ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన పులికాట్ సరస్సు ప్రమాదపుటంచులో ఉంది. సరస్సు గర్భంలో సహజసిద్ధంగా ఉన్న సున్నపు గుల్ల, వానపాములను ఇబ్బడి ముబ్బడిగా తవ్వేయడంతో భవిష్యత్తులో సరస్సు ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
సూళ్లూరుపేట : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు తీరప్రాంత గ్రామాల్లోని కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సున్నపుగుల్ల తీసేయడం వల్ల సరస్సు ఉత్తరంవైపు ఎడారిని తలపిస్తోంది. మరోవైపు వానపాముల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తడమండలం వేనాడు, ఇరకం దీవుల చుట్టూ గుల్ల, వానపాములను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం దురదృష్టకరం. దీనికి తోడు కొండూరు, గ్రద్దగుంట, చేనిగుంట గ్రామాల్లోని కొందరు కాళంగినది లో కలిసేచోట ఉన్న ఇసుక దిబ్బలను తవ్వి ట్రాక్టర్లతో రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు.
వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు..
వేనాడు ఇరకం దీవుల్లోని కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళుతున్నట్టు తెలుస్తోంది. కూలీలు తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు, ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారు. కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తున్నారు.
వీటిని హేచరీలకు తరలించి కిలో సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు తీరప్రాంతంలో నిత్యం టన్నుల కొద్దీ సున్నపుగుల్లను తీసేసి సరస్సును గుల్ల చేస్తున్నారు. దీంతో మత్స్యసంపద తగ్గిపోవడం, సరస్సు గుంతల గుంతలుగా మారి ఎడారిగా మారుతోంది. తమిళనాడులోని కవరైపేటై నియోజకవర్గం పరిధిలోని సున్నాంబుగోళం (సున్నపుగుంట) గ్రామం వద్ద సరస్సుకు అతి దగ్గరలో నాలుగైదు సున్నపు గుల్ల కంపెనీలున్నాయి.
వాస్తవంగా పులికాట్ సరస్సుకు వందమీటర్ల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు, హోటళ్లు, రిసార్ట్స్ లాంటివి ఉండకూడదని చట్టం ఉంది. ఈ చట్టాన్ని తుంగలోతొక్కి తమిళనాడులో ఇప్పటికీ సున్నపుగుల్ల కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ విభాగం కిందిస్థాయి సిబ్బందికి నెల మామూళ్లు అందుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్ సరస్సును భవిష్యత్తు తరాల వారికి మ్యాప్‌లో చూపించాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదు.
దాడులేవీ..?
పులికాట్ సరస్సును అన్ని రకాలుగా కుళ్లబొడిచేస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు పులికాట్‌లో జరిగే అక్రమాలను కూడా సొమ్ముచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. పులికాట్ సరస్సు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అందిన కాడికి దండుకుని వారు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. దాడుల విషయమై అధికారులను అడిగితే సిబ్బంది కొరత కారణంగా దాడులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు.
ప్రమాదపుటంచున పులికాట్
Published Mon, May 18 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement