచ్చామని మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది సామాన్య ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదు. రెండు సంవత్సరాలుగా నా భూమి కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. రికార్డుల తారుమారుకు బాధ్యురాలైన తహసీల్దార్ రాజకుమారిపై చర్యలు తీసుకోవాలి. నా సమస్యను వారం రోజుల్లో పరిష్కరించకుంటే సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటాను.
–కొమ్మినేని శివకోటేశ్వరరావు, రైతు
Comments
Please login to add a commentAdd a comment