
రావణకాష్టం
♦ పులికాట్ సరిహద్దుల్లో మరోమారు సరిహద్దుల వివాదం
♦ కత్తులు దూస్తున్న ఇరు రాష్ట్రాల జాలర్లు
♦ పట్టించుకోని ప్రభుత్వాలు
సూళ్లూరుపేట...
ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు 640 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సులో చేపలవేట సాగించే ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సరిహద్దుల వివాదంతో కక్షలు పెంచుకుంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య తరచూ సరిహద్దుల వివాదం పదే పదే తలెత్తడానికి రెండు రాష్ర్ట ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో సరస్సులో నీటిమట్టం తగ్గినపుడల్లా ఈ వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
తమిళనాడులోని పెద్ద మాంగోడు, చిన్నమాంగోడు, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు ఈ సరిహద్దు వివాదానికి కారకులవుతున్నారు. సరస్సుకు ఉత్తరంవైపు మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణంవైపు సరస్సుకు వేటకు వెళుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ఏరియాలో మత్స్యసంపద దొరుకుతుండడంతో అక్కడికి వెళుతున్నారు. ఆ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని పైన తెలిపిన మూడు కుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. వాళ్లకు వాళ్లే సరస్సులో తాటిచెట్లు గుర్తులుగా నాటి హద్దు దాటకూడదని నిబంధనలు విధిస్తున్నారు.
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని నెల్లూరుజిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 600 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్ విస్తరించి ఉంది. పులికాట్‌లో 16 దీవిగ్రామాలు, 30 తీరప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 కుప్పాలకు చెందిన 20 వేల మందికి పైగా చేపలవేటే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో పది వేల మంది గిరిజనులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపలవేట తప్ప మిగిలిన ఏ పని చేయలేని జాలర్లు గత 30 ఏళ్ల నుంచి ప్రతి ఏటా సరిహద్దు వివాదాలతో జీవనం కోల్పోతున్నారు.
సరిహద్దు సమస్య తీరేనా..?
1989 నుంచి సరిహద్దు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల జాలర్లు భారీ దాడులు చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులతో సర్వే చేయించాలని ఇక్కడ జాలర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. 1994లో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో సర్వే ఆగిపోయింది. 2007లో రాష్ట్ర మత్స్యశాఖామంత్రి మండలి బుద్ధప్రసాద్, తమిళనాడు మత్య్సశాఖ మంత్రి కేపీపీ స్వామిలతో రెండు రాష్ట్రాల మత్స్యశాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలు విఫలమవడంతో సమస్య ప్రతి ఏటా ఉత్పన్నమవుతూనే ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే మినహా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.