సాక్షి ప్రతినిధి, నెల్లూరు, సూళ్లూరుపేట: ఆంధ్రా, తమిళనాడుల్లో విస్తరించిన పులికాట్ సరస్సు సహజసిద్ధంగా ఏర్పడింది. వేసవికి ముందే ఏటా ఈ సరస్సు ఎండిపోతోంది. పాలకులు పులికాట్ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. మార్చికే ఉత్తరంవైపు సరస్సు ఎడారిలా మారింది. ముఖద్వారాలు పూడికతో మూసుకుపోవడంతో సరస్సు ఎడారిగా మారి జాలర్లకు జీవనోపాధి తగ్గిపోయింది. కాగా, తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జలకళతో ఉట్టిపడుతోంది. తమిళనాడు ఏటా రూ.30 లక్షలు కేటాయించి పల్‌వేరికాడ్ ముఖద్వారంలో వేసవిలో ఇసుకమేటలు తొలగించి పూడిక తీయిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ ప్రభుత్వానికి లేకుండా పోయింది.
పూడిపోయిన ముఖద్వారాలు
మన రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల పరిధిలో పులికాట్ సరస్సు సుమారు 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వ్యాపించింది. మిగిలిన 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలూకా పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పల్‌వేరికాడ్ వద్ద ఒక ముఖద్వారం, నెల్లూరు జిల్లా వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ఒక్కో ముఖద్వారం ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉ«ధృతి పెరిగినప్పుడు ఉప్పునీరు పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో మంచినీరు, ఉప్పునీరు కలగలసి సరస్సు నిండుకుండలా ఉంటుంది. వేసవి కాలంలో సముద్రం నుంచి ఉన్న ముఖద్వారాల గుండా ఉప్పునీరు మాత్రమే సరస్సుకు చేరుతుంది. దక్షిణం వైపు పల్‌వేరికాడ్ ముఖద్వారంలో తమిళనాడు ఏటా వేసవిలో పూడిక తీయిస్తుండటంతో ఆ వైపు నీళ్లు ఉంటున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం పూడికతో ఇసుక మేటలు పడి మూసుకుపోయింది. పూడిక తీయిస్తే ఈ వైపు కూడా ఎప్పుడూ నీళ్లు ఉండి, మత్స్యసంపద చేరి జాలర్లకు జీవనోపాధి కలుగుతుంది.
ముఖద్వారాల పూడికతీత పనులు జరిగేనా!
తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలను పూడిక తీయించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లుతో అంచనాలు రూపొందించి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీనికి సుమారు రూ.10 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని, మొదట విడతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు అందాయి. తర్వాత దుగరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక విషయం మసకబారింది. అప్పటి ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించి ఉంటే ఈ పాటికి సరస్సు కళకళలాడుతూ కనిపించేదేమో! ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కారణం.. దుగరాజపట్నం ఓడరేవుకు ముడిపెట్టి ముఖద్వారాల పనులను గాలికి వదిలేశారు. చివరకు అటు ఓడరేవు లేదు.. ఇటు ముఖద్వారాల పూడికతీతకు మంజూరుచేసిన నిధులూ మురిగిపోయాయి. ఇదిలా ఉండగా పూడికతీత పనులకు రూ.48 కోట్లు కేటాయిస్తున్నానని ఈ ఏడాది జనవరిలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిధులు మంజూరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment