లంక సేన దాడి
Published Wed, Jan 22 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
లంక సేనలు మళ్లీ జాలర్లపై వీరంగం సృష్టించాయి. కచ్చదీవుల్లో మంగళవారం చేపల వేటలో నిమగ్నమైన రామేశ్వరం జాలర్లపై తమ ప్రతాపం చూపించాయి. దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాది 20 మందిని పట్టుకెళ్లాయి. వారితో పాటు నాలుగు మర పడవలను కూడా తీసుకెళ్లి పోయారు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. రాష్ర్ట ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం శ్రీలంక మెడలు వంచేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా శ్రీలంక మత్స్య శాఖ, తమిళ మత్స్యశాఖ అధికారులు, రెండు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో చర్చలకు నిర్ణయించారు. చర్చలు ఈనెల 27న చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. ఈ చర్చలకు ముందుగా ఆయా దేశాల చెరలో ఉన్న జాలర్ల విడుదలకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడులో బందీలుగా ఉన్న శ్రీలంక జాలర్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. శ్రీలంక చెరలో ఉన్న 250 మంది తమిళ జాలర్లను ఆ దేశం దశలవారీగా విడుదల చేసే పనిలో పడింది. అయితే, పడవలను మాత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తుండటం జాలర్లలో ఆగ్రహాన్ని రేపుతోంది. ఇప్పటి వరకు సుమారు వంద పడవలు శ్రీలంక ఆధీనంలో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో జరగనున్న చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా నిర్ణయాలు తీసుకుని, పడవలను విడిపించుకోవచ్చని, ఇక దాడులకు ముగింపు పలకవచ్చన్న ఆశాభావంతో ఉన్న రాష్ట్ర జాలర్లను మంగళవారం జరిగిన ఘటన విస్మయంలో పడేసింది.
మళ్లీ దాడి : రామేశ్వరం నుంచి సోమవారం రాత్రి 500 పడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అర్ధరాత్రి వేళ కచ్చ దీవుల సమీపంలో కొన్ని పడవల్లోని జాలర్లు వలలు విసిరి వేటలో నిమగ్నం అయ్యారు. ఆ సమయంలో అటువైపుగా ఐదారు బోట్లలో వచ్చిన శ్రీలంక నావికాదళం విరుచుకు పడింది. ఇక్కడ చేపల్ని వేటాడేందుకు వీలు లేదంటూ వలల్ని తెంచి పడేసింది. దీంతో కొన్ని పడవల్లోని జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయితే, నాలుగు పడవలు వారికి చిక్కాయి. ఆ పడవల్లో ఉన్న వారిని బాటిళ్లతో, దుడ్డుకర్రలతో కొట్టినట్టు సమాచారం. ఆ పడవలను తమ బోట్ల ద్వారా ఢీ కొడుతూ కాసేపు వీరంగం సృష్టించారు. తమ వాళ్లు నాలుగు పడవలతో శ్రీలంక నావికాదళానికి చిక్కిన సమాచారంతో ఇతర జాలర్లు ఆందోళనలో పడ్డారు. రామేశ్వరం జాలర్లు మంగళవారం చేపల వేటను నిషేధించారు. చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంక నావికాదళం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ వాళ్లను విడుదల చేయకుంటే, చర్చలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని జాలర్ల సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం శ్రీలంక నుంచి రాక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.
Advertisement