Tamil Nadu fishermens
-
‘హద్దు’ దాటిన వివాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,సూళ్లూరుపేట : పులికాట్ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆంధ్రా మత్స్యకారుల నోటికాడ కూడును ఏటా తమిళనాడు జాలర్లు తన్నుకుపోతున్నారు. ఇదేమని అడిగితే దాడులకు తెగబడుతున్నారు. పట్టించుకోండి మహప్రభో అంటూ ఇక్కడి మత్స్యకారులు నెత్తీనోరు బాదుకుంటూ పాలకులకు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి జిల్లాకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకునేందుకు ఈ ప్రాంత మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. ఇదీ అసలు సమస్య ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సులో చేపల వేట విషయమై రెండు రాష్ట్రాల్లోని జాలర్ల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్థానిక మత్స్యకారులు తమిళ మత్స్యకారుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల మధ్య సుమారు 620 చదరపు కిలోమీటర్ల మేర పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లాలోను, 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో ఉంది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వద్ద, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ముఖద్వారాలు ఉన్నాయి. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగి, తమిళనాడులో ఆరణియార్ నదులతోపాటు సాముల కాలువ, దొండ కాలువ, కరిపేటి తదితర కాలువల నుంచి మంచినీరు పులికాట్ సరస్సులోకి చేరుతుంది. సముద్రంలో ఆటుపోట్ల సమయంలో అలల ఉ«ధృతి పెరిగినప్పుడు అందులోని ఉప్పునీరు కూడా పులికాట్లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా గుర్తించారు. ఈ సరస్సుపై ఆధారపడి మన జిల్లాలో 17 గ్రామాలకు చెందిన 20 వేల మంది, తమిళనాడు వైపు 10 కుప్పాలకు చెందిన మరో 7, 8 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో పులి కాట్ సరస్సు నిండా నీళ్లు వచ్చినపుడు తమిళనాడు వైపు చేపలు దొరకవు. ఆ కాలంలో అక్కడి జాలర్లు సరిహద్దులు దాటి ఇక్కడకొచ్చి చేపల్లి వేటాడి వెళుతున్నారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఇక్కడి జాలర్లకు మత్స్య సంపద దొరకదు. ఆ కాలంలో తమిళనాడు వైపు వేటకు వెళ్లే ఇక్కడి మత్స్యకారుల వలలను తమిళ జాలర్లు లాక్కోవడం, పడవలు తీసుకెళ్లడం, ఘర్షణలకు దిగటం, కవ్వింపు చర్యలకు పాల్పడం చేస్తున్నారు. దీంతో ›ఏటా ఎండాకాలం ప్రారంభం కాగానే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య ఏ క్షణంలో ఎలాంటి వివాదం తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తరచూ తప్పని వివాదాలు పులికాట్ సరస్సుకున్న మూడు సముద్ర ముఖద్వారాల్లో తమిళనాడు పరిధిలో వున్న పల్వేరికాడ్ ముఖద్వారాన్ని అక్కడి ఫ్రభుత్వం ఏటా రూ.30 లక్షలు వెచ్చించి పూడిక తీయిస్తోంది. ఇదిలావుంటే.. ఆంధ్రా వైపు వాకాడు మండలం కొండూరు పాళెం వద్ద వున్న ముఖద్వారం పూర్తిగా పూడిపోయింది. రాయదొరువు ముఖద్వారం మాత్రమే అంతో ఇంతో ఆదుకుంటూ వస్తోంది. ఈ ముఖద్వారం ఎండాకాలంలో పూడిపోతుండటంతో సరస్సులో నీళ్లు లేక ఆంధ్రాకు చెందిన 17 కుప్పాల జాలర్లు దక్షిణంవైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోనే ఉండే కురివి తెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో వేటకు వెళుతుంటారు. కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాలు తమిళనాడు పరిధి లో ఉన్నాయంటూ చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాం గోడు కుప్పం, కీరపాకపుదు కుప్పానికి చెందిన వారు వాదిస్తున్నారు. ఇక్కడి జాలర్లను అటువైపు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలల్ని ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలకు పాల్ప డుతున్నారు. దీంతో జాలర్ల కుప్పాల్లో వివాదాలు రావణ కాష్టంలా రగులుతూనే వున్నాయి. హద్దులు తేల్చమన్నా పట్టించుకోరు పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్ని తేల్చాల్సిందిగా మత్స్యశాఖ అధికారులు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 1989లో రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. తరువాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందనే దానిపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. శ్రీహరికోట దీవిలోని తెత్తుపేట వద్ద కొత్త ముఖద్వారాన్ని తెరిస్తే సమస్య సమసిపోతుందని జిల్లా జాలర్లు ప్రభుత్వానికి విన్నవించారు. అప్పడే కాకినాడ, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలనుంచి మత్స్యశాఖకు చెందిన శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించారు. అది కూడా కార్యరూపంలోకి రాకపోవడంతో ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఎండాకాలం సమీపిస్తుందంటే పులికాట్ సరస్సులో తాటి దుంగలను నాటి.. అక్కడి వరకు తమిళనాడు సరిహద్దులు ఉన్నాయంటూ అక్కడి జాలర్లు ఆంధ్రా మత్స్యకారలు రాకూడదని హెచ్చరిం చడం అనవాయితీగా మారింది. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరదు. మహిళలపై ఆధారపడ్డాం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయింది. మూడు రోజుల పాటు వేట సాగించినా పూట గడవటం లేదు. ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చి చేపలు, చెన్నైనుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి మా కుటుంబాల్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట–పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం వుంది. సరస్సులో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. సోదరుల్లా మెలగాల్సిన మేం బ్రతుకుదెరువు కోసం శత్రువులుగా మారుతున్నాం. – కేసీ రమేష్, మత్స్యకారుడు, భీములవారిపాళెం కొత్తకుప్పం -
మోదీ దౌత్యం
* భారత జైలుకు జాలర్లు * మత్స్యకారుల్లో ఆనందం * జాలర్లకు ఉరిశిక్షను రద్దు చేయాలని ఆందోళన చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక ఆధీనంలోఉన్న కచ్చదీవుల్లో తమిళనాడు జాలర్లు చేపల వేటసాగిస్తూ హద్దుమీరుతున్నారని ఆ దేశం తరచూ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేగాక అదేపనిగా తమిళ జాలర్లపై దాడులకు పాల్పడుతూ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ దశలో రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన 8 మంది జాలర్లు హెరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశారుు. అప్పటి నుంచి అంటే గత 35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో 5 గురికి ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న శ్రీలంక కోర్టు తీర్పు చెప్పింది. ఈనెల 14 వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కక్షపూరిత వైఖరితో అమాయకులకు శ్రీలంక ఉరిశిక్ష విధించిందని తమిళనాడు ముక్తకంఠంతో ఖండించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న దృష్ట్యా బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు నిరసన గళం విప్పాయి. తీర్పు వెలువడిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం పరిస్థితి తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అన్ని కోణాల నుంచి ఒత్తిడి పెరగడంతో శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయసాగింది. ఉరిశిక్ష పడిన జాలర్ల అంశంపై శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9న టెలిఫోన్ ద్వారా సంభాషించారు. తమిళనాడులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చల్లబడేందుకుఐదుగురు జాలర్లను భారత దేశంలోని ఏదేని జైలుకు తరలించాలని కోరారు. రాజపక్సే అంగీకరించారు. రాజపక్సే మీడియా ప్రతినిధి మోహన్ సమీరనాయకే ఈ విషయాన్ని ధృవీకరించారు. భారత ప్రధాని మోదీ, రాజపక్సేతో చర్చించడం, తమిళ జాలర్లను భారత్కు తరలించేందుకు రాజపక్సే అంగీకరించిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే వారిద్దరి సంభాషణల్లోని పూర్తి వివరాలు తనకు తెలియవన్నారు. ఆనందాలు-ఆందోళనలు: ఉరిశిక్ష పడడంతో ప్రాణాలతో తిరిగిరారనే ఆవేద నలో మునిగిపోయిన మత్స్యకార కుటుంబాలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నాయి. శ్రీలంక చెర నుంచి ముందు బయటపడితే భారత ప్రభుత్వానికి నచ్చజెప్పి తమవారి ప్రాణాలను రక్షించుకోవచ్చనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురి జాలర్లను మదురై జైలుకు తరలించాలని కోరుతూ మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలిసింది. మరోవైపు ఐదుగురు జాలర్ల ఉరిశిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళన టీనగర్: రామేశ్వరం తమిళ జాలర్లకు శ్రీలంక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ మద్రాసు హైకోర్టు న్యాయవాదులు సోమవారం ఆందోళన చేశారు. హైకోర్టు విధులను బహిష్కరించారు. దీంతో చెన్నై ప్యారిస్లోగల హైకోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం మోపిన అభియోగంపై ఐదుగురు జాలర్లకు కొలంబో న్యాయస్థానం ఉరిశిక్షను విధించింది. ఈ ఉరిశిక్షను రద్దు చేయాలంటూ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నాయి. ఉరిశిక్షకు వ్యతిరేకత తెలుపుతూ మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆర్సి పాల్ కనకరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ధర్నా చేయడం, హైకోర్టు విధులను బహిష్కరించేందుకు నిర్ణయించారు. మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ హైకోర్టు విధులను బహిష్కరించేందుకు తీర్మానించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో న్యాయవాదులందరూ మద్రాసు హైకోర్టు ఆవిన్ గేటు సమీపాన గుమికూడారు. న్యాయవాదుల సంఘం కార్యదర్శి అరివళగన్, ఉపాధ్యక్షుడు గిని మాన్యువేల్ ఆధ్వర్యంలోను, మహిళా న్యాయవాదుల సంఘం అధ్యక్షురాలు నళిని ఆధ్వర్యంలోను న్యాయవాదులు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఆ తర్వాత ఎన్ఎస్సి బోస్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. హైకోర్టు విధులను బహిష్కరించడంతో హైకోర్టు, సెషన్స్ కోర్టులలో కేసుల విచారణలు స్థంభించాయి. -
లంక సేన దాడి
లంక సేనలు మళ్లీ జాలర్లపై వీరంగం సృష్టించాయి. కచ్చదీవుల్లో మంగళవారం చేపల వేటలో నిమగ్నమైన రామేశ్వరం జాలర్లపై తమ ప్రతాపం చూపించాయి. దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాది 20 మందిని పట్టుకెళ్లాయి. వారితో పాటు నాలుగు మర పడవలను కూడా తీసుకెళ్లి పోయారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. రాష్ర్ట ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం శ్రీలంక మెడలు వంచేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా శ్రీలంక మత్స్య శాఖ, తమిళ మత్స్యశాఖ అధికారులు, రెండు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో చర్చలకు నిర్ణయించారు. చర్చలు ఈనెల 27న చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. ఈ చర్చలకు ముందుగా ఆయా దేశాల చెరలో ఉన్న జాలర్ల విడుదలకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడులో బందీలుగా ఉన్న శ్రీలంక జాలర్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. శ్రీలంక చెరలో ఉన్న 250 మంది తమిళ జాలర్లను ఆ దేశం దశలవారీగా విడుదల చేసే పనిలో పడింది. అయితే, పడవలను మాత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తుండటం జాలర్లలో ఆగ్రహాన్ని రేపుతోంది. ఇప్పటి వరకు సుమారు వంద పడవలు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో జరగనున్న చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా నిర్ణయాలు తీసుకుని, పడవలను విడిపించుకోవచ్చని, ఇక దాడులకు ముగింపు పలకవచ్చన్న ఆశాభావంతో ఉన్న రాష్ట్ర జాలర్లను మంగళవారం జరిగిన ఘటన విస్మయంలో పడేసింది. మళ్లీ దాడి : రామేశ్వరం నుంచి సోమవారం రాత్రి 500 పడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అర్ధరాత్రి వేళ కచ్చ దీవుల సమీపంలో కొన్ని పడవల్లోని జాలర్లు వలలు విసిరి వేటలో నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో అటువైపుగా ఐదారు బోట్లలో వచ్చిన శ్రీలంక నావికాదళం విరుచుకు పడింది. ఇక్కడ చేపల్ని వేటాడేందుకు వీలు లేదంటూ వలల్ని తెంచి పడేసింది. దీంతో కొన్ని పడవల్లోని జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయితే, నాలుగు పడవలు వారికి చిక్కాయి. ఆ పడవల్లో ఉన్న వారిని బాటిళ్లతో, దుడ్డుకర్రలతో కొట్టినట్టు సమాచారం. ఆ పడవలను తమ బోట్ల ద్వారా ఢీ కొడుతూ కాసేపు వీరంగం సృష్టించారు. తమ వాళ్లు నాలుగు పడవలతో శ్రీలంక నావికాదళానికి చిక్కిన సమాచారంతో ఇతర జాలర్లు ఆందోళనలో పడ్డారు. రామేశ్వరం జాలర్లు మంగళవారం చేపల వేటను నిషేధించారు. చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంక నావికాదళం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ వాళ్లను విడుదల చేయకుంటే, చర్చలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని జాలర్ల సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం శ్రీలంక నుంచి రాక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.