‘హద్దు’ దాటిన వివాదం | tamilnadu fishermans attack on ap fishermans | Sakshi
Sakshi News home page

‘హద్దు’ దాటిన వివాదం

Published Tue, Jan 23 2018 11:11 AM | Last Updated on Tue, Jan 23 2018 11:11 AM

tamilnadu fishermans attack on ap fishermans - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,సూళ్లూరుపేట : పులికాట్‌ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆంధ్రా మత్స్యకారుల నోటికాడ కూడును ఏటా తమిళనాడు జాలర్లు తన్నుకుపోతున్నారు. ఇదేమని అడిగితే దాడులకు తెగబడుతున్నారు. పట్టించుకోండి మహప్రభో అంటూ ఇక్కడి మత్స్యకారులు నెత్తీనోరు బాదుకుంటూ పాలకులకు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి జిల్లాకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు చెప్పుకునేందుకు ఈ ప్రాంత మత్స్యకారులు సన్నద్ధమయ్యారు.

ఇదీ అసలు సమస్య
ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సులో చేపల వేట విషయమై రెండు రాష్ట్రాల్లోని జాలర్ల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో  స్థానిక మత్స్యకారులు తమిళ మత్స్యకారుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల మధ్య సుమారు 620 చదరపు కిలోమీటర్ల మేర పులికాట్‌ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు  నెల్లూరు జిల్లాలోను, 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో ఉంది. బంగాళాఖాతం నుంచి పులికాట్‌ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్‌ వద్ద, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ముఖద్వారాలు ఉన్నాయి. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగి, తమిళనాడులో ఆరణియార్‌ నదులతోపాటు సాముల కాలువ, దొండ కాలువ, కరిపేటి తదితర కాలువల నుంచి మంచినీరు పులికాట్‌ సరస్సులోకి చేరుతుంది.

సముద్రంలో ఆటుపోట్ల సమయంలో అలల ఉ«ధృతి పెరిగినప్పుడు అందులోని ఉప్పునీరు కూడా పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా గుర్తించారు. ఈ సరస్సుపై ఆధారపడి మన జిల్లాలో 17 గ్రామాలకు చెందిన 20 వేల మంది, తమిళనాడు వైపు 10 కుప్పాలకు చెందిన మరో 7, 8 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో పులి కాట్‌ సరస్సు నిండా నీళ్లు వచ్చినపుడు తమిళనాడు వైపు చేపలు దొరకవు. ఆ కాలంలో అక్కడి జాలర్లు సరిహద్దులు దాటి ఇక్కడకొచ్చి చేపల్లి వేటాడి వెళుతున్నారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఇక్కడి జాలర్లకు మత్స్య సంపద దొరకదు. ఆ కాలంలో తమిళనాడు వైపు వేటకు వెళ్లే ఇక్కడి మత్స్యకారుల వలలను తమిళ జాలర్లు లాక్కోవడం, పడవలు తీసుకెళ్లడం, ఘర్షణలకు దిగటం, కవ్వింపు చర్యలకు పాల్పడం చేస్తున్నారు. దీంతో ›ఏటా ఎండాకాలం ప్రారంభం కాగానే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య ఏ క్షణంలో ఎలాంటి వివాదం తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

తరచూ తప్పని వివాదాలు
పులికాట్‌ సరస్సుకున్న మూడు సముద్ర ముఖద్వారాల్లో తమిళనాడు పరిధిలో వున్న పల్‌వేరికాడ్‌ ముఖద్వారాన్ని అక్కడి ఫ్రభుత్వం ఏటా రూ.30 లక్షలు వెచ్చించి పూడిక తీయిస్తోంది. ఇదిలావుంటే.. ఆంధ్రా వైపు వాకాడు మండలం కొండూరు పాళెం వద్ద వున్న ముఖద్వారం పూర్తిగా పూడిపోయింది. రాయదొరువు ముఖద్వారం మాత్రమే అంతో ఇంతో ఆదుకుంటూ వస్తోంది. ఈ ముఖద్వారం ఎండాకాలంలో పూడిపోతుండటంతో సరస్సులో నీళ్లు లేక ఆంధ్రాకు చెందిన 17 కుప్పాల జాలర్లు దక్షిణంవైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోనే ఉండే కురివి తెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో వేటకు వెళుతుంటారు. కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాలు తమిళనాడు పరిధి లో ఉన్నాయంటూ చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాం గోడు కుప్పం, కీరపాకపుదు కుప్పానికి చెందిన వారు వాదిస్తున్నారు. ఇక్కడి జాలర్లను అటువైపు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు.  అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలల్ని ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలకు పాల్ప డుతున్నారు. దీంతో జాలర్ల కుప్పాల్లో వివాదాలు రావణ కాష్టంలా రగులుతూనే వున్నాయి.

హద్దులు తేల్చమన్నా పట్టించుకోరు
పులికాట్‌ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్ని తేల్చాల్సిందిగా మత్స్యశాఖ అధికారులు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 1989లో రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. తరువాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందనే దానిపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. శ్రీహరికోట దీవిలోని తెత్తుపేట వద్ద కొత్త ముఖద్వారాన్ని తెరిస్తే సమస్య సమసిపోతుందని జిల్లా జాలర్లు ప్రభుత్వానికి విన్నవించారు. అప్పడే కాకినాడ, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలనుంచి మత్స్యశాఖకు చెందిన శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించారు. అది కూడా కార్యరూపంలోకి రాకపోవడంతో ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఎండాకాలం సమీపిస్తుందంటే పులికాట్‌ సరస్సులో తాటి దుంగలను నాటి.. అక్కడి వరకు తమిళనాడు సరిహద్దులు ఉన్నాయంటూ అక్కడి జాలర్లు ఆంధ్రా మత్స్యకారలు రాకూడదని హెచ్చరిం చడం అనవాయితీగా మారింది. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరదు.

మహిళలపై ఆధారపడ్డాం
పులికాట్‌ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయింది. మూడు రోజుల పాటు వేట సాగించినా పూట గడవటం లేదు. ఆడవాళ్లు తమిళనాడులోని పల్‌వేరికాడ్‌ నుంచి పచ్చి చేపలు, చెన్నైనుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి మా కుటుంబాల్ని పోషిస్తున్నారు. పులికాట్‌ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట–పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం వుంది. సరస్సులో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. సోదరుల్లా మెలగాల్సిన మేం బ్రతుకుదెరువు కోసం శత్రువులుగా మారుతున్నాం.
 – కేసీ రమేష్, మత్స్యకారుడు, భీములవారిపాళెం కొత్తకుప్పం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement