ఫ్లెమింగోలు ఎంత పిరికివో!
అరణ్యం
ఫ్లెమింగోలు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరోప్‌లలో వీటి సంఖ్య అధికం!
ఫ్లెమింగోలు పుట్టినప్పుడు బూడిదరంగులో ఉంటాయి. కానీ వాతావరణంలోని మార్పులు, కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వంటి కారణాల వల్ల వాటి శరీరం ముదురు ఆరెంజ్, గులాబి రంగుల్లోకి మారుతుంది!
ఇవి నీటిలో ఎప్పుడూ ఒంటికాలి మీదే నిలబడతాయి. ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల తమ శరీరంలోని ఉష్ణత బయటకు పోకూడదని అలా చేస్తాయి!
ఇవి అద్భుతంగా ఈత కొడతాయి. కాకపోతే నీరు బాగా లోతుగా ఉండాలి. లేదంటే ఈదలేవు. కానీ ఎగరడంలో ఇవి దిట్టలు. గంటకు ముప్ఫై అయిదు కిలోమీటర్లు ఎగరగలవు!
ఫ్లెమింగోల గుంపును ఫ్లాక్ అంటారు. ఎప్పుడూ గుంపులు గుంపులుగానే ఉంటాయి. దానికి కారణం... భయమే. ఇవి నీటిలో వేటాడేటప్పుడు గంటలపాటు తమ తలను నీటిలోపల పెట్టి ఉంచుతాయి. ఆ సమయంలో శత్రువులు దాడి చేస్తుంటాయి. అందుకే కొన్ని వేటాడుతూ ఉంటే, కొన్ని కాపలా కాస్తుంటాయి!
ఇవి చాలా పిరికివి. ఇవి శత్రువులతో పోరాడవు, పోరాడలేవు. భయంతో ఎగిరిపోయి తమను తాము కాపాడుకుంటాయి... అంతే!
వీటి మెడ నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. పొడవుగా, పాములాగా ఉండే ఈ మెడలో మొత్తం 19 ఎముకలు ఉంటాయి!
ఆడ ఫ్లెమింగోలు సంవత్సరానికి ఒకే ఒక్క గుడ్డు పెడతాయి. పొరపాటున ఈ గుడ్డుకు ఏదైనా అయినా కూడా మరో గుడ్డు పెట్టేందుకు ప్రయత్నించవు!
వీటికి పరిశుభ్రత చాలా ఎక్కువ. రోజులో ఎక్కువభాగం ఇవి తమ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికే ఉపయోగిస్తాయి!
ఇవి తమ కాళ్లను వెనక్కి మడిచి, మనుషుల మాదిరి మోకాళ్ల మీద కూర్చోగలవట!
మూగజీవే... కానీ మనసున్న జీవి!
మే 18, 2003. యూకే.
ఓ నది ఒడ్డున షెరిల్ స్మిత్ తన వీల్ చెయిర్‌లో కూర్చుని ఉంది. సాయంత్రపు చల్లదనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఓర్కా అటూ ఇటూ పరుగులు తీస్తూ అల్లరి చేస్తోంది. దాని తుంటరి వేషాలు చూస్తూ నవ్వుతోంది షెరిల్. తన వీల్ చెయిర్‌ని అటూ ఇటూ తిప్పుతూ ఓర్కాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన. షెరిల్ వీల్ చెయిర్ చక్రం బలంగా ఓ రాయిని ఢీకొని పట్టు తప్పింది. షెరిల్ అంతెత్తున ఎగిరి నదిలోకి పడిపోయింది. ఈదలేదు. నీరు చల్లగా గడ్డ కట్టించేలా ఉంది. అందులోనే కొట్టుమిట్టాడసాగింది షెరిల్. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుణ్ను అనుకుంది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక తన పని అయిపోయింది అనుకుంది.
కానీ ఆమెనలా చూసిన ఓర్కా
ఆగలేకపోయింది. పరుగు పరుగున వెళ్లింది.
ఆ చుట్టుపక్కలంతా తిరిగింది. ఆ దారిన పోతున్న ఓ వ్యక్తిని అడ్డగించింది. అతడి ప్యాంటు పట్టుకుని లాగి, తనతో రమ్మంటూ మారాం చేసింది. ఏదో జరిగిందని అర్థమై ఆ వ్యక్తి దాన్ని అనుసరించాడు. ప్రమాదం నుంచి షెరిల్‌ని కాపాడాడు. తన జీవితం ఓర్కా పెట్టిన భిక్ష అని ఇప్పటికీ అంటూ ఉంటుంది షెరిల్!