ఇలాగైతే తెలంగాణ గెలిచేనా? | Dateline Hyderabad | Sakshi
Sakshi News home page

ఇలాగైతే తెలంగాణ గెలిచేనా?

Published Wed, Mar 18 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

దేవులపల్లి అమర్

దేవులపల్లి అమర్

 డేట్‌లైన్ హైదరాబాద్
ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలమున్నా ఇతర పార్టీల సభ్యులను చేర్చుకుని టీఆర్‌ఎస్ ఏర్పరచినది సంకీర్ణ ప్రభుత్వమే. ఇప్పుడున్నది టీఆర్‌ఎస్, బీఎస్‌పీ, టీడీపీల ప్రభుత్వం. కాదంటే టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. బీఎస్‌పీకి చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్పలిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అయినా బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయం కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలుస్తుంది. లేకపోతే ఓడిపోతుంది.
 
 తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం నాడు ఒక సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టు గా పనిచెయ్యాలి అన్నారు. ఇవి పైకి వినిపించేట్టుగా మాట్లాడిన మాటలు. ఆయనను సన్నిహితంగా గమనిస్తున్న వారికి ఆ మాటల అంతరార్థం మరోలా స్ఫురించింది.  రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కలసి పనిచే యడమంటే అందరూ టీఆర్‌ఎస్‌లో కలసిపోవడమేనని. వివిధ రాజకీయ పక్షాల నేతలంతా తమ తమ రాజకీయ అభిప్రాయాలూ, సిద్ధాంతాలూ ఒదిలేసి, వరుసలో నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత గులాబీ కండువా కప్పించు కుని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవడమే తెలంగాణను అభివృద్ధి చేయడమని ప్రస్తుతార్థం. రాజకీయాల్లో పార్టీలు మారడం వింతేమీ కాదు. అలాంటప్పుడు ఒక్క టీఆర్‌ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు విమర్శించాలని ఎవరైనా అనొచ్చు. నిజమే, ఈ రుగ్మత ఒక్క తెలంగాణకే పరిమితమైనది కాదు. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ తరహా నీతి బాహ్యమైన వ్యవహారాన్ని ప్రోత్సహించడం లేదు. సందర్భాన్ని బట్టి అందరి గురించీ మాట్లాడుకోవాల్సిందే. అవతల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. ఆయన ప్రయ త్నాలు ఆయనా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం ఎంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నదో ఇప్పుడు జరుగుతున్న ఆ రాష్ట్ర శాసనసభా సమావేశాల తీరే చెబుతుంది. అయితే అక్కడి అధికార పార్టీ, టీఆర్‌ఎస్ స్థాయిలో ఫిరాయింపులను విజయవంతం చేసుకోలేకపోతు న్నది. దానికి ప్రధాన కారణం ఏపీలో ప్రతిపక్షం బలంగా ఉన్నది, ఒక్క మాట మీద నిలబడి ఉన్నది. కాగా తెలంగాణలో ప్రతిపక్షం పరిస్థితి అగమ్య గోచరంగా, అయోమయంగా ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు నాయక త్వంలో టీఆర్‌ఎస్ ఏం చేసినా ప్రస్తుతానికి చెల్లిపోతున్నది.

 గెలుపునకు అర్థం ఫిరాయింపులేనా?
 రాష్ట్ర విభజన తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పా టు చెయ్యడానికి అవసరమైనన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌కు లభించాయి. అయినా ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంత మంది శాసన సభ్యులను తమ వైపు లాక్కున్నారు. తమకు అస్సలే బలంలేని శాసన మండలిలో ఏకంగా 14 మంది ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను చేర్చుకుని, మండలి చైర్మన్ స్థానాన్నే కైవసం చేసుకున్నారు. ఇవన్నీ మళ్లీ ఎందుకు గుర్త్తు చెయ్యడమంటే, సోమవారం ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా అన్నారు... రాజకీయాలకు ఇది సమయం కాదు, ప్రపంచం ఎదుట తెలంగాణను గెలిపించాలని. నిజమే ఆరు దశాబ్దాల పోరాటం తరవాత సాధించుకున్న రాష్ట్రం కాబట్టి తెలంగా ణను అందరూ కలసి గెలిపించుకోవలసిందే. కానీ ప్రపంచం ముందు తెలం గాణ ఎప్పుడు గెలుస్తుంది? ఎట్లా గెలుస్తుంది? రాజకీయాలను కలగాపులగం చేసి, నీతిబాహ్యమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే గెలుస్త్తుందా? అధి కార పార్టీ అభిప్రాయం తప్ప మరే రాజకీయ అభిప్రాయం వినిపించకుండా చేసేస్తే తెలంగాణ గెలిచినట్టేనా? తెలంగాణ గెలవడమంటే చట్టవిరుద్ధంగా ఇతర పార్టీలను తమలో కలిపేసుకోవడమేనా? తెలంగాణ, ఏం చేస్తే ప్రపం చం ముందు గెలుస్త్తుందో, ఏం చెయ్యకపోతే ఓడిపోతుందో, నవ్వుల పాలవు తుందో బిగ్గరగా మాట్లాడుకోవాల్సిన సమయమిది. ఇప్పుడు మౌనం వహిం చడమంటే ప్రపంచం ముందు తెలంగాణ ఓడిపోవడానికి కారణం కావడమే. హోల్‌సేల్ ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ శాసన మండలి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంది సరే. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనని కాసేపు సరి పెట్టుకుందాం. గత వారం శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాస నమండలి ఒక బులెటిన్ విడుదల చేసింది. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ ఎస్‌లో విలీనమైందని తెలిపింది. కానీ ఇంకా మండలి సభ్యులు ఇద్దరు టీడీపీ లోనే కొనసాగుతున్నారు. పోనీ టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురైనా తామే మెజా రిటీ కాబట్టి లెజిస్లేచర్ పార్టీ మాదేనని ప్రకటించుకున్నారా? లేదు. అధికార పక్షం పంచన చేరి, గులాబీ కండువాలు కప్పించుకు కూర్చున్నారంతే. అలాంటప్పుడు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ అధికార పార్టీలో విలీనమైనట్టు మం డలి అధ్యక్షులు ఎలా ప్రకటిస్తారు? ఒక పార్టీ మొత్తంగా ఇంకో పార్టీలో చేరా లంటే ఒక చట్టపరమైన తతంగం ఉంటుంది. శాసన మండలిలోని ఆ పార్టీ సభ్యులు నిర్ణయించుకుంటే సరిపోదు. పార్టీ విలీనానికి నిర్ణయం తీసుకుని సదరు రాజకీయ పార్టీయే స్వయంగా ఎన్నికల సంఘానికి రాయాలి. దాని అనుమతి పొందిన తర్వాత విలీనం చేసుకోవచ్చు. ఇక్కడ అదేమీ జరగలేదు. మండలి చైర్మన్ ఒక బులెటిన్‌ను విడుదల చేసి చేతులు దులుపుకున్నారంతే. ఇటువంటి చర్య ప్రపంచం ముందు తెలంగాణను గెలిపిస్తుందా?

 ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదా?
 ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని శాసనసభ స్థానాలున్నా ఇతర పార్టీల శాసన సభ్యులను చేర్చుకుని టీఆర్‌ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవును, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే. టీఆర్‌ఎస్, బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. కాదని ఖండిస్తే టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీని వాస్ యాదవ్ చేత శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి మళ్లీ గెలిపిం చుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బహుజన సమాజ్ పార్టీ తరఫున గెలి చిన మరో సభ్యుడు కోనప్ప కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి మొత్తం ఆ పార్టీ విలీనమైందని వాదించవచ్చు. కానీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చెయ్యడానికి బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయ సమ్మతమూ, నైతిక విజ్ఞత కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన రాజకీయ బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలు స్తుంది. లేకపోతే ఓడిపోతుంది. కడియం శ్రీహరిని వరంగల్ ప్రజలు పార్ల మెంటుకు గెలిపించి పంపితే, ఆయనను రాష్ట్ర మంత్రిని చేశారు. ఆరు నెలల దాకా ఆయన ఏ సభ నుంచీ ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. కానీ పార్లమెంటుకు రాజీనామా ఎందుకు చేయించరు? దీన్ని ప్రపం చం హర్షిస్తుందా? ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్చుకున్న శాసనసభ, శాసన మండలి సభ్యులందరి చేతా రాజీనామాలు చేయించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి వారిని గెలిపించుకుంటేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలిచేది. లేకపోతే దివాలాకోరు రాజకీయాలకు బలై ఓడిపోతుంది.

 నవ్వులపాలు చేస్తారా? తలెత్తి నిలిచేలా ప్రవర్తిస్తారా?
 ఒక దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఏ వివరణా ఇవ్వ కుండా తొలగించి మాసాలు గడుస్తున్నాయి. కనీస విచారణ లేకుండా, ప్రజ లకు వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం వహిస్తే ప్రపంచం ముందు తెలంగాణ గెలవదు. మాజీ ఉప ముఖ్యమంత్రిపై వచ్చిన అవే ఆరోపణలు మరో మంత్రి మీదా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ముఖ్యమంత్రికి పట్టదు. ఆ మంత్రి అగ్రకులస్తుడు, తమ సింహాసనాలకే ఎసరు పెట్టగలిగిన వర్గాల నాయకుడు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కూడా ప్రపంచం ముందు తెలంగాణను గెలిపించదు. ఆరోపణలను విచారించి నిజాలు నిగ్గుదేల్చి ఆ మంత్రి పులు కడిగిన ముత్యం అని తేల్చినప్పుడు తెలంగాణ గెలుస్తుంది.
 తెలంగాణలో టీఆర్‌ఎస్ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ అస్తిత్వంలో ఉండ కూడదన్న ఆలోచన తెలంగాణను ప్రపంచం ముందు గెలిపించదు. నవ్వుల పాలు చేస్తుంది. తెలంగాణలో ప్రతిపక్షం మొత్తంగా నాయకత్వ లోపంతో నానాటికీ బలహీన పడటంవల్ల కూడా అధికార పార్టీ ఇలా ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం కలిగింది. శాసనసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఒకే రకమైన గందరగోళ స్థితిలో ఉన్నాయి. శాసనసభ నుంచి బహి ష్కృతులైన టీడీపీ సభ్యులు ఏకంగా భారత రాష్ట్రపతికి మొరపెట్టుకోడానికి వెళ్లడాన్ని అంతా వింతగా చెప్పుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ దాష్టీ కాన్ని సమర్థవంతంగా ఎండగట్టలేని దుర్బలత్వం వారిది. పొరుగు రాష్ట్రం లోని అధినాయకుడి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన స్థితిలోని ఆ పార్టీ అంత కంటే బలంగా పోరాడగలదని ఎవరు మాత్రం భావించగలరు? ఇక కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే తలో దారి అన్నట్టు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడిది ఒక దారైతే, ఆయన పార్టీ శాసన సభ్యులది మరో దారి. వీళ్ల దారులు ఎప్పటికీ ఒక్కటి కావు.

 అధికార పక్షం ఒక్కటే ఉంటే సరిపోదు, బలమైన ప్రతిపక్షం ఉంటేనే తెలంగాణ గెలుస్తుంది. నీతివంతమైన రాజకీయాలే తెలంగాణను ప్రపంచం ముందు తలెత్తుకు నిలిచేలా చేస్తాయని గుర్తించాలి.
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement