
సూళ్లూరుపేట: సహజసిద్ధంగా ఏర్పడి ప్రకృతి వరప్రసాదమైన పులికాట్ సరస్సును ఇప్పుడు రొయ్యల సాగు రూపంలో కాలుష్య భూతం కాటేస్తోంది. ఒకనాడు అందాల తీరంగా పడవ ప్రయాణాలతో అలరారిన ఈ సరస్సు.. ఇప్పుడు తమిళనాడులో విచ్చలవిడిగా సాగిస్తున్న రొయ్యల సాగుతో దెబ్బతింటోంది. ఫలితంగా మత్స్య సంపద నశిస్తుండగా.. మత్స్యకారులు ఉపాథి లేకుండాపోతున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఆంధ్రా పరిధిలో 500 చ.కి.మీటర్లలో.. తమిళనాడులో 120 చ.కి.మీటర్ల పరిధిలో ఉంది. దీనికి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉంటుంది. దీని పరిధిలో ఎక్కడా రొయ్యలు సాగు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలవుతుండగా.. తమిళనాడులో పట్టించు కునే దిక్కులేదు. దీంతో ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు గ్రామానికి సమీపంలోని తమిళనాడు భూభాగంలో సుమారు 100 ఎకరాలకు పైగా అక్కడి వ్యాపారులు రొయ్యల సాగుచేస్తున్నారు.
ఇందులో నుంచి వచ్చే వ్యర్థ జలాలన్నీ పులికాట్ సరస్సులో నేరుగా వదిలేస్తున్నారు. అంతేకాదు.. పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగ చట్టాన్ని సైతం అతిక్రమించి సున్నపుగుల్ల కంపెనీలను ఏర్పాటుచేశారు. సున్నాంబుగోళం కేంద్రంగా సరస్సు గర్భంలో లభించే సున్నపుగుల్లను తీసేసి తరలిస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వారు పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దులో రొయ్యల సాగుచేస్తూ అందులో నుంచి వచ్చే విషపూరిత వ్యర్థ జలాలు ఆంధ్రా ప్రాంతం సరిహద్దులో కలుస్తున్నాయి. దీనిపై సూళ్లూరుపేట వైల్డ్‌లైఫ్ అధికారులూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తు న్నారు. ఈ వ్యర్థ జలాలవల్ల సరస్సులోని మత్స్య సంపదకు ప్రమాదం వాటిల్లుతోంది. ఫలితంగా ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 10వేల మందికి పైగా ఆంధ్రా మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది.
తగ్గిన చేపల ఉత్పత్తి
పులికాట్ సరస్సులో 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ వస్తోంది. 2001 వరకు సుమారు 3 వేల టన్నులు చేపలు పట్టేవారు. కానీ, నేడు కేవలం రెండు వేల టన్నుల చేపలు మాత్రమే దొరుకుతున్నట్టు జాలర్లు చెబుతున్నారు.
పక్షుల పండుగకే పరిమితం
ఇదిలా ఉంటే.. పక్షుల పేరుతో ఫ్లెమింగో ఫెస్టి వల్‌ను 16ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా జరిగే పక్షుల పండుగను 2013 టూరి జం క్యాలెండర్‌లో చేర్చారు. 2014లో స్టేట్ మెగా ఫెస్టివల్‌గా మార్చారు. కేవలం సాం స్కృతిక కార్యక్రమాలతో రూ.కోట్లు ఖర్చుచేసి సరిపెట్టే స్తున్నారు కానీ, పక్షులు నివసించేం దుకు చెట్లు పెంచడం, సరస్సులో నీళ్లు ఎప్పు డూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయిం చడం వంటి పనులకు మాత్రం అడుగులు పడటంలేదు. ఈ ఏడాది కూడా పండుగ నిర్వహణకు రూ.3 కోట్లు, పలు అభివృద్ధి పనులు పేరుతో మరో రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని సరస్సు అభివృద్ధికి ఖర్చుచేసి వుంటే బాగుండేదని పర్యాటక ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
సరస్సు అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేయాలి
రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉండటమే పులికాట్ చేసుకున్న పాపం. ఆ సరిహద్దుల విషయమే ఇప్పటికీ తేల్చలేదు. ఈ రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా దీని అభివృద్ధికి కృషి చేయకపోవడంవల్లే జాలర్లు కూడా తరచూ ఘర్షణ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పులికాట్ లేక్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేయాలి.
– గరిక ఈశ్వరయ్య, పర్యావరణవేత్త
పులికాట్‌కు రొయ్య కాటు
Comments
Please login to add a commentAdd a comment